బాబు మాటలు కోటలు దాటుతున్నాయా?

Update: 2018-05-07 15:30 GMT

ఆశ ప్రతి మనిషికి సహజం. కానీ అత్యాశ నవ్వు పుట్టిస్తుంది. అపహాస్యం పాలు చేస్తుంది. తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశాల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు పార్టీ సర్కిళ్లలో పరిహాసాస్పదంగా మారాయి. త్రిముఖ పోరులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు భరోసానిచ్చేశారు. దీంతో అధినేత ముందే ఆ పార్టీ నాయకులే గుసగుసలు చెప్పుకోవడం, చెవులు కొరుక్కోవడం తటస్థించింది. నమ్మకం కలిగించాల్సిన అధినాయకుని ప్రకటన నవ్వులాటగా తేలిపోయింది. నేలవిడిచి సాము చేయడమని కొందరంటున్నారు. పోతే పోయింది ప్రకటనే కదా? అని బాబు తనకు తోచింది చెప్పేశారని మరికొందరు అంటున్నారు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం సొంతకాళ్లపై నిలబడే సాహసం చేయలేని ఒక పరిస్థితిలో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టకుండా పరుగెట్టండి అంటూ ఆదేశించడం అతిశయోక్తిని తలపిస్తోంది. తాము చేసిన తప్పులను మరిచి దిద్దుబాటును విడిచి లేని ఆశలు కల్పించడంతో ఏం ఒరుగుతుందనే విమర్శలూ వినవస్తున్నాయి.

నిర్వీర్యం ...నిస్తేజం....

తెలంగాణ రాష్ట్రం తెలుగుదేశం పార్టీకి సైద్దాంతికంగా అండగా నిలిచే ప్రాంతం. వెనకబడిన తరగతుల ప్రజలు జనాభారీత్యా ఇక్కడ అత్యధికంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ఆయా వర్గాలు ఆర్థికంగా పరిపుష్టిని సంతరించుకోలేదు. రాజకీయ పరమైన అండ వారికి అవసరం . పాలకవర్గాల సాయంపైనా ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి. అందువల్లనే బీసీలకు రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యమిచ్చే టీడీపీ పట్ల పార్టీ వ్యవస్థాపన నుంచి ఆ వర్గాల్లో ఆదరణ ఉంది. రాష్ట్రం విభజన జరుగుతోందని తెలిసి కూడా బీసీలు అండగా నిలవడంతో 2014లో 15 స్థానాలు గెలుచుకోవడం సాధ్యమైంది. అధికార టీఆర్ఎస్ ఓటింగులో మూడోవంతుకుపైగా ఓట్లు టీడీపీకి వచ్చాయంటేనే ఆపార్టీకి ఉన్న ప్రాధాన్యం అర్థమవుతుంది. సామాజిక ప్రాబల్యం, సైద్దాంతిక బలం ఉన్న పార్టీని గడచిన మూడు నాలుగు సంవత్సరాలుగా క్రమేపీ నిర్వీర్యం చేసుకుంటూ వచ్చేశారు. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కార్యవర్గాలను నియమించుకోలేని దుస్థితికి దిగజార్చేశారు. మౌలిక వసతులు, కార్యకర్తల బలం అండగా ఉన్నప్పటికీ నాయకత్వం సరైన దిశానిర్దేశం చేయలేకపోవడంతో గడచిన ఏడాదికాలంలో పార్టీ పూర్తిగా నిస్తేజమై పోయింది. నిజానికి కార్యకర్తలకు ప్రమాద బీమా వంటి పథకాలు, గ్రామస్థాయి శ్రేణులు పుష్కలంగా ఉన్న పార్టీ ఈ దశకు రావడంలోనాయకత్వ వైఫల్యాలే అడుగడుగునా కనిపిస్తాయి.

రెక్కలు విరిచిన రేవంత్...

