బొక్క బోర్లా పడతారా....!

Update: 2018-08-04 15:30 GMT

‘అవ్వా కావాలి. బువ్వా కావాలి’ అంటోంది తెలుగుదేశం. నాకు అందరూ సమానమే అంటుంది జనసేన. ‘రిజర్వేషన్లు సాధ్యం కాదుగా’ అని తేల్చి చెప్పి మళ్లీ పిల్లిమొగ్గ వేస్తుంది వైసీపీ. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కాపు రిజర్వేషన్ల అంశం కాక పుట్టించింది. లోక్ సభలోనూ ప్రయివేటు బిల్లు ద్వారా తాము వెనకకి తగ్గలేదని చెప్పేందుకు ప్రయత్నించింది తెలుగుదేశం. సుప్రీంకోర్టు పరిమితులు,రాజ్యాంగ సమస్యలు వెన్నాడుతున్నప్పటికీ రాజకీయం నొల్లుకొనేందుకు న్యాయస్థానం అడ్డంకి కాదని నిరూపిస్తున్నాయి పార్టీలు. రెండుకళ్ల సిద్ధాంతంతో అటుఇటు ప్రయోజనాలు దెబ్బతినకుండా చాణక్యం ప్రదర్శించే చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహార నైపుణ్యం చూపుతున్నారు. రాజకీయాలు పూర్తిగా వంటబట్టని జగన్ నిక్కచ్చిగా పేరుతెచ్చుకోవాలనే యత్నంలో బొక్కబోర్లాపడుతున్నారు. ఎలాగూ తమవారే కదా అంటూ కొంత ఉదాసీనత ప్రదర్శిస్తూ ఇతరవర్గాలను చేరువ చేసుకునే యత్నంలో జనసేన తెలివితేటలు చాటుకొంటోంది.

ఆశలుడిగి....

రాష్ట్రజనాభాలో దాదాపు 17 శాతం కాపు,తెలగ,బలిజ,ఒంటరి కులాలున్నట్లుగా అంచనా. ఇందులో తూర్పు కాపు పేరిట ఉత్తరాంధ్రలో నివసించే ప్రజలు ఇప్పటికే వెనకబడినతరగతుల రిజర్వేషన్ అందుకుంటున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కాపు, బలిజ ప్రజల సంఖ్య అధికంగా ఉంది. ఉభయగోదావరి, కృష్ణ,గుంటూరు జిల్లాల్లో కాపుల పేరిట పిలుస్తారు. రాయలసీమ జిల్లాల్లో ఇదే సామాజిక వర్గానికి పర్యాయపదం బలిజ. దాదాపు 42 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల సంఖ్యలో ఈ సామాజిక వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. ఓట్ల చీలిక లేకపోతే 17 నియోజకవర్గాల్లో మిగిలిన సామాజికవర్గాల ఓట్లతో సంబంధం లేకుండా గెలుపును గంపగుత్తగా సాధించే స్థాయి ఉంది. ఇందులో 12 నియోజకవర్గాలు ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్నాయి. జనసేన రంగంలో ఉండటంతో మెజార్టీ కాపుల ఓట్లు ఆ పార్టీ కే పడతాయని రాజకీయ వర్గాల భావన. 2014లో పవన్ కల్యాణ్ కారణంగా వైసీపీ కొంత దెబ్బతింది. ఈసారి కూడా మళ్లీ సమస్య తలెత్తుతోంది. దీంతో జగన్ కొంత అసహనం ప్రదర్శిస్తున్నారు. ఎలాగూ ఆ వర్గం ఓట్లు తమ పార్టీకి పడవనే ఉద్దేశంతో కాపులకు బీసీ రిజర్వేషన్లు తమ పరిధిలోకి రాదని చెప్పేశారు. టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీలు వైసీపీకి చేరువ అవుతారనే అంచనాతో ఆయన ఈ ప్రకటన చేశారు. కానీ రాజకీయ లౌక్యం తెలియకపోవడం వల్ల ఈ ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. బీసీలకు నష్టం లేకుండా కాపుల రిజర్వేషన్ సమర్ధిస్తానంటూ పున: ప్రకటన చేయాల్సి వచ్చింది. అప్పటికే జరగాల్సిన డామేజీ జరిగిపోయింది.

అయినా విశ్వాసం...

