బాబుకు అసలు విలన్ ఆయనే..!

Update: 2018-05-21 14:30 GMT

చంద్రబాబు నాయుడికి ప్రధాన ప్రత్యర్థి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని అందరూ అనుకుంటారు. కానీ ప్రజాక్షేత్రంలో మరో ప్రధాన ప్రత్యర్థి ఆయనను బెంబేలెత్తిస్తున్నారు. తన విధానాలు,చర్యలతో కలవరం కలిగిస్తున్నారు. ఆయనెవరో కాదు. ఒకనాటి సహచరుడు, ప్రస్తుతం తెలంగాణ కౌంటర్ పార్ట్ కేసీఆర్. అమరావతికి వెళ్లి పోయినా చంద్రబాబు నాయుడికి కేసీఆర్ సెగ తగులుతూనే ఉంది. అందులోనూ ఎన్నికల సంవత్సరంలో ఈ వేడి రాజకీయంగా కూడా ప్రభావం చూపబోతోంది. ఒకవైపు కేంద్రం సహాయనిరాకరణ, ఇంకోవైపు బలపడుతున్న వైసీపీ విసురుతున్న సవాళ్లు, నిన్నామొన్నటివరకూ నేస్తంగా ఉన్న జనసేనాని తిరుగుబాటు ఇలా ముప్పేట దాడిలో ఇప్పటికే ముచ్చెమటలు పోస్తున్న చంద్రబాబునాయుడికి నాలుగోవైపు నుంచి కేసీఆర్ విసురుతున్న అస్త్రాలు పక్కలో బల్లెంలా మారుతున్నాయి.

సంక్షేమ సమరం...

కేసీఆర్ పరిపాలన చేయలేడు. చేతులెత్తేస్తాడనేది తొలినాళ్లలో టీడీపీ ఆలోచన. కానీ వ్యూహనైపుణ్యంతో అత్తెసరు మెజార్టీని తిరుగులేని స్థాయికి చేర్చుకున్నాడు. ప్రతి పక్షాలను కకావికలం చేసేశాడు. సామదానభేదదండోపాయాలతో తెలుగుదేశం పార్టీ ఉనికిని నామమాత్రం చేసేశాడు. దాదాపు అందరు శాసనసభ్యులను టీఆర్ఎస్ లోకి ఆకర్షించేశాడు. కాంగ్రెసులోనూ కలవరం రేపాడు. ఇదంతా రాజకీయంగా పన్నిన ఎత్తుగడల ఫలితం. మరోవైపు ప్రజాక్షేత్రంలో ప్రతి ఉప ఎన్నికనూ గెలుచుకుంటూ ప్రజల్లోనూ విశ్వాసం పొందుతూ వచ్చారు. నిజానికి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీపై పెద్దగా ప్రభావం చూపే అంశాలేమీ కాదు. కానీ కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తాము కూడా తప్పనిసరిగా చేపట్టాల్సిన పరిస్థితి టీడీపీకి ఏర్పడుతోంది. కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ , పింఛన్లు వంటివన్నీపోటాపోటీ పథకాలే. ఆర్థికంగాపరిపుష్టంగా ఉన్న తెలంగాణకు పథకాలు పెద్ద భారమేమీ కాదు. అప్పులు తెచ్చి మరీ కొత్త స్కీములు అమలు చేస్తున్నారు. కానీ అంతంతమాత్రం ఆదాయంతో దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్న ఏపీకి వీటిని చేపట్టడం పెద్ద భారమనే చెప్పాలి. అందులోనూ కేసీఆర్ కులాలవారీ స్కీములను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బీసీలు కులవృత్తులలో ఎక్కువగా కనిపిస్తారు. తెలుగుదేశానికి బీసీలే అండదండగా ఉంటూ వస్తున్నారు. ఏపీలోనూ ఆయా స్కీముల కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఆదాయపెరుగుదల, శాశ్వతత్వం లక్ష్యంగా కేసీఆర్ కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు స్కీములు చాలావరకూ తాత్కాలికప్రయోజనాలతో ముడిపడి ఉంటున్నాయి. చంద్రన్న పథకాలు పప్పుబెల్లాలుగా మారాయనే విమర్శలున్నాయి. డబ్బులు వెచ్చిస్తున్నా కేసీఆర్ కు లభించిన ప్రచారం మాత్రం చంద్రబాబుకు దక్కడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య పోలిక ఇబ్బందికరకంగా మారుతోంది.

కాళేశ్వరం వర్సస్ పోలవరం...

