అలాగయితే…. ఇలా

తెలుగుదేశం పార్టీలో అది సాధ్యమవుతుందా? కొత్త నాయకత్వానికి పాత తరం నేతలు సహకిస్తారా? ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో పాతుకుపోయిన పసుపు పార్టీ నేతలు కొత్తతరానికి ఏమేరకు సాయం [more]

Update: 2019-08-15 09:30 GMT

తెలుగుదేశం పార్టీలో అది సాధ్యమవుతుందా? కొత్త నాయకత్వానికి పాత తరం నేతలు సహకిస్తారా? ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో పాతుకుపోయిన పసుపు పార్టీ నేతలు కొత్తతరానికి ఏమేరకు సాయం అందిస్తారన్నదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమితో డీలా పడిపోయిన పార్టీని చంద్రబాబునాయుడు గాడిన పడేయాలనుకుంటున్నారు. నేతల నిర్లక్ష్యమే ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణమని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో పార్టీ నాయకత్వాన్ని పూర్తిగా మార్చేయాలని నిర్ణయానికి వచ్చారు.

యువతను ప్రోత్సహిస్తే….

గతంలో జిల్లాల వారీగా ఉన్న ఇన్ ఛార్జులను ఇకపై పార్లమెంటు నియోజకవర్గాలుగా నియమించాలని నిర్ణయించారు. గతంలో ఉన్న వారిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగానే అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్లు సయితం తమను పక్కన పెట్టి యువతను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా యువతకు అవకాశమిచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.

సంపాదించుకున్న వారు….

అయితే ఇక్కడ మరో సమస్య ఉంది. ఇప్పటికే ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి కొద్దోగొప్పో సంపాదించుకున్న నేతలు ఇప్పుడు పార్టీకి ఉపయోగపడాలన్న వాదన కూడా విన్పిస్తుంది. కొత్త నేతలను ఇన్ ఛార్జిలుగా నియమిస్తే వారు ఆర్థికంగా ఆలోచించి పార్టీ కార్యక్రమాలను నిర్వహించలేరని కూడా కొందరు చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అన్నీ బేరీజు వేసుకున్నాకే అందరితో సమన్వయం చేసుకునే వ్యక్తిని ఇన్ ఛార్జిగా నియమిస్తే సానుకూల ఫలితాలు భవిష్యత్ లోవస్తాయని చంద్రబాబు ఆలోచన.

వారసులకు ఇస్తే…..

మరోవైపు కొత్త తరం అంటే సీనియర్ నేతలను పక్కన పెట్టి వారి వారసులకు బాధ్యతలను అప్పగించడం కాదంటున్నారు మరికొందరు టీడీపీ నేతలు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో సీనియర్ నేతల వారసులు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వారికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయంటున్నారు. సీనియర్ నేతలని గ్రిప్ ఉన్నవారిని పక్కన పెట్టడం కూడా సరికాదని చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు పార్టీ ఇన్ ఛార్జుల నియామకం తలనొప్పిగానే మారేటట్లుంది.

Tags:    

Similar News