నథింగ్ ... బట్ పాలిటిక్స్....!!

Update: 2018-11-02 15:30 GMT

రాజకీయాలు నేర్చుకోవడానికి చంద్రబాబు వద్ద చేరిపోవాలి. సమయానుకూల నిర్ణయాలు, ప్రత్యర్థులను పావులుగా వినియోగించుకోవడంలో చాకచక్యం అతని సొంతం. దేశంలో సీనియర్ రాజకీయవేత్తలలో ఒకరిగా తనను తాను చెప్పుకుంటుంటారు. అంతకుమించి పొలిటికల్ టైమింగ్ లో ఆయనను మించిన సీనియర్ లేరనే చెప్పుకోవాలి. శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్ వంటి వారు నిజానికి వయసు, అనుభవం రీత్యా చంద్రబాబు నాయుడికంటే సీనియర్లు. కానీ ఎత్తుగడలు, ఎదురీతలు, పరిస్థితులను మలచుకోవడంలో చంద్రబాబే సిద్ధహస్తుడు. అందుకే హస్తం పార్టీ ఆధారపడవచ్చనుకుంటోంది. నిజానికి హస్తం పార్టీని ఆయన వాడేసుకోవాలనుకుంటున్నారు. రాహుల్ తో కలయిక రహస్యమిదే. ఎవరు ఎవరిని బుట్టలో వేసేస్తున్నారు. ఎవరి వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది? అన్న రాజకీయ గణాంకాలు మొదలయ్యాయి. కచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడి గేమ్ ప్లాన్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గతంలో బీజేపీ కి చంద్రబాబు నాయుడి చేతిలో రెండు పర్యాయాలు పరాభవం ఎదురైంది. ఇప్పుడు కాంగ్రెసుకూ అదే పరిస్థితి ఎదురుకావచ్చనే రాజకీయ జోస్యాలూ జోరందుకుంటున్నాయి.

కిరణ్ తో కిరికిరి...

చిత్తూరు రాజకీయాల్లో తొలి నుంచీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం చంద్రబాబు నాయుడితో తీవ్రంగా విభేదిస్తూ వచ్చింది. చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా జిల్లా రాజకీయాల్లో ఒక బలమైన నాయకునిగా కిరణ్ ను తయారు చేయాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి భావించారు. అందుకే చీఫ్ విప్ పదవికట్టబెట్టారు. ఆతర్వాత స్పీకర్ ను చేశారు. నిజానికి సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షనాయకునిగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రితోపాటు స్పీకర్ ను ఛైర్ లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. కానీ ఆ కనీస సంప్రదాయాన్నిపాటించడానికి సైతం చంద్రబాబు ఇష్టపడలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఆవిర్భవించింది. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించింది. అప్పటికి ఉన్న పరిస్థితుల్లో కిరణ్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఉంది. రాజశేఖరరెడ్డి మరణం సెంటిమెంటు కారణంగా రాష్ట్రంలో వైసీపీ హవా నడుస్తోంది. దీంతో ఆగర్భ శత్రువుగా భావించే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు పరోక్ష సహకారం అందించారు. తనది కాని సమయంలో శత్రువుని మిత్రునిగా భావించే ఎత్తుగడ ఇది. తద్వారా తన పార్టీ పెద్ద రిస్క్ నుంచి బయటపడింది.

పవర్ గేమ్ లో పట్టు...

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి రావాలంటే అనేక సమీకరణలు కలిసి రావాలని చంద్రబాబు గ్రహించారు. వైసీపీ వైపున ఇంకా సెంటిమెంటు కొనసాగుతోంది. అందుకే దానిని తిప్పికొట్టడానికి దేశవ్యాప్తంగా ఉన్న మోడీ హవాను, పవన్ కల్యాణ్ గ్లామర్ ను తనవైపు వీచేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పవన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన మద్దతు అభ్యర్థించారు. 2004లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. మోడీతో 2002లోనే వ్యక్తిగతంగా విభేదించారు. కానీ తన రాజకీయ అవసరాలకోసం మళ్లీ కమలం పార్టీతో చేతులు కలిపారు. 2014లో తాను విమర్శించిన మోడీతోనే చేతులు కలిపారు. ఎటువైపు గాలి వీస్తుందో గ్రహించి దానికి అనుకూలంగా నావ నడిపితే అధికార తీరం సాఫీగా చేరుకోవచ్చనే సూత్రాన్ని అమలు చేశారు. పవర్ గేమ్ లో పట్టు సాధించేందుకు చిన్నాపెద్దా తేడా లేకుండా అవసరానికి అనుగుణంగా వ్యవహరించాలనే చాకచక్యాన్ని ప్రదర్శించారు. మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి జయప్రకాశ్ నారాయణ పోటీ చేస్తుంటే మద్దతు ఇస్తానని పవన్ ప్రకటించారు. మరోసారి ఆయన ఇంటికెళ్లి చర్చలు జరిపి ఆనిర్ణయాన్ని ఉపసంహరింపచేశారు చంద్రబాబు. అంతపెద్ద నాయకుడు తన వద్దకు వచ్చారని పవన్ సంతోషించవచ్చు. కానీ పని కావడమే అక్కడ నాయకునికి ముఖ్యం. ఇప్పుడు రాహుల్ వద్దకు వెళ్లి కలవడంలోనూ అదే సూత్రం వర్తిస్తుంది.

తగ్గి నెగ్గడమే తన విద్య....

విద్యార్థి రాజకీయాల నుంచి చంద్రబాబునాయుడు ఎత్తుపైఎత్తుల్లో దిట్ట. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం ఎన్నికల్లోప్రాబల్యం కలిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం నెగ్గకుండా బీసీల కూటమిని ప్రోత్సహించి వెన్నుదన్నుగా నిలిచి పొలిటికల్ ఎలయన్స్ లో తన సత్తా చూపారు. తాను సొంతంగా విజయం సాధించే అవకాశం లేనప్పుడు ప్రత్యర్థి విజయం సాధించకుండా ప్రత్యామ్నాయాన్ని ముందుకు తేవడమే పాలిటిక్స్. అలాగే 1980లలో కాంగ్రెసు పార్టీ తన వర్గం మనిషిని కాకుండా జెడ్పీ ఛైర్మన్ గా వేరొకరిని బరిలో నిలిపింది. దాంతో క్రాస్ ఓటింగుతో తన వర్గం అభ్యర్థి కుతూహలమ్మను గెలిపించి కాంగ్రెసు అధిష్టానానికే షాక్ ఇచ్చారు. మంత్రిగా ఉన్న ఆయనను కాంగ్రెసు అధిష్టానం సస్పెండ్ చేస్తే మరుసటి రోజుకే ఢిల్లీ రాజకీయంతో రద్దు చేయించుకోగలిగారు. రాజకీయం తొలినాళ్లలోనే చంద్రబాబు చేసిన రాజకీయ విన్యాసాలివి. ఇప్పుడు బీజేపీ బూచిని చూపించి ఏపీ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది టీడీపీ. నిజానికి కమలం పార్టీ వాటా ఏపీలో అంతంతమాత్రమే. కానీ దానిపై అక్కసుతో టీడీపీని ప్రజలు ఎంచుకోవాలనేది వ్యూహం. అందుకుగాను కాంగ్రెసును ఒక పావుగా జాతీయ స్థాయిలో చూపించాలనేది ఎత్తుగడ. రాబోయే కాంగ్రెసు అధికార రథంలో కాబోయే భాగస్వామి టీడీపీ అన్న పిక్చర్ ఇవ్వడం ద్వారా ఈక్వేషన్లు తనకు అనుకూలం చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. దీనిని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News