చైనాలోని త్రిగార్జెస్ తెలంగాణకు కాళేశ్వరం అంటూ భారీ ఎత్తున చేపడుతున్న ప్రాజెక్టు రేపటి ఎన్నికల్లో ఒక ప్రధాన ప్రచారాస్త్రం కాబోతోంది. నిజానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆంధ్రప్రదేశ్ కు అత్యవసరం. దీనికి జాతీయ హోదా కూడా ఇచ్చారు. డబ్బులు వెచ్చించగలిగితే 2019 కంటే ముందుగానే పూర్తయ్యే అవకాశం ఉండేది. దాంతో పోలిస్తే కాళేశ్వరం నిర్మాణం చాలా సంక్లిష్టమైనది. అండర్ గ్రౌండ్ లోనే జలనిధిని నిల్వచేసే అద్భుతం. దీనిని పూర్తి చేస్తేతెలంగాణ జలసిరిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. నీటికోసం రైతుల కష్టాలు తీరతాయి. పోలవరం భూ ఉపరితలంపై చేపట్టే కట్టడం. చాలా సులభంగా దీనిని పూర్తి చేయవచ్చు. కేంద్ర సహకారం లేకుండానే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం పూర్తి చేస్తోంది. మరోవైపు పోలవరం పూర్తయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. జనాభాలో అదికశాతం ఉన్న రైతాంగానికి సంబంధించిన ఈ విషయంలో పోలిక చంద్రబాబునాయుడికి 2019 ఎన్నికల్లో చాలా ఇబ్బందికరంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు రైతురుణ మాఫీని తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసేసింది. పెట్టుబడి సాయం పేరిట ఎకరాకు ఏడాదికి ఎనిమిదివేల రూపాయల పంపిణీని ప్రారంభించింది. అటు ఏపీలో రుణమాఫీ ఇంకా నత్తనడకన సాగుతోంది. పెట్టుబడి సాయం సంగతేమిటని రైతులు చంద్రబాబును నిలదీసే పరిస్థితులూ ఏర్పడుతున్నాయి. ఏపీలో రైతాంగం తెలంగాణలో తమ కౌంటర్ పార్టులైన రైతులతో పోల్చుకుంటారు. సర్కారీ సంక్షేమం తమకు అందడం లేదనే విషయంలో రైతులు రోడ్డెక్కితే టీడీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎలాగూ ఆయా అంశాలను ఫ్లేర్ అప్ చేసేందుకు వైసీపీ, జనసేనలు ఉండనే ఉన్నాయి. చంద్రబాబు నమ్ముకున్న మీడియాలోనే కేసీఆర్ పేజీల కొద్దీ ప్రకటనలు, గంటల కొద్దీ ప్రసారాలతో హోరెత్తిస్తున్నారు. ఇదంతా బాబుకు తలపోటే.

ఉద్యోగులతో ఉపద్రవం...

గతంలో ఉద్యోగులతో కొంత కఠినంగా వ్యవహరించి దెబ్బతిన్నామనే భావనలో టీడీపీ ఉంది. అందుకే 2014 ఎన్నికల్లో వారిపై ఉదారమైనకరుణ కురిపించారు. ఎన్నికల తర్వాత వయోపరిమితిని అరవయ్యేళ్లకు పెంచారు. వేతనాల విషయంలో తెలంగాణ కంటే ఒకడుగు ముందే ఉండాలనుకున్నారు. నిజానికి తెలంగాణ సాధనలో ఉద్యోగులు చాలాకీలకంగా వ్యవహరించారు. సమైక్యాంధ్ర పేరిట ఉద్యోగులు ఆందోళన చేసినా అది ఫలించలేదు. రాష్ట్రం విడిపోయింది. అప్పులతో కొత్త రాష్ట్రం ఏర్పడింది. దానితో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యోగులతో సమానంగా అన్నిటినీ సాధించుకున్నారు. అయినప్పటికీ ఉద్యోగవర్గాల్లో కేసీఆర్ కు లభించిన పాజిటివ్ స్పందన చంద్రబాబు కు దక్కలేదు. ముందునుంచీ ఉద్యమంతో కేసీఆర్ మమైకం కావడంతో ఉద్యోగ సంఘాలు ఆయనకు బ్రహ్మరథం పట్టాయి. ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశాయి. చంద్రబాబుకు ఆ రకమైన గౌరవం దక్కలేదు. బాబు వరాలతో ఉద్యోగుల జీతభత్యాల బిల్లు ఏడాదికి ఎనభైవేల కోట్ల రూపాయల పైచిలుకుకు చేరింది. తాజాగా మళ్లీ కేసీఆర్ వేతన సవరణ కమిషన్ ను నియమించారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ పై భారం పడబోతోంది. తట్టుకునే ఆర్థిక స్థితి రాష్ట్రానికి లేదు. ప్రత్యేక హోదా ఉద్యమంతో చాలా కష్టాలు పడుతున్నాం కాబట్టి కనీసం మాకు తెలంగాణ ఉద్యోగులతో అయినా సమానంగా వేతనాలు ఇవ్వరా? అని సంఘాలు ప్రశ్నిస్తాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి బాబు పరిస్థితి. అందుకే అసలు ప్రత్యర్థి కేసీఆర్ అంటున్నాయి తెలుగుదేశం వర్గాలు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News