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ అనుభవాన్ని రంగరిస్తున్నారు. కాపురిజర్వేషన్లు సాధ్యం కాదని స్పష్టంగా తెలుసు. జనసేన పార్టీ వైపు ఆ వర్గం మొగ్గు చూపుతుందనీ తెలుసు. అయినా ఎన్నికల హామీని అమలు చేసినట్లు చూపించడానికి అసెంబ్లీ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులిపేసుకున్నారు. జగన్ కాపులకు వ్యతిరేకంగా ప్రకటన చేసినవెంటనే మళ్లీ చంద్రబాబు రంగంలోకి దిగారు. ఎలాగూ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం కాబట్టి అందులో కాపు రిజర్వేషన్ల పోరాటాన్ని కూడా కలిపేయాలని సంకల్పించారు. తద్వారా ఆ వర్గంలో పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే కొంతమేరకు ఓట్లను తెచ్చుకోవచ్చుననే ఎత్తుగడను అనుసరించారు. వైఎస్సార్ బ్రతికున్న రోజుల్లో కాపులు కాంగ్రెసుకు మద్దతుదారులుగా ఉండేవారు. పవన్ రంగప్రవేశం చేయకపోతే ఇప్పటికే మెజార్టీ మొగ్గు వైసీపీ వైపు ఉండేదనేది విశ్లేషకుల అంచనా. ఆ వాతావరణం ప్రస్తుతం లేకపోవడంతో జనసేన నెగ్గడం సాధ్యం కాని నియోజకవర్గాల్లో కాపులు టీడీపీవైపు మొగ్గు చూపేలా చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. అందుకే లోక్ సభలో కాపు రిజర్వేషన్లపై ప్రయివేటు మెంబర్ బిల్లును టీడీపీ ప్రవేశపెట్టింది. దీనివల్ల చట్టబద్దంగా ఒరిగేదేమీలేకపోయినా తమకు చిత్తశుద్ధి ఉందని చెప్పుకోవడమే లక్ష్యం. జగన్ తొందరపాటు తనాన్ని టీడీపీకి అనుకూలంగా మలచుకోవడమూ భాగమే. అటు బీసీ ఓట్లు కావాలి. ఇటు కాపు ఓట్లలో చీలిక సైతం లాభించాలి. ఇదీ చంద్రబాబు రెండు పడవల పయనం.

జనసేనకే జయహో....

కాపుల ప్రాధాన్యం విస్త్రుతంగా ఉన్న నియోజకవర్గాల్లో కొన్ని సంస్థలు ఇటీవల సర్వే నిర్వహించాయి. ఆ సామాజిక వర్గానికి చెందిన 76 శాతం ప్రజలు పవన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. జనసేనకు అధికారం రాదని తెలిసినా తమకంటూ ఒక పార్టీ ఉండాలనేది మద్దతు దారుల భావన. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే జనసేన కీలకం కాబోతోందని వారి అంచనా. పవన్ కల్యాణ్ 2019 తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని జనసేన సానుభూతిపరులు బలంగా విశ్వసిస్తున్నారు. ఒక విషయంలో ఆ పార్టీ మద్దతుదారులకు సైతం స్పష్టత ఉండటం గమనార్హం. టీడీపీ, వైసీపీలు రాష్ట్రంలో మొదటి రెండు స్థానాల్లో ఉంటాయి. మూడో స్థానం లో ఉండే తమ పార్టీకి ఎవరో ఒకరు మద్దతిచ్చి పీఠంపై కూర్చోబెడతారనే ఆత్మవిశ్వాసం జనసైనికుల్లో నెలకొంది. 40 సీట్ల పైచిలుకు తెచ్చుకోగలిగితే ఇది సాధ్యమవుతుందంటున్నారు. 25 లోపు సీట్లకు పరిమితమైతే టీడీపీ, వైసీపీల్లో ఒకరికి మద్దతు పలకాల్సి ఉంటుంది. కానీ షరతులు వర్తిస్తాయి. వాటి ప్రకారమే పాలన సాగేలా పవన్ శాసిస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ సామాజికవర్గానికి చెందిన ఓట్లు చీలిపోకుండా జనసేనకు పడేలా జాగ్రత్త పడుతున్నామని చెబుతున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఓట్ల పరంగా తమ బలం, బలగం ప్రదర్శిస్తామంటున్నారు. అన్నివర్గాలు తమతో కలిసి రావాలని పవన్ కోరుకుంటున్నప్పటికీ సామాజిక వర్గాల వారీగా పార్టీ లాయల్టీలు ఇప్పటికే డిసైడ్ అయిపోయాయి. దాంతో ఇతర సామాజిక వర్గాల్లో చీలిక ఓట్లు తెచ్చుకోవడమే తప్ప ప్రధాన ఓటు బ్యాంకు కాపులదేనని రాజకీయపరిశీలకుల అభిప్రాయం.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News