చివరకు బాబుకు ఆముదం చెట్లే గ‌త‌య్యాయా..?

ఒక‌ప్పుడు ఆయ‌న‌కు చుట్టూ సీనియ‌ర్ నాయ‌కులు, వ్యూహ ప్రతివ్యూహాలు వేసే నేత‌లు.. ప్రజాబ‌లం ప‌రిపుష్టంగా ఉన్న తిరుగులేని నాయ‌కులు.. అన్ని విధాలా అనుకూల‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం.. క‌ట్ [more]

Update: 2020-03-20 14:30 GMT

ఒక‌ప్పుడు ఆయ‌న‌కు చుట్టూ సీనియ‌ర్ నాయ‌కులు, వ్యూహ ప్రతివ్యూహాలు వేసే నేత‌లు.. ప్రజాబ‌లం ప‌రిపుష్టంగా ఉన్న తిరుగులేని నాయ‌కులు.. అన్ని విధాలా అనుకూల‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం.. క‌ట్ చేస్తే.. ప‌ది మాసాలు గ‌డిచాయి.. ఇప్పుడు కన్ను పొడుచుకున్నా.. అలాంటి నాయ‌కులు క‌నిపించ‌ని ప‌రిస్థితి. వ్యూహ ప్రతివ్యూహాలు లిఖించే నాయ‌కుడే క‌రువు. ఉన్నా.. ఆయ‌నను ప‌ట్టించుకునేవారే లేని వాతావ‌ర‌ణం. ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు టీడీపీ అధినేత‌, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్రబాబు. ఒక్కమాట‌లో చెప్పాలంటే.. చంద్రబాబు ప‌రిస్థితి.. ఏ చెట్టూలేని చోట ఆముదం చెట్టే మ‌హావృక్షం అయిన చందంగా మారిపోయింది. ప్రజాబ‌లం లేని నాయ‌కులు, ప్రజ‌ల‌తో జై కొట్టించుకోలేని నేత‌లు ఇప్పుడు చంద్రబాబు చుట్టూ ఈగ‌ల్లా చేరార‌ని చెప్పడంలోనూ ఎలాంటి సందేహం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎందరు వెళ్లిపోతున్నా…..

ఈ ఆముదం చెట్ల నీడ‌ల్లోనే చంద్రబాబు త‌న రాజ‌కీయాల‌ను న‌డిపిస్తున్న దైన్య స్థితిని చూసి.. ఒక‌ప్పటి సీనియ‌ర్లు, మాజీ మంత్రులు నోరెళ్ల బెడుతున్నారు. రాజ‌కీయాలు అంటేనే వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగ‌డం. పైగా 23 మంది అత్యంత తక్కువ బ‌లం(కొంద‌రు పార్టీ మారినా.. టీడీపీ కిందే లెక్క క‌దా!)తో ప్రతిప‌క్షంలో ఉన్న టీడీపీని అన్ని విధాలా బ‌లోపేతం చేసుకోవడం అంటే కూడా అంత ఈజీకాదు. దీనికి ఎంతో ప్రయాస ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో పార్టీ నుంచి కీల‌క నాయ‌కులు జారుకుంటున్నారు. చంద్రబాబుపై తీవ్ర విమ‌ర్శలు కూడా చేస్తున్నారు. కానీ, వీటిని ఏ మాత్రం ప‌ట్టించుకోనట్టుగా ముఖ్యంగా చంద్రబాబు త‌న అనుకూల మీడియాను మేనేజ్ చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో మాత్రం…..

అంటే, వారు పోయినా.. పార్టీకి ఫ‌ర్లేదు.! అనే సంకేతాల‌ను ఆయ‌న ఇప్పిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ప‌రిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. నాయకులు సైకిల్ దిగుతున్నా.. త‌న‌కేమీ కాద‌న్నట్టు వ్యవ‌హ‌రించి చంద్రబాబు ఈ విష‌యాన్ని త‌క్కువ‌గా చూస్తున్నా.. ప్రజ‌ల్లో మాత్రం తీవ్రస్థాయిలో చ‌ర్చ అయితే జ‌రుగుతోంది. చంద్రబాబు పార్టీ ఉంటుందా? ఉండ‌దా? అనే చ‌ర్చకు కూడా ప్రాధాన్యం పెరిగిపోయింది. ఈ నేప‌థ్యంలో ఇలాంటి స‌మ‌స్య నుంచి పార్టీని ఒడ్డుకు చేర్చేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

గతంలో జగన్ ఇలా కాదు…..

గ‌తంలో ఇదే ప‌రిస్థితి జ‌గ‌న్‌కు ఎదురైన‌ప్పుడు జిల్లాల్లో నాయ‌కులు పాద‌యాత్రలు, ప్రచారం చేయ‌డం ద్వారా వైసీపీకి అండ‌గా నిలిచారు. ఇక‌, జ‌గ‌న్ వెనువెంట‌నే అసెంబ్లీని బ‌హిష్కరించి ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు నుంచి పాద‌యాత్ర ప్రారంభించారు. ఇలాంటిది కాక‌పోయినా.. టీడీపీలో వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించి, కార్యక‌ర్తలు నేత‌ల్లో మ‌నోధైర్యం క‌ల్పించే నాయ‌కులు మాత్రం ఇప్పుడు క‌రువ‌య్యారు. ఉన్న చిన్నాపాటి చోటా నేత‌ల‌నే న‌మ్ముకుని చంద్రబాబు ముందుకు సాగుతున్నార‌నే భావ‌న వ్యక్తమ‌వుతోంది.

Tags:    

Similar News