మేము ఎలా తట్టుకుంటాం?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడ్ కు తెలుగుతమ్ముళ్లు తట్టుకోలేకపోతున్నారు. వరసగా కార్యక్రమాలు ఇస్తుండటంతో నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల జరిగిన టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై [more]

Update: 2019-11-11 12:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడ్ కు తెలుగుతమ్ముళ్లు తట్టుకోలేకపోతున్నారు. వరసగా కార్యక్రమాలు ఇస్తుండటంతో నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల జరిగిన టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు తెలిసింది. పోరాటాలకు పిలుపునిచ్చిప్పుడల్లా తమపై కేసులు నమోదవుతున్నాయే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదని చంద్రబాబు ఎదుటే కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది.

కేసులు పెడుతున్నారే….

ప్రధానంగా ఇసుక కొరతపై ఆందోళన చేసినప్పుడల్లా తమపై కేసులు బనాయిస్తున్నారని కొందరు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. సహజంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కొంత దూకుడుగా ఉంటుందని, వారు తమను టార్గెట్ చేయాలని చూస్తారని, అటువంటి పరిస్థితుల్లో మనమే అధికార పార్టీకి ఆందోళనల రూపంలో అవకాశమిచ్చినట్లవుతుందని కొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. కార్యకర్తలు కూడా ఆందోళనకు రావాలంటే భయపడి పోతున్నారని, కేసులు నమోదు చేస్తుండటతో వారు రావడం లేదని కూడా కొందరు చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది.

ఆర్థికంగా కూడా ఇబ్బందులు….

కొందరైతే ఆందోళనలకు ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదని కూడా చెప్పారు. ఇప్పటికే ఉపాధి హమీ పథకం ద్వారా గతంలో చేసిన పలు కాంట్రాక్టు బిల్లులు చెల్లించకుండా ప్రస్తుత ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, ఆందోళనలు అంటూ తాము తిరిగితే ఆ బిల్లులు వచ్చే అవకాశం లేదని కూడా కొందరు ద్వితీయ శ్రేణి నేతలు చెబుతున్నారు. వరసగా కేసులు నమోదవుతుండటంతో సమయం మొత్తం పోలీస్ స్టేషన్లలోనే గడపాల్సి వస్తుందని కూడా వారు వాపోయారట.

స్పీడ్ కు తగినట్లు….

చంద్రబాబు స్పీడ్ కు మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. నిజంగానే చంద్రబాబు క్షేత్రస్థాయిలో నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా జిల్లాల పర్యటనలు చేస్తుండటం కూడా చికాకు తెప్పిస్తుందంటున్నారు. నియోజకవర్గాల సమీక్షలకు కార్యకర్తలను సుదూర ప్రాంతాల నుంచి తరలించాలన్నా తమకు కష్టతరమవుతుందని కొందరు సూటిగానే చెప్పారట. అందుకే తాము పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని కూడా ఆవేదన చెందారు. మొత్తం మీద చంద్రబాబు వేగాన్ని తాము అందుకోలేకపోతున్నామని తెలుగు తమ్ముళ్లు చేతులెత్తేస్తున్నారు.

Tags:    

Similar News