సెంటిమెంట్ సింపతీ వైసీపీ ఎగరేసుకుపోతుందా?

Update: 2018-05-13 15:30 GMT

రాజకీయ కార్యకలాపాలు ఈవెంట్లుగా మారిపోయాయి. ప్రజల్లో కదలిక తెప్పించి స్పందింపచేయాల్సిన ఉద్యమాలు వేడుకల స్థాయికి దిగజారిపోయాయి. అన్ని చోట్లా ఇదే తంతు సాగిపోతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ది ఒక ప్రత్యేకత. అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో వచ్చిన సూచనలు నాయకుల చిత్తశుద్ది లేమికి దర్పణం పట్టాయి. ప్రత్యేక హోదా పేరుతో ఆందోళన చేపట్టాల్సిన నాయకులు దానిని పక్కనపెట్టి అధినాయకుని దృష్టిలో పడటమనే సింగిల్ పాయింట్ ఫార్ములా అనుసరించారు. వచ్చే ఎన్నికల వరకూ ప్రస్తుతం ప్రజల్లో ఏర్పడిన భావోద్వేగ వాతావరణాన్ని కొనసాగించడమెలా? అన్నఅంశం పైనే తర్జనభర్జనలు సాగాయి. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంత్రుప్త స్థాయి పెరిగిపోయిందని సొంతజబ్బలు చరుచుకున్న అధినాయకత్వం ఎన్నికల హామీలు ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేరని విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది.

లక్ష సైకిళ్లే లక్ష్యమా?....

నియోజకవర్గానికి ఆరువందల సైకిళ్ల చొప్పున యాత్ర చేపడుతూ అమరావతికి చేరుకుంటే అద్భుతంగా ఉంటుందని యాక్టర్ నుంచి ఎంపీగా మారిన ఒక ప్రజానాయకుడు విలువైన సూచన చేసేశారు. మన గుర్తు సైకిల్ కాబట్టి ప్రజల్లో ప్రచారం బాగా సాగుతుందని తన ఉద్దేశాన్ని బయటపెట్టేశారాయన. ప్రత్యేక హోదా అనేది ఒక ప్రచార కార్యక్రమం అని చెప్పకనే చెప్పేశారు. మిగిలిన వాళ్లు అంతా చప్పట్లు కొట్టేశారు. తాము సొంతంగా ఆలోచించాల్సిన పని తప్పిపోయిందని సంతోషించేశారు. అసలీ సైకిల్ యాత్ర ఢిల్లీకి కదా సాగాల్సింది అని అధినాయకునికే అనుమానం రావడంతో అందరూ ఒక్కసారిగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించేశారు. అంతదూరం తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. ఇదీ టీడీపీ నేతల చిత్తశుద్ధి. చంద్రబాబు నాయుడు చేపడుతున్న పోరాట దీక్షలకు అటెండెన్సు వేయించుకుని కాళ్లుమొక్కడంలో నాయకులు పోటాపోటీ పడుతున్నారు. నియోజకవర్గాల్లో మాత్రం ప్రజల్ని కదిలించలేకపోతున్నారు. అసలు తెలుగుదేశం బీజేపీకి ఎందుకు దూరమైంది? తాము ఏ రకమైన పోరాటం చేస్తున్నామన్న విషయంలోనూ క్లారిటీ మిస్సవుతోంది. మరో నాయకుడు చేసిన సూచన కూడా చర్చనీయంగా నిలిచింది. రోజుకో నియోజకవర్గం నాయకులు ఢిల్లీలో దీక్ష చేయాలనేది ఆయన ప్రతిపాదన. ఇది కూడా అదృష్టం కొద్దీ ఎవరూ పట్టించుకోలేదు. జంతర్ మంతర్ వద్ద ఏళ్ల తరబడి దీక్షలు చేసినా పట్టించుకోని ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. మరిప్పుడు ఈ టీడీపీ దీక్షలు పెద్ద కదలిక తెచ్చేస్తాయని ఆశించడం అత్యాశే. పైపెచ్చు టీడీపీ ఒక పార్టీగా ఆశిస్తున్నది పొలిటికల్ రిజల్టు. అది ఎన్నికలలో ప్రజలిచ్చే తీర్పు. అందుకు కావాల్సింది నియోజకవర్గ స్థాయిలో ప్రజాభాగస్వామ్యం. ఆ దిశలో నాయకులు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు.

ఈవెంట్లతోనే ఇరకాటం....

