బాబుకు బాధ్యత ఉందా?

చూసుకుందామా? దమ్ముందా? దేనికైనా రెడీనా? ఇదీ బజార్లో చిల్లర జనం వాడే భాష. ఆవేశ కావేశాలు ఆపుకోలేక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారి వట్టిపోయిన సవాళ్ళు అవి. మరి [more]

Update: 2019-12-22 09:30 GMT

చూసుకుందామా? దమ్ముందా? దేనికైనా రెడీనా? ఇదీ బజార్లో చిల్లర జనం వాడే భాష. ఆవేశ కావేశాలు ఆపుకోలేక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారి వట్టిపోయిన సవాళ్ళు అవి. మరి రాజకీయంగా గండరగండడుగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు, పద్నాలుగేళ్ళ పాటు ఏపీ సీఎం గా పనిచేసిన చంద్రబాబు నుంచి ఇలాంటి సవాళ్ళు వినాల్సిరావడమే దారుణం. అది కూడా ఫ్రాక్షన్ ప్రభావిత జిల్లాగా ఉన్న అనంతపురంలో చంద్రబాబు లాంటి వారు చేస్తున్నారంటే అంతా రాజకీయమేనా అనిపించకమానదు. ఒక్క రెండు నిముషాలు పోలీసులను పక్కన గమ్మునుంచండి. మీ ప్రతాపం, మా ప్రతాపం చూసుకుందామంటూ వైసీపీ నేతలపై చంద్రబాబు చేసినట్లుగా ప్రచారమవుతున్న కామెంట్స్ బాధాకరమే.

బాధ్యత ఎక్కడ…?

రాజకీయాల కోసం ఎన్నో అంటూ ఉంటారు. దాని వల్ల ప్రభావితమైన వారు కార్యకర్తలే అవుతారు. అనంతపురం లాంటి సున్నితమైన జిల్లాలో ఈ మాటలు గట్టిగానే రీ సౌండ్ చేస్తాయి. అసలు అంతవరకూ పరిస్థితి కనుక వస్తే బాధ్యత ఎవరిది. నిప్పు రాజేసి పోతే ఆర్పేది ఎవరు, ఆహుతి అయ్యే వారిని ఆదుకునేది ఎవరు. చంద్రబాబు లాంటి వారు ఏపీలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన దారిలో మిగిలిన వారు నడవాలి. డెబ్బయ్యేళ్ల వయసులో ఉన్న చంద్రబాబు సహనం కోల్పోతున్నారు. దాంతో భాష కూడా మారిపోతోంది. మేము తలచుకుంటే వైసీపీ ఉండేదా అంటున్నారు. అంటే నాయకులు తలచుకుంటే అంతా బలి కావడానికి ఇది ప్రజాస్వామ్యమా. ఆటవిక రాజ్యమా అన్న దానికి మాజీ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలేమో.

వికృత క్రీడేనా…?

అనంతపురం పార్టీ సభలో మాజీ ఎంపీ జేసీ దివాకరెడ్డి పోలీసులపై చేసిన హాట్ కామెంట్స్ కూడా ఓ వైపు చర్చలో ఉన్నాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లను నాకిస్తామని పెద్దాయన అనడంపైన ఓవైపు పోలీసు అధికారులు మండిపడుతున్నారు. దాన్ని అదే సభలో ఉండి వారించలేకపోయిన చంద్రబాబు జేసీ భాషను తాను అరువు తెచ్చుకుని ఆవేశంతో ఊగిపోవడమే చిత్రమని అంటున్నారు. పోలీసులను రిటైర్ అయినా కూడా వదిలిపెట్టనని చంద్రబాబు అనడాన్ని ఏ రకమైన హెచ్చరికగా చూడాలి. ఆ మధ్యన హైదరాబాద్ లో అసదుద్దీన్ ఒవైసీ ఒక మాట అన్నారు. రెండు నిముషాలు పోలీసులు సైలెంట్ గా ఉంటే తామేంటో చూపిస్తామని. ఇపుడు అదే కామెంట్స్ చంద్రబాబు కూడా చేయడం ఏ రకమైన రాజనీతి అంటున్నారు పరిశీలకులు.

తలలు నరకడమట…..

చంద్రబాబు వంటి వారే సహనం తప్పుతూంటే జనసేనాని పవన్ లాంటి వారు మరెంత ముందుకు వెళ్ళినా తప్పులేదు అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇదే అనంతపురం పార్టీ సమీక్షలో కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీ నేత పవన్ కుమార్ ఓ సామాజికవర్గం నేతల తలలు నరుకుతాను అంటూ పవన్ సమక్షంలో చేసిన కామెంట్స్ కూడా ఇపుడు చర్చకు వస్తున్నాయి అంటే రాజకీయం అంటే జనం ఓట్లు వేసి గెలిపించడం, గెలిచినవారిని గౌరవించడం, ప్రజల మెప్పుకోసం ఎదురుచూడడం అన్నవి పక్కకు పోయి బలాబలాల వేదికగా మారుతాయా అన్న భావన కలుగుతోందని అంటున్నారు. అదే జరిగితే ప్రజాస్వామ్యం అన్న దానికి అర్ధం ఉంటుందా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా చంద్రబాబుకు బాధ ఉండవచ్చు కానీ దాన్ని ప్రజాస్వామిక విధానాల్లోనే పోరాడితేనే ఏపీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉంటుందని మేధావులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News