నోట్ దిస్ పాయింట్....!

Update: 2018-10-06 15:30 GMT

రాజకీయ ప్రత్యర్థులను తమ అధీనంలోని యంత్రాంగంతో చట్టబద్ధంగా నియంత్రించవచ్చా? ప్రత్యర్థులపై పట్టు బిగించి భయబ్రాంతులకు గురి చేయవచ్చా? చట్టం సర్కారు పెద్దల చుట్టంగా పనిచేయకతప్పదా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు వెదకాల్సి ఉంటుంది. అదే సమయంలో రాజకీయాల్లో ఉన్నంతమాత్రాన అక్రమార్కులు తప్పించుకోవచ్చా? పార్టీల అండ ఉంది కాబట్టి కక్ష సాధింపనే నెపంతో సులభంగా గట్టెక్కేయవచ్చా? తాము చేస్తున్న అవకతవకలు కనిపించకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాజకీయ ముసుగు వేసుకుంటే సరిపోతుందా? అన్న ప్రశ్నలకు ఆరోపణలు చేస్తున్నవారు సైతం సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. కేంద్రానికి దూరమై ప్రత్యక్షంగా పోరాటాన్ని చేపట్టిన తెలుగుదేశం దీనిపై పెద్ద చర్చకు శ్రీకారం చుడుతోంది. రాజకీయ అవకాశంగా ఆదాయపన్ను శాఖ దాడులను మలచుకునే అవకాశం కనిపిస్తోంది. ఆదాయపన్ను, నిఘా, విచారణ సంస్థల విశ్వసనీయత ప్రమాదంలో పడుతోంది. సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అవినీతి పరులు సులభంగా తమ అక్రమాలను పక్కదారి పట్టించేందుకు , బాధిత వేషం వేసేందుకు వీలు కలుగుతోంది.

గుండెల్లో గుబులు....

రాజకీయం వేరు. వ్యాపారం వేరు. ఈ రెంటినీ కలగలపి చేయాలనుకుంటేనే చిక్కు వచ్చి పడుతుంది. వ్యాపారపరంగా బలమైన ముద్ర వేసిన వారు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. గతంలో ఆయా వ్యాపార, కాంట్రాక్టు వర్గాల వారు పార్టీలకు, నాయకులకు విరాళాలు ఇచ్చేవారు. తద్వారా ప్రభుత్వ శాఖల దాడుల నుంచి కొంతమేరకు రక్షణ పొందేవారు. అయితే గడచిన రెండు దశాబ్దాలుగా ఈ పాత్రలు మారిపోయాయి. తామే సొంతంగా రాజకీయాల్లో ప్రవేశించడం ద్వారా విరాళాలిచ్చే పద్ధతికి స్వస్తి చెప్పేశారు. అన్ని పార్టీలకు చందాలు ఇవ్వడం కంటే ఎన్నికల్లో తామే సొంతానికి ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోతున్నారు. అధికారయంత్రాంగంపై పెత్తనం చేస్తున్నారు. ప్రయోజనదాయకమైన ఈ తంతు చూసిన తర్వాత పూర్తి కాలపు రాజకీయాల్లో ఉన్నవారు సైతం తమ ధోరణికి వీడ్కోలు పలుకుతున్నారు. వ్యాపారాలు, కాంట్రాక్టుల్లోకి ప్రవేశిస్తున్నారు. రాజకీయాన్ని, వ్యాపారాన్ని కలగాపులగంగా నిర్వహిస్తున్నారు. ఐటీ,ఈడీ వంటి సంస్థలు దాడులు చేసినప్పుడు ఇటువంటి వారే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయాలను సేవగా భావించేవారికి పెద్దగా సమస్యలు ఉండటం లేదు. కాంట్రాక్టు, వ్యాపారాలను వేరుగా నిర్వహించుకునేవారికీ సమస్య లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న ఆదాయపన్నుశాఖ దాడులను తెలుగుదేశం పార్టీ , నాయకులు వ్యూహాత్మకంగా రాజకీయప్రయోజనాలకు అనుగుణంగా మలచుకునే యత్నాలు చేస్తున్నారు.

