బ్యాక్ ఆఫీసే బద్దలు కొట్టిందా…?

ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మరో సారి అందలం ఎక్కాలనుకున్నారు. అందుకే ఎడా పెడా సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇబ్బడి ముబ్బడిగా వరాలు ప్రకటించారు. కానీ ఫలితాలు మాత్రం [more]

Update: 2019-07-05 15:30 GMT

ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మరో సారి అందలం ఎక్కాలనుకున్నారు. అందుకే ఎడా పెడా సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇబ్బడి ముబ్బడిగా వరాలు ప్రకటించారు. కానీ ఫలితాలు మాత్రం దిమ్మతిరిగేలా వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం పార్టీ బ్యాక్ ఆఫీస్ కారణమన్న వాదనలు పార్టీలో విన్పిస్తున్నాయి. చంద్రబాబునాయుడుకు తప్పుడు నివేదికలు ఇవ్వడమే కాకుండా, ప్రజల సంతృప్త స్థాయిని పెంచి చూపుతూ గెలుపు తమదేనన్న ధీమాను ఆయనలో బ్యాక్ ఆఫీస్ కలిగించిందంటున్నారు.

నేరుగా నివేదికలు….

చంద్రబాబునాయుడు ఎక్కువగా బ్యాక్ ఆఫీస్, అధికారుల మీద ఆధారపడ్డారు. ఈ బ్యాక్ ఆఫీస్ లో మాల్యాద్రి, వి.వి.చౌదరి, కృష్ణయ్య లాంటి వారిని ఆయన నమ్ముకున్నారు. వారికి క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు తెలియవు. నారా లోకేష్ టీం ఇందులో కీలక పాత్ర పోషించింది. ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా, సంక్షేమ పథకాల వారీగా బ్యాక్ ఆఫీస్ చంద్రబాబునాయుడుకు నేరుగా నివేదికలు సమర్పించే వీలుండటంతో వీరి ప్రాధాన్యత పార్టీలోనూ పెరిగింది.

చెప్పిందే వేదంలా….

చంద్రబాబునాయుడు వీరిపైనే ఎక్కువగా గురి ఉండటంతో వారి నివేదికలను ఖచ్చితంగా నమ్మేవారు. అంతేకాదు ఎమ్మెల్యేలపైనే బ్యాక్ ఆఫీస్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగానే ఆయన పార్టీ సమావేశాల్లో ప్రస్తావించేవారు. అప్పట్లోనే తప్పుడు నివేదికలను బ్యాక్ ఆఫీస్ ఇస్తుందని చంద్రబాబునాయుడుకు కొందరు ఎమ్మెల్యేలు చెప్పడానికి ప్రయత్నించినా వారి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో బ్యాక్ ఆఫీస్ చెప్పిందే వేదంలా ఐదేళ్లు చంద్రబాబు నడిచారన్నదానిలో ఎటువంటి సందేహంలేదు.

తప్ప చేశానంటూ…..

దారుణ ఓటమి తర్వాత చంద్రబాబునాయుడుకు ఇప్పుడు తెలిసొచ్చింది. బ్యాక్ ఆఫీస్ ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఖచ్చితమైన నివేదికలు ఇవ్వలేదన్న విషయం చంద్రబాబునాయుడు గుర్తించారు. అందుకే పదే పదే ఆయన తాను తప్పు చేశానని కార్యకర్తల ముందు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద బ్యాక్ ఆఫీస్ ప్రక్షాళన జరిగితేనే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ ఉంటుందన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తుండటం విశేషం.

Tags:    

Similar News