ఓటమి భయమా?..ఫ్యూచర్ స్ట్రాటజీయా..?

Update: 2018-11-30 15:30 GMT

తెలుగుదేశం పార్టీ వారసుడు నారా లోకేశ్ తెలంగాణ సమరక్షేత్రంలో అడుగు పెట్టకుండా జాగ్రత్త వహిస్తున్నారు. భవిష్యత్తు వ్యూహమా? ఓటమి భయమా? అన్నది పరిశీలకులకు అంతుపట్టడం లేదు. నిజానికి లోకేశ్ ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి. గతంలో తాను తెలంగాణ భూమి పుత్రుడిని అని క్లెయిం చేసుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ ఎన్నికల్లోనూ లోకేశ్ అన్నీ తానై వ్యవహరించారు. ఇప్పుడు ఆయన పేరు వినిపించడం లేదు. ప్రచార రంగంలో కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులు సైతం తమకు మద్దతుగా తిరగమని ఆహ్వానించడం లేదు. తండ్రి తర్వాత పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న లోకేశ్ కు ఇది కొంత ఇబ్బందికరమైన అంశమే. అయితే రాజకీయ సమీకరణలు అనుకూలంగా లేకపోవడంతో దూరంగానే ఉండిపోతున్నారని చెబుతున్నారు తెలుగుదేశం నాయకులు. 2009 నుంచి టీడీపీలో లోకేశ్ చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గా అన్నీ తానై వ్యవహరించారు. తొలిదశలో తెలంగాణ టీడీపీ నాయకులతోనే ఆయనకు సన్నిహిత సంబంధాలు ఎక్కువగా ఉండేవి. కార్యకర్తలకు శిక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలు, ఆర్థిక సాయం వంటి పనుల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. పార్టీపై అదుపు సాధించాలంటే కార్యకర్తలకు చేరువ కావాలనే ఉద్దేశంతో అన్నీతానై బాధ్యతలు తీసుకునేవారు.

పుట్టి పెరిగినా...

లోకేశ్ జననం, విద్యాభ్యాసం వంటివన్నీ హైదరాబాదుతోనే ముడిపడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చుట్టపు చూపుగా వెళ్లిరావడమే తప్ప వ్యక్తిగతమైన అనుబంధం లేదు. బంధుమిత్రులంతా హైదరాబాదులోనే ఉండటంతో లోకేశ్ హైదరాబాదీగానే ఎదిగారు. 2014 ఎన్నికల తర్వాత సైతం తెలంగాణ టీడీపీకి గైడెన్సు ఇవ్వడంలోనూ , నాయకులు, కార్యకర్తల సహాయ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉండేవారు. రేవంత్ రెడ్డి వంటి నాయకులు రాజకీయంగా అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మార్చిన తర్వాత క్రమేపీ నగరానికి దూరమవుతూ వచ్చారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింతగా ఏపీ విషయాల్లోనే తలమునకలు కావాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి వంటివారు కాంగ్రెసు లో ప్రవేశించిన తర్వాత లోకల్ గా గైడెన్సు ఇచ్చేవారూ కరవు అయ్యారు. ఇక్కడి నేతల వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబు నాయుడికి మాత్రమే సంపూర్ణమైన అవగాహన ఉంది. పైపెచ్చు భవిష్యత్ రాజకీయమంతా ఏపీతోనే ముడిపడి ఉండటంతో అక్కడి నాయకులు, ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు సాధించడమే లక్ష్యంగా లోకేశ్ పనిచేయాల్సి వస్తోంది. వీటన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సి వస్తే ఏపీ పాలిటిక్స్ ను పూర్తిగా తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలి. తెలంగాణలో పెద్దగా వచ్చేదీ లేదు, పోయేదీ లేదు. ఏపీలో ప్రభుత్వమూ, పార్టీ రెంటిపైనా నాయకత్వ సామర్థ్యం సాధించాలి. అందుకోసమే లోకేశ్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారనేది పార్టీ వర్గాలు చెబుతున్న సమాచారం.

చేదు అనుభవాలు...