చంద్రబాబు నాయుడు ఏది చేసినా కలర్ ఫుల్ గా, నభూతో నభవిష్యతి అన్నట్లుగా నిర్వహించాలని చూస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను సైతం భారీ ఈవెంట్లుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. సమ్మక్క సారలమ్మ జాతరను లక్షల సంఖ్యలో ప్రజలు భక్తి ప్రపత్తులతో సందర్శించుకుని వెళ్లిపోతూ ఉండేవారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీనికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి ప్రభుత్వ ఈవెంట్ గా తీర్చిదిద్దారు. 2003లో గోదావరి పుష్కరాలకు ఈవెంట్ కళ తెచ్చిపెట్టారు. నిజానికి పుష్కరాలంటే తమ పూర్వీకులకు శ్రాద్ధకర్మలు పెట్టుకుని పుణ్యస్నానాలు ఆచరించే ఒక వ్యక్తిగత హైందవ సంప్రదాయం. దానిని ఉత్సవంగా , మేజర్ ఈవెంట్ గా మలచారు. ఈవెంట్ ను భారీగా సినిమా స్టైల్ లో రికార్డు చేయించే క్రమంలో 2015 గోదావరి పుష్కరాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దానికి ఇంతవరకూ జవాబుదారీ లేదు. బాధ్యులెవరో తేల్చలేదు. శ్రీరామ నవమి సందర్బంగానూ భారీగానే నష్టం వాటిల్లింది. భక్తి ప్రపత్తులతో చేసుకోవాల్సిన కార్యక్రమాలు, మతపరమైన అంశాల విషయంలో ప్రభుత్వ జోక్యం సాధ్యమైనంత తక్కువగా ఉండటం మేలు. కానీ అటువంటి వాటినే ప్రచారానికి వినియోగించుకోవడంలో చంద్రబాబు దిట్ట. ఇప్పుడిక ప్రత్యేక హోదా అనేది పొలిటికల్ ఈవెంట్ గా దొరికిన తర్వాత వదులుతారనుకోవడం భ్రమే అవుతుంది. దాదాపు ఎనిమిది నెలలకు సరిపడా కార్యక్రమాలను డిజైన్ చేసేశారు. జిల్లాల వారీ ధర్మపోరాటాలు, దీక్షలు తప్పవు. అంతేకాదు జనవరి నెలలో అమరావతిలో భారీ బహిరంగసభ జరపాలని నిర్ణయించారు. మొత్తం కార్యక్రమాల ప్లానింగ్ చూసిన తర్వాత ఎవరికైనా ఒక విషయం ఇట్టే అర్థమైపోతుంది. లక్ష్యం సాధిస్తామన్న నమ్మకం కానీ, ఉద్యమం ఢిల్లీని కదలిస్తుందన్న విశ్వాసం కానీ టీడీపీకి లేదు. హోదా అంశం మరుగున పడిపోకుండా ఎన్నికల వరకూ వేడిని రగిలిస్తూ ఉండాలనేది లక్ష్యం. దానిపైనే టీడీపీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది.

రాజీనామాల సెగ...

ఎన్నికల వేడిని రగిలించేందుకు , టీడీపీని ఆత్మరక్షణలో పడేసే వ్యూహాలకు వైసీపీ ఇప్పటికే పదునుపెడుతోంది. ప్రధానంగా అయిదుగురు ఎంపీల రాజీనామాకు స్పీకర్ ఆమోదముద్ర వేస్తే ప్రత్యేక హోదా అంశం వైసీపీ వైపు టర్న్ అవుతుంది. పదవులకు రాజీనామా చేసి మరీ వైసీపీ పోరాటం చేస్తోందన్న అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయమవుతుంది. టీడీపీ ఎంపీలను కూడా రాజీనామా చేయమని జగన్ డిమాండు చేశారు. అవిశ్వాస తీర్మానం విషయంలో వైసీపీతో పోటీ పడిన టీడీపీ రాజీనామాల విషయంలో వెనకంజ వేసింది. ఇప్పుడు బీజేపీ కరుణించి ఎంపీల రాజీనామాలకు స్పీకర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ సూప్ లో పడినట్లే. సెంటిమెంటు సింపతీ వైసీపీ ఎగరేసుకుపోతుంది. సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ ఎదురీదవలసి ఉంటుంది. అయితే ఆరునెలలకు పైగా టైమ్ ఉంటే మాత్రమే ఉప ఎన్నికలు జరుగుతాయి. జులై నెల లోపు ఎంపీల రాజీనామాలకు అంగీకారం తెలిపితే మాత్రమే ఉప ఎన్నికలు వస్తాయి. లేకుంటే ఫిబ్రవరి, మార్చిల్లో సాధారణ ఎన్నికలతో పాటే ఎన్నికలు నిర్వహిస్తారు. అందుకే రాజీనామాలు ఆమోదం పొందకూడదనే టీడీపీ కోరుకుంటోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News