చంద్రబాబుకు హిస్టరీ తెలియదా....?

Update: 2018-10-26 16:30 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఎన్నికల పనుల్లో తలమునకలవుతున్నారు. వాస్తవానికి వారి సొంత రాష్ట్రం ఏపీలో ఇప్పుడు ఎన్నికలు ఏమీలేవు. వచ్చే ఏడాది వేసవిలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో తెలుగుదేశం ఉనికి కాపాడుకునేందుకు తండ్రీ,కొడుకులు కసరత్తు చేస్తున్నారు. 2014 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవప్రదమైన ఓట్లు, సీట్లు సాధించిన సైకిల్ పార్టీ మళ్లీ వాటిని కాపాడుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. బద్ధ విరోధి అయిన హస్తం పార్టీకి స్నేహహస్తాన్ని అందించింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉనికిని కాపాడుకోవడం అనివార్యంగా మారింది. రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆంధ్రుల ఓట్లపై ఆశలు పెట్టుకుని రంగంలోకి దిగుతోంది. పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున అర్థబలం, అంగబలానికి కొదవలేదు.

మనుగడ సాధ్యమేనా.....?

తెలంగాణ భాగమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పొరుగు రాష్ట్రంపైన పట్టుకోసం ప్రయత్నించడంలో అభ్యంతరం పెట్టాల్సింది ఏమీలేదు. గత ఎన్నికల్లో గౌరవ ప్రదమైన స్థానాలు సాధించిన పార్టీగా బరిలోకి దిగడంలో తప్పేమీలేదు. కానీ ఈ ప్రయత్నం ఫలించే అవకాశం లేదన్న రాజకీయ విశ్లేషకుల అంచనాలను, అభిప్రాయాలను తోసిపుచ్చలేం. నలభై ఏళ్ల అనుభవం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అందరికంటే ఎక్కువ కాలం ఏకధాటిగా 9 ఏళ్లు పాలించిన చంద్రబాబుకు చరిత్ర తెలియదని అనుకోలేం. ఒక ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో మనుగడ సాగించిన దాఖాలాలు లేవన్నది రాజకీయ పండితుల వాదన. చరిత్ర చెబుతున్న సత్యం కూడా. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత విభజన అంశాలపై ఏ రాష్ట్రం తరుపున మాట్లాడాలన్న సంశయం వెంటాడుతుంది. ఎటూ చెప్పుకోలేక సతమతమవుతుంటుంది. ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

విడిపోయిన రాష్ట్రాల్లో......

ఉదాహరణకు 2000 సంవత్సరంలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ ను విభజించి ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ను విభజించి ఛత్తీస్ ఘడ్, బీహార్ ను విభజించి ఝార్ఖండ్ ను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కొత్త రాష్ట్రాల్లో పూర్తిగా కనుమరుగయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు నూతన రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ లో గత 18 ఏళ్ల నుంచి జాతీయ పార్టీలు తప్ప ప్రాంతీయ పార్టీల పాత్ర పూజ్యం. బీహార్ ను విభజించి ఝార్ఖండ్ ను ఏర్పాటు చేశారు. అప్పటి వరకూ బీహార్ లో బలంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), జనతాదళ్ యునైటెడ్ ఝార్ఖండ్ లో జీరోలయ్యాయి. అక్కడ వాటి ప్రభావం శూన్యం.

కాంగ్రెస్, బీజేపీ లే కొత్త రాష్ట్రంలో ప్రధాన పాత్రధారులుగా మారాయి. మధ్యప్రదేశ్ ను విభజించి ఏర్పాటు చేసిన ఛత్తీస్ ఘడ్ లోనూ అదే పరిస్థితి. అక్కడ అజిత్ జోగీ లాంటి ప్రాంతీయ పార్టీ నాయకుడు జాతీయ పార్టీలను దెబ్బతీస్తున్నారు తప్ప అధికారాన్ని అందుకోలేకపోతున్నారు. ఇప్పటికీ అదే పరిస్థితి.

అక్కడ బలంగా ఉన్నా......

ఇక ప్రాంతీయ పార్టీలకు దిక్సూచీ అయిన తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే రాష్ట్రం వెలుపల ప్రభావాన్ని చూపించలేక పోతున్నాయి. కనీసం పొరుగున ఉన్న పుదుచ్చేరిలోనూ వాటి మాట చెల్లుబాటు కావడం లేదు. అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. పంజాబ్ లోని అకాళీదళ్ పక్కనే ఉన్న హర్యానాలో జీరో. మహారాష్ట్రలోని శివసేన రాష్ట్రమంతటా కూడా విస్తరించలేదు. అది కొంకణ్, మరట్వాడా ప్రాంతాలకే పరిమితమైంది. దివంగత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ వ్యవస్థాపకుడైన హర్యానాలోని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ), మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) రెండు జిల్లాలకే పరిమితమయ్యాయి. కేరళలోని ముస్లింలీగ్ కొన్ని నియోజకవర్గాలకే పరిమితం. ఒడిశాలోని బిజూ జనతాదళ్ రాష్ట్రానికే పరిమితం. జమ్మూ కాశ్మీర్ లోని పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీపీ), నేషనల్ కాన్ఫరెన్స్ లు

కూడా కాశ్మీర్ లోయకే పరిమితం. జమ్మూలో వాటి ప్రభావం శూన్యం. కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (ఎస్) నాలుగైదు జిల్లాల్లోనే ప్రభావం చూపుతుంది. పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ ఇందుకు మినహాయింపు కాదు. ప్రస్తుతం తెలంగాణలో చక్రం తిప్పుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఉత్తర తెలంగాణ పార్టీగా ముద్ర వేసుకుంది. 2014 ఎన్నికలకు ముందు వరకూ దక్షిణ తెలంగాణలో దానికి చెప్పుకోదగ్గ బలం లేదు.

రెండు నాల్కల ధోరణినే.....

ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలియనవి కావు. అర్థం కానివి కూడా కావు. అయినా మొండి పట్టుదలతో పోరాడుతున్నారు. ప్రాంతీయ పార్టీలు మరో రాష్ట్రంలో మనుగడ సాగించలేకపోవడానికి ప్రత్యేక కారణాలు లేవు. ఏదైనా ఒక అంశంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడితే ఎవరి పక్షం వహించాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సహజంగా అధికారంలో ఉన్న రాష్ట్రం వైపే ప్రాంతీ పార్టీ మాట్లాడుతోంది. అటువంటప్పడు మరో రాష్ట్రంలో మనుగడ పార్టీకి కష్టమవుతుంది. తెలంగాణలో తెలుగుదేశాన్ని ఆంధ్రా పార్టీగా స్థానికులు పరిగణిస్తారు. విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు తలెత్తాయి. కృష్ణా, గోదావరి జలాలు, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ తదితర విషయాల్లో ఇప్పటికీ కొట్లాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో టీడీపీ రెండు నాల్కల ధోరణితో మాట్లాడక తప్పదు. అందువల్ల ఏదో ఒక రాష్ట్రంలో వెనుకబడటం అనివార్యం. చరిత్ర చెబుతున్న ఈ సత్యం చంద్రబాబుకు తెలియదని అనుకోలేం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News