దటీజ్ నాయుడు బాబు....!

Update: 2018-08-25 15:30 GMT

అధినేత మాట జవదాటడం ప్రాంతీయపార్టీల్లో కష్టం. అన్నీ సహించి మనగలగడము, లేదంటే గుడ్ బై చెప్పేయడము రెండే మార్గాలు. తెలుగుదేశం పార్టీలోని సీనియర్లకు ఈ విషయం పూర్తిగా తెలుసు. కానీ అప్పుడప్పుడు తమ పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అసంతృప్తిని వెలిగక్కుతుంటారు. అందుకు ఒక ప్రాతిపదిక తీసుకుంటారు. టీడీపీ అధినేత కాంగ్రెసు పట్ల కొంత మెతక వైఖరిని అవలంబిస్తున్నారు. అవసరమైతే పరోక్షపొత్తుకు సంకేతాలిస్తున్నారు. జాతీయ స్థాయిలో జట్టుకట్టేందుకు సిద్దమవుతున్నారు. మైత్రీపూర్వక పోటీలకు మనసులో మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెసు వ్యతిరేకతే ప్రధాన అజెండాగా ఆవిర్భవించిన తెలుగుదేశం లో ఈ ధోరణి కొంత చర్చకు దారితీస్తోంది. అయితే బీజేపీపై వ్యతిరేకతను తెలివిగా కాంగ్రెసుపై సానుభూతిపై, ఉదాసీనతగా మార్చాలని యత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు. పార్టీలో ఉన్న అసమ్మతివాదులు ఈ చాన్సును పార్టీపై గురిపెట్టేందుకు వినియోగించుకుంటున్నారు.

అసమ్మతికి ఆయుధం...

అనేక కారణాలతో తెలుగుదేశంలో కొందరు సీనియర్ నాయకులు పార్టీ అధిష్ఠానంపై ఆగ్రహంగా ఉన్నారు. కానీ బయటపడలేని పరిస్థితి. అవమానాలు ఎదురైనా బయటికి వచ్చి సాధించేదేమీ ఏమీ లేదు. అందుకే సహిస్తున్నారు. కాంగ్రెసు పట్ల అధినేత పాజిటివ్ సిగ్నల్స్ ను వారు ఒక ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చంద్రబాబు నాయుడికి సమకాలికుడు. రాజకీయంగానూ ఉద్దండపిండమే. టీడీపీ అధినేతకు వారసుడైన లోకేశ్ తన శాఖపై పెత్తనం చేయాలని చూడటాన్ని సహించలేకపోతున్నారాయన. ఒకటిరెండు సందర్భాల్లో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా అప్పటికప్పుడు సర్దుబాటు చేయడమే తప్ప సమస్య శాశ్వతంగా పరిష్కారం కాలేదు. అలాగే విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు తొలినాళ్లనుంచి టీడీపీని నమ్ముకుని ఉన్నవ్యక్తి. ఆ జిల్లాలో అయిదేళ్లకో పార్టీ మార్చే గంటా శ్రీనివాసరావుకు పెత్తనం అప్పగిస్తున్నారనే అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీరంతా తమ అసమ్మతిని వ్యక్తం చేయడానికి కాంగ్రెసుతో చెలిమి ఒక అస్త్రంగా మారింది. కాంగ్రెసుతో వెళితే పార్టీకి పుట్టగతులుండవన్నంత తీవ్రంగా వారు స్పందించారు. నిజానికి ఇది పార్టీపట్ల వారిలోని ఆగ్రహానికి దర్పణం పట్టింది.

టెస్టింగ్ వాటర్స్....

గడచిన రెండు మూడు నెలలుగా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుకు సంబంధించి సాఫ్ట్ కార్నర్ ను క్యాడర్ లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పొలిట్ బ్యూరో, విస్తృత స్తాయి సమావేశాల్లో ఒకటికి రెండు మార్లు కాంగ్రెసు కంటే బీజేపీనే ప్రథాన శత్రువన్న ప్రస్తావన తెస్తున్నారు. అవసరమైతే రాష్ట్ర హక్కుల సాధనకు కాంగ్రెసు సహకారం తీసుకోవాలని బలంగా చెబుతున్నారు. అత్యంత కీలకమైన భేటీలో రాష్ట్రంలో కాంగ్రెసు బలపడితే వైసీపీ దెబ్బతింటుందనే ఆలోచన వ్యక్తం చేసినట్లు సమాచారం. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న మైనారిటీ, దళిత ఓట్లను వైసీపీ ఆకర్షించగలుగుతోంది. ఈ వర్గాల్లో తెలుగుదేశానికి ఆదరణ అంతంతమాత్రమే. కాంగ్రెసు పుంజుకుంటే ఎంతోకొంత ఓట్ల చీలిక వస్తుంది. దాంతో వైసీపీ నష్టపోతుంది. ఈ ఈక్వేషన్ పార్టీలోని అగ్రనాయకులుగా భావించే సన్నిహితులకు వివరించినట్లు గా ప్రచారం సాగుతోంది. పైపెచ్చు తెలంగాణలో నెగ్గాలంటే కాంగ్రెసుతో చేయి కలపాల్సిందే. బహిరంగంగా పొత్తు కుదుర్చుకోవడం కుదరదు. మైత్రీపూర్వక పోటీల ద్వారా కొన్నిసీట్లయినా చేజిక్కించుకోవాలి. అదే సమయంలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెసుకు ఆపన్నహస్తం అందించాలి. దీనిపై నాయకుల మనోభావాలను తెలుసుకునేందుకు చంద్రబాబు ఫీలర్స్ వదులుతున్నారు.

రివర్స్ గేర్....

ప్రస్తుతం సాగుతున్న కసరత్తు కేవలం పార్టీలోని నాయకులు, కార్యకర్తల నాడి పట్టి తెలుసుకునేందుకు ఉద్దేశించింది. ప్రజల్లో కాంగ్రెసు పట్ల గతంలో పేరుకున్న వ్యతిరేకత క్రమేపీ తగ్గుముఖం పట్టిందన్న వాదనను తెలుగుదేశమే ముందుకు తెస్తోంది. బీజేపీ, వైసీపీని ఒకే గాటన కట్టేస్తోంది. అలాగని కాంగ్రెసును పూర్తిగా భుజాలకెత్తుకునే అవకాశమూ లేదు. పార్టీలోని ఒకరిద్దరు అగ్రనాయకులు కాంగ్రెసుపై నిప్పులు చెరిగారు. దీంతో అధిష్టానమే సర్దుకుంది. అధినేతకు అనుకూలంగా ఉండేవారి చేత ప్రకటనలు ఇప్పించారు. అబ్బే, కాంగ్రెసుకు చేరువ కావడం లేదంటూ వివరణలిప్పించారు. అదే సమయంలో పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించేలా ప్రకటనలు ఇచ్చిన ఇద్దరు మంత్రుల వివరణలు కోరాలని సీనియర్లకు పురమాయించారు. ఈవిషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చంద్రబాబు నిర్ణయించారు. అవసరమైతే రివర్స్ గేర్ కూ సిద్ధమే. కాంగ్రెసుతో చెలిమి కలిసిరాదని తేలితే కరాఖండిగా దూరం పెట్టేస్తారు. పార్టీ, ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే. దటీజ్ చంద్రబాబు నాయుడు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News