పిలుపులకూ కదలడం లేదే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గాడి తప్పిన పార్టీని దారిన తెచ్చుకునేందుకు నానా రకాలుగా తంటాలు పడుతున్నారు. చంద్రబాబు మూడు నెలలుగా అందుకోసం చేయని ప్రయత్నం లేదు, [more]

Update: 2019-09-14 05:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గాడి తప్పిన పార్టీని దారిన తెచ్చుకునేందుకు నానా రకాలుగా తంటాలు పడుతున్నారు. చంద్రబాబు మూడు నెలలుగా అందుకోసం చేయని ప్రయత్నం లేదు, వేయని ఎత్తులు జిత్తులు లేవు. అటువంటి చంద్రబాబు డెబ్బయ్యేళ్ల వయసులో తెగించి మరీ చలో ఆత్మకూరు అంటూ తమ్ముళ్ళతో ర్యాలీగా నడిచేందుకు కూడా సిధ్ధపడారు. ఇదంతా సైకిల్ పార్టీకి రిపేర్ల కోసమేనన్నది అందరికీ తెలిసిందే. మరి తమ్ముళ్లు ఎంతవరకూ రీఛార్జ్ అయ్యారంటే చాలామంది ఇప్పటికీ పార్టీ వైపు చూడడంలేదన్న మాట వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా మంది నాయకులు తమ పని తమది అన్నట్లుగా ఉన్నారు.

ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా…..

విశాఖ జిల్లా విషయానికి వస్తే గెలించింది నలుగురు ఎమ్మెల్యేలు అయితే అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు చలో అన్నా తొంగి చూడలేదు. సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అయితే తన పనిలో తానున్నారు. ఆయన అన్నా క్యాంటీన్ నడుపుతున్నారు. యధాప్రకారం ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇక మరో ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా అయిన గంటా శ్రీనివాసరావు కూడా తొంగి చూడలేదు, వంగి వాలలేదు. విశాఖ జిల్లాలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు వంటి వారు రైలెక్కుదామ‌నుకుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక రూరల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బుద్ద నాగజగదీశ్వరరావు, దువ్వారపు రామారావు మాత్రం పోలీసుల నుంచి తప్పించుకుని ఎలాగో అమరావతి చేరుకున్నారు. శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు వెళ్లారు, విజయనగ‌రం నుంచి చంద్రబాబు పిలుపునకు పెద్దగా స్పందన లేదు. మరి తమ్ముళ్లు పోలోమని వెళ్లకపోవడం పట్ల చర్చ సాగుతోంది.

ఆచీ ..తూచీ…..

చాలా మంది తమ్ముళ్లు టీడీపీ ఆందోళనను జాగ్రత్తగా గమనించాలనుకుంటున్నారు. ఇంకా వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు మాత్రమే అయింది కాబట్టి ఇప్పటినుంచే పోరాటాలు ఎందుకన్న ధోరణి చాలా మంది తమ్ముళ్లలో వ్యక్తం అవుతోంది. మరో వైపు చూస్తే ఎక్కడో గుంటూరు జిల్లాలో ఆత్మకూరు గ్రామం గొడవ ఉత్తరాంధ్రాకు పెద్దగా సంబంధం లేదన్న భావనలో కూడా తమ్ముళ్ళు ఉన్నారు. పైగా అది రాష్ట్ర స్థాయి అంశం కానే కాదని కూడా కొంతమంది తమ్ముళ్ల భావనగా ఉంది. మరో వైపు చూసుకుంటే ఫ్రాక్షన్ రాజకీయాలు ఉత్తరాంధ్రకు తెలియవు, పైగా ఇక్కడ రాజకీయం కూడా ప్రశాంతంగా ఉంటుంది. గొడవలు కూడా ఏ రాజకీయ పార్టీ మధ్య అసలు ఉండవు. ఈ పరిణామాలను గమనంలోకి తీసుకున్న తమ్ముళ్ళు చంద్రబాబు చలో పిలుపుని లైట్ గా తీసుకున్నారంటున్నారు. మరి చంద్రబాబు ఈ తమ్ముళ్లను ఎలా కదిలిస్తారో చూడాలి.

Tags:    

Similar News