తెలంగాణ వ్యవహారాలకు సంబంధించి లోకేశ్ కు కొన్ని చేదు అనుభవాలున్నాయి. ఓటుకు నోటు విషయంలో తెలుగుదేశానికి అనుకూలంగా మద్దతు కూడగట్టడంలో చినబాబు పాత్ర ఉందని పార్టీవర్గాలు చెబుతుంటాయి. అప్పటికి తెలుగుదేశం తెలంగాణలో బలమైనపక్షంగా ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెసు తర్వాత మూడో పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. తెలంగాణకు గుండెకాయవంటి గ్రేటర్ హైదరాబాదులో అత్యధిక స్థానాలతో రాజకీయంగా మూల విరాట్టుగా నిలిచింది. ఉమ్మడి రాజధాని అనే టాగ్ ఎలాగూ ఉంది. బొటాబొటి మెజార్టీతో టీఆర్ఎస్ సర్కారు ఏర్పాటు చేసిన తర్వాత చాలాకాలం పాటు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. ఒకవైపు విభజన సమస్యలు, కేంద్రప్రభుత్వ సహకారం లేకపోవడం , చంద్రబాబు వంటి సీనియర్ నేత హైదరాబాదులో ప్రత్యర్థిగా ఉండటం వంటివన్నీ ఇబ్బందికరంగా ఉండేది. కాంగ్రెసు కంటే టీడీపీని చూసే కేసీఆర్ కొంత భయపడాల్సిన పరిస్థితి ఉండేది. టీఆర్ఎస్ రాజకీయ బలహీనతలను ఆసరాగా చేసుకుంటూ ఆధిక్యం సాధించాలనే ఎత్తుగడలతో టీడీపీ దూకుడు ప్రదర్శించింది. అందులో భాగమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీఫెన్సన్ ఓటును చేజిక్కించుకునే వ్యూహం. లోకేశ్ సూచనలమేరకు రేవంత్ రెడ్డి , టీడీపీ కి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండే ఒక రాజ్యసభసభ్యుడు ఈవిషయంలో కీలక భూమిక పోషించారని పార్టీ వర్గాల భావన. ఈ ఉదంతంలో పార్టీ రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిపోవడంతో తెలంగాణపై రాజకీయంగా పట్టు కోల్పోవాల్సి వచ్చింది. ఈ చేదు అనుభవం లో లోకేశ్ పేరు బయటికి రాకుండా పార్టీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగింది. కానీ అంతర్గతంగా మాత్రం పార్టీ మొత్తం కుదుపునకు గురయ్యింది. దీనిని పార్టీలో లోకేశ్ ఎపిసోడ్ గానే చెప్పుకుంటుంటారు.

పోలిక కష్టాలు...

లోకేశ్ కు సంబంధించి పోలిక కష్టాలూ వెన్నాడుతున్నాయి. కేసీఆర్ వారసునిగా కేటీఆర్ మంత్రి పదవి స్వీకరించిన తర్వాత తొలుత పంచాయతీరాజ్ తీసుకున్నారు. లోకేశ్ కూడా దానినే కోరి మరీ తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేటీఆర్ మంత్రి. లోకేశ్ కూడా దాని బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలో అర్బనైజేషన్ ఎక్కువగా ఉంది. దాంతో మునిసిపల్ శాఖకు మారిపోయారు కేటీఆర్. ఏపీలో గ్రామప్రాంతాలే ఎక్కువ. అందువల్ల దానినే కొనసాగిస్తున్నారు లోకేశ్. టీడీపీ, టీఆర్ఎస్ లకు సంబంధించి వారసుల్లో ఎవరు సమర్ధులనే చర్చ ప్రజల్లోనూ కొనసాగుతోంది. ఉద్యమాల్లో పాల్గొనడంతోపాటు ప్రత్యక్ష ప్రజాప్రతినిధిగా వ్యవహరించడం తో కేటీఆర్ కు అడ్వాంటేజ్ లభిస్తోంది. మంచి వక్తగా కూడా ఆయనను చెప్పుకోవచ్చు. ఈ విషయంలో లోకేశ్ కు మంచి మార్కులు పడవు. గతంలో జీహెచ్ ఎంసీ ఎన్నికలకు టీడీపీ తరఫున బాధ్యతను లోకేశ్ తీసుకున్నారు. టీఆర్ఎస్ బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారు. టీఆర్ఎస్ అనూహ్య విజయాలు సాధించింది. టీడీపీ ఘోరపరాజయం చవిచూసింది. ఇప్పుడు ప్రజాకూటమి తరఫున లోకేశ్ రంగంలోకి దిగితే బాధ్యత వహించాల్సి ఉంటుంది. టీడీపీ దెబ్బతింటే ఆ పరాభవ భారాన్ని వహించాలి. అందుకే దీనికి పూచీకత్తు వహించేందుకు చంద్రబాబు నాయుడే స్వయంగా రంగంలోకి దిగారు. గెలుపోటముల ప్రభావం బాబు నాయకత్వ సామర్థ్యంపై పెద్దగా పడదు. అందువల్ల లోకేశ్ ను ఈ ఎన్నికలకు దూరంగా ఉంచారనేది రాజకీయ వర్గాల భావన.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News