లోకేష్ కు లైన్ క్లియర్ అవుతుందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన తనయుడు నారా లోకేష్ కోసం ఈసారి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఒక లక్ష్యం [more]

Update: 2019-01-13 14:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన తనయుడు నారా లోకేష్ కోసం ఈసారి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఒక లక్ష్యం కాగా, లోకేష్ కు అనుకూల పరిస్థితులు కల్పించడం మరో టార్గెట్. ప్రస్తుతం నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన కీలకంగా మారారు. ఇప్పటికే చంద్రబాబు తన రాజకీయ వారసుడిగా లోకేష్ ను ప్రకటించకపోయినా అనధికారికంగా ప్రకటించినట్లే. వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను బేరీజు వేసుకుంటూ లోకేష్ కు సన్నిహితంగా ఉండే యంగ టీంను రెడీ చేయాలన్న తలంపుతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

అదే పనిలో….

ఇందుకోసం జాబితాను ఇప్పటికే రూపొందించినట్లు చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకునే చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో పార్టీ రాష్ట్రంలో విజయం సాధిస్తే లోకేష్ కు పగ్గాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారన్న ప్రచారం టీడీపీలో జోరుగా సాగుతోంది. అందుకనే సీనియర్ నేతలకు ఈసారి వేరే ఛాన్స్ ఇచ్చి వారి వారసులను రంగంలోకి దించి లోకేష్ కు గ్రౌండ్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారంటున్నారు. ఈ మేరకు పార్టీకి ఇప్పటి వరకూ ఉపయోగపడిన యువనేతల జాబితాను కేంద్ర కార్యాలయం నుంచి ఆయన తెప్పించుకున్నట్లు చెబుతున్నారు. లోకేష్ కూడా ఈ కసరత్తుల్లో పాల్గొంటున్నారని చెబుతున్నారు.

కొందరికి ఖరారయ్యాయని…..

శ్రీకాకుళం జిల్లాలో గౌతు శ్యాంసుందర్ శివాజీ కూతురు గౌతు శిరీష, మంత్రి చింతకాయల అయన్న పాత్రుడు తనయుడు విజయ్ పాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు, అశోక్ గజపతిరాజు కుమార్గె ఆదితి, జ్యోతులనెహ్రూ కుమారుడు పేర్లు చంద్రబాబు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి టిక్కెట్లు ఇస్తే వీరిలో కొందరిని ఎంపీగా పోటీ చేయించడం, మరికొందరికి ఇతర పదవులు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో బోళ్ల బుల్లిరామయ్య మనవడు బోళ్ల రాజీవ్ అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. రాజీవ్ కు ఏలూరు ఎంపీ సీటు ఇచ్చేందుకు చంద్రబాబు దాదాపు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబుకు ఇప్పటికే లైన్ క్లియర్ అయింది.

పరిశీలనలో ఉన్నా…..

ఇక దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్,కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాంప్రసాద్, రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు, కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారులు జగదీష్, భానుప్రసాద్, పరిటాల రవి తనయుడు శ్రీరామ్, టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ వంటి వారు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి విషయంలో ఇంకా చంద్రబాబు స్పష్టత రాలేదని తెలుస్తోంది. వీరిలో పరిటాల సునీత వంటి వారు ఈసారి పోటీ చేస్తేనే బాగుంటుందని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలుగా యంగ్ టీంను రంగంలోకి దించాలన్నది చంద్రబాబు వ్యూహంగా కన్పిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News