నిజానికి తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి జూనియర్ నాయకుని కిందే లెక్క. కానీ అధినాయకత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. దూసుకుపోయే తత్వం ఉన్న రేవంత్ కేసీఆర్ ని దీటుగా ఎదుర్కోగలరని భావించింది. రేవంత్ దుందుడుకు వైఖరిని కట్టడి చేయడానికి ఏ దశలోనూ ప్రయత్నించలేదు. అతని చర్యలన్నిటినీ ప్రోత్సహించింది. లోకేశ్ కు సన్నిహితంగా మసలిన రేవంత్ తెలంగాణ తెలుగుదేశానికి తానే పెద్ద దిక్కు అన్న రీతిలో వ్యవహారాలు నడిపారు. దీంతో పార్టీ అగ్రనాయకులంతా క్రమేపీ దూరమవుతూ వచ్చారు. క్రియాశీల పాత్రనుంచి తమను తాము కుదించుకున్నారు. ఓటుకు నోటు వంటి వ్యవహారాలతో పార్టీ అధినేత సహా అందరికీ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముందుచూపు లేకుండా పర్యవసానాలను యోచించకుండా అధిష్ఠానం రేవంత్ ను ప్రోత్సహించిన ఫలితమిది. తెలంగాణలో పార్టీకి ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారిన పరిస్థితుల్లో అమరావతి కేంద్రంగా ఏపీ పరిపాలనకు చంద్రబాబు తరలివెళ్లిపోయారు. ఒకరకంగా ఇది పలాయనవాదమే. పార్టీ కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో పదేళ్లపాటు రాజధానిగా చట్టబద్ధమైన హక్కులు ఉన్నప్పటికీ వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయంలో కేసీఆర్, చంద్రబాబుల మధ్య రాజకీయ ఒప్పందం ఉందనే విమర్శలను టీడీపీ నేటికీ ఎదుర్కొంటోంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ అప్రూవర్ గా మారితే పెద్దతలకాయలకే మొత్తం కేసు చుట్టుకుంటుందనే ఆందోళనతో ఆయనను దూరంగా పెట్టలేని నిస్సహాయ స్థితికి పార్టీ చేరుకుంది. వర్కింగ్ ప్రెసిడెంటుగా అవకాశం కల్పించి పూర్తి స్థాయిలో అధికారిక బాధ్యతలనే అప్పగించారు. కానీ చివరికి తెలుగుదేశానికి ఇక్కడ మనుగడ లేదని కాంగ్రెసులోకి జంప్ చేసేశారు రేవంత్. అధిష్టానం వెన్నుదన్నుతో అంతవరకూ రాష్ట్రపార్టీకి ఊపు తెస్తాడనుకున్న నాయకుడే గోడ దూకేయడంతో పార్టీ నైతికస్థైర్యం కోల్పోయింది.

మోత్కుపల్లి మొట్టికాయలు....

తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఒక వాస్తవాన్ని క్యాడర్ ముందు, ప్రజలముందు ఉంచారు. తెలంగాణ రాష్ట్రసమితిలో కలిసి పోవడం మంచిదంటూ ఆయన ఇచ్చిన సలహా నాయకత్వంలో కమ్ముకున్న నైరాశ్యానికి నిదర్శనగా చెప్పుకోవాలి. రేవంత్ నిష్క్రమణ తర్వాత చాలా నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకత్వమూ, చోటామోటా నాయకులు కాంగ్రెసు, టీఆర్ఎస్ లలో రాజకీయ పునరావాసాన్ని వెదుక్కున్నారు. పార్టీని నడిపే దిక్కు కరవైంది. ఎల్. రమణ వంటి నాయకులు ఉత్సాహం నింపి పార్టీని ఉరకలెత్తించగల స్థాయి లేదు. ఎన్టీయార్ హయాంలో పార్టీలోకి వచ్చిన పెద్ద నాయకులు దాదాపు పార్టీని విడిచిపెట్టేశారు. పదమూడేళ్లపాటు తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న కాలంలో కొత్తతరం ఎవరూ టీడీపీ వైపు తొంగి చూసే సాహసం చేయలేదు. ఉన్నవాళ్లలో కొందరు రాష్ట్రవిభజన అంశంలో చంద్రబాబు ద్వంద్వప్రమాణాలపై నిరసించి వెళ్లిపోయారు. మరికొందరు ఎన్నికల వరకూ ఆగారు. ఇంకొందరు టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగిపోయారు. అధికారపార్టీతో తీవ్రంగా విభేదించే నాయకులు టీడీపీ వల్ల కాదనుకుని కాంగ్రెసు కొంగు పట్టుకున్నారు. ఏతావాతా పార్టీ ప్రస్తుతం అస్తిత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. అధికారపార్టీ, కాంగ్రెసు పార్టీ కోవర్టులూ ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారనే వాదనలు ఉన్నాయి. మొత్తం పార్టీని ప్రక్షాళన చేసి గ్రాస్ రూట్ లెవెల్ లో నిర్మాణం మొదలు పెడితే తప్ప టీడీపీ జవజీవాలు పుంజుకోవడం కష్టమని ఆంతరంగికంగా పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. ఇక తెలంగాణలో అధికారమంటే.. ఉట్టికెగరలేని వ్యక్తి..స్వర్గానికి నిచ్చెన వేసినట్లే....!

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News