సెంట్రల్ స్కెచ్...

తెలుగుదేశం పార్టీని రాజకీయంగా వేధించేందుకు కేంద్రప్రభుత్వం ఆదాయపన్ను శాఖను తమపైకి ఉసిగొలుపుతోందని అధినేత సహా ఆపార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందులో పాక్షికంగా మాత్రమే వాస్తవం ఉంది. నారాయణ విద్యా సంస్థలపై గతంలో అనేక సందర్బాల్లో ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది. అయితే ప్రస్తుతం ఆపార్టీకి చెందిన అనేకమంది నాయకులపైనా దాడులు సాగిన మాట వాస్తవం. అదే సమయంలో ఒకరిద్దరు వైసీపీ నాయకులపైనా ఆదాయపన్ను శాఖ దృష్టి సారించింది. కేంద్రప్రభుత్వాన్ని శుద్దపూస అని చెప్పే పరిస్థితులు లేవు. గతంలో తమిళనాడు రాజకీయాల్లో అరాచకంగా తయారైన ఏఐఏడీఎంకే రెండు వర్గాలను ఏకం చేసేందుకు ఆదాయపన్నుశాఖను చక్కగా వినియోగించుకుంది కేంద్రం. గుజరాత్ రాజ్య సభ ఎన్నికల సందర్బంగా ఎమ్మెల్యేలకు ఆశ్రయమిస్తున్నారన్న నెపంతో కర్ణాటక మంత్రిపై అదే శాఖ హఠాత్తుగా దాడులు చేసింది. రాజకీయంగా కేంద్రప్రభుత్వ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనిపించిన ప్రతి సందర్భంలోనూ ఆదాయపన్ను శాఖ అస్త్రంగా పనిచేసింది. ప్రత్యర్థులను నిర్వీర్యులను చేసింది.దీనిని ఆసరా చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసేందుకు, రాజకీయంగా లాభం పొందేందుకు తనదైన స్కెచ్ గీస్తోంది. కేంద్రం వేసే అడుగులకు ప్రతిగా ఎన్నికలతో ముడిపెట్టి ముందరికాళ్లకు బంధం వేయాలనుకుంటోంది తెలుగుదేశం.

దాడులతో దారి కొస్తారా..?

కేంద్రప్రభుత్వ ఏజన్సీలు కొంతమేరకు ప్రభుత్వ ప్రత్యర్థులను నియంత్రించేందుకు ఉపకరిస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. నిధుల సమీకరణ భారీ ఎత్తున సాగుతోంది. ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీలు రెండూ డబ్బులు సమకూర్చుకుంటున్నాయి. ఆర్థిక సంపన్నులు, ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వ్యాపార,కాంట్రాక్టు సంస్థలు, సానుభూతిపరుల నుంచి చందాలు, విరాళాల రూపంలో నిధులను రాబట్టే ప్రక్రియ మొదలైంది. నిధుల విషయంలో అధికార పార్టీకి కొంత అదనపు వెసులుబాటు ఉంటుంది. ప్రతిపక్షం అధికారంలోకి వస్తుందన్న బలమైన నమ్మకం ఉంటే తప్ప పెద్దగా విరాళాలు విదల్చరు. అభ్యర్థులే వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. అధికారపార్టీకి విరాళాలు వెల్లువెత్తుతాయి. ఇందులో ఎక్కువ మొత్తం నల్లధనమనే చెప్పవచ్చు. ఆదాయపన్ను శాఖ దాడుల కారణంగా నల్లధనం పంపిణీ చేయాలంటే ఒకరకమైన భయం ఆవరిస్తుంది. నిధుల సమీకరణ కష్టమవుతుంది. ఆయా పారిశ్రామిక, వ్యాపార సంస్థలు రహస్య నిధులను బయటికి తీయవు. తద్వారా అధికారపార్టీని నియంత్రించవచ్చు. అందుకే బీజేపీ తమపై కక్ష కట్టిందని టీడీపీ ఆరోపిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News