జగన్ ది కరెక్టేనంటున్న బాబు

అదేంటో చంద్రబాబు ఈ మధ్య కొన్ని విషయాల్లో జగన్ చేస్తున్నది కరెక్ట్ అంటున్నారు. అయితే ఆయన రాజకీయం మాత్రం ఎక్కడా వదలడంలేదు, కానీ జగన్ కొన్ని విషయాల్లో [more]

Update: 2019-12-15 03:30 GMT

అదేంటో చంద్రబాబు ఈ మధ్య కొన్ని విషయాల్లో జగన్ చేస్తున్నది కరెక్ట్ అంటున్నారు. అయితే ఆయన రాజకీయం మాత్రం ఎక్కడా వదలడంలేదు, కానీ జగన్ కొన్ని విషయాల్లో చేస్తున్న పనులను మెచ్చుకోకతప్పడంలేదు. అలాంటిదే ఒకటి ఏపీ దిశా చట్టం. ఈ విషయంలో వైసీపీ హడావుడిగా బిల్లు తెస్తే దానికి ఏ మాత్రం అభ్యంతరపెట్టకుండా టీడీపీ కూడా ఆమోదించింది. బిల్లు మీద మాట్లాడిన చంద్రబాబు ఈ తరహా బిల్లు తేవడం మంచిదేనని అన్నారు. ఆ తరువాత విలేకరులతో మాట్లాడుతూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. వైసీపీ సర్కార్ తెచ్చిన బిల్లు కనుక కచ్చితంగా అమలు చేస్తేనే ప్రయోజనం నెరవేరుతుందని అన్నారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు తీవ్రమైన కేసుల్లో ఉన్నారని కూడా చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఇంతటి హాట్ కామెంట్స్ లో కూడా చంద్రబాబు ఒక మాట అంటున్నారు. తాను జగన్ సంకల్పాన్ని తప్పుపట్టడంలేదని. అంటే జగన్ మంచి ఆలోచనతోనే బిల్లు ప్రవేశపెట్టారని ఒప్పుకుంటున్నారన్నమాట.

ఇంగ్లీష్ విషయంలోనూ….

ఇక ఇంగ్లీష్ మీడియం విషయంలో కూడా జగన్ బాటలోనే చంద్రబాబు చివరికి నడిచారు. మొదట తెలుగు భాషని చంపేస్తున్నారు అని ని రెచ్చగొట్టారు, ఇక మ‌తంతో ముడి పెట్టాలనుకున్నారు, క్రిస్టియన్లలో మొత్తానికి మొత్తం కలిపేయడానికే ఇలా చేస్తున్నారని అన్నారు. చివరికి తాము 2017 లోనే అమలు చేయబోయామని చెప్పడం ద్వారా జగన్ చేస్తున్నది కరెక్ట్ అనేశారు. ఇక్కడ కూడా జగన్ మాట నెగ్గిందనుకోవాలి. చిత్తశుద్ధి ఉంటే ఎవరు అడ్డు చెప్పినా అది ఆగదని కూడా జగన్ అన్నారు. మరి ఆనాడు ఆంగ్ల బోధన తాను తెచ్చానంటున్న చంద్రబాబుని అది అమలు చేయకుండా ఎవరు ఆపారన్నది కూడా జగన్ అడిగిన సూటి ప్రశ్న. దానికి సమాధానం టీడీపీ వద్ద లేదు. మొత్తానికి ఆంగ్ల మాధ్యానికి ఓటు వేయడం ద్వారా జగన్ రూటే రైట్ అని మరోసారి అనేశారు చంద్రబాబు.

గోదారి నీళ్ళు సీమకు….

ఈ విషయంలోనూ క్రెడిట్ తీసుకోవాలని మొదట చంద్రబాబు ప్రయత్నం చేశారు. అయితే జగన్ వివరాలతో సహా అన్నీ చెప్పి తాము కచ్చితంగా గోదావరి మిగులు జలాలను సీమకు తీసుకెళ్ళడం ద్వారా ఆ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని సభాసాక్షిగా చెప్పారు. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. ఇదే సభలో జగన్ కొత్తగా సీఎం అయిన వేళ తెలంగాణాతో కలసి లక్ష కోట్లతో భారీ జల ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని ప్రకటించారు. ఆనాడు టీడీపీ, చంద్రబాబు గట్టిగా అభ్యంతరం పెట్టారు. కేసీఆర్ తో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తెలంగాణా భూభాగం నుంచి కనుక ప్రాజెక్ట్ నిర్మిస్తే అది చాలా ఇబ్బందులకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఈసారి జగన్ తెలంగాణాతో సంబంధం లేకుండా ఏపీ భూభాగం నుంచే 60 వేల కోట్లతో గోదావరి నుంచి భారీ ఎత్తి పోతల పధకం చేపడతామని సభలో చెబితే చంద్రబాబు సైతం ఏమీ అనలేకపోయారు.

ప్రతిపక్షం పొగడాలా…….

మొత్తం మీద జగన్ పాలనలో మొదట్లో కొంత తడబడినా ఆయనకు ఏదో చేయాలన్న తపన ఉందని మాత్రం చంద్రబాబు వంటి సీనియర్ నేత కూడా ఇండైరెక్ట్ గా అంగీకరిస్తున్నారు. అయితే చంద్రబాబు ఒక మాట అంటున్నారు. మేము ప్రతిపక్షం. ప్రభుత్వం తప్పులనే ప్రశ్నిస్తున్నాం తప్ప ఎందుకు పొగుడుతామని అంటున్నారు. చంద్రబాబు ఈ విధంగా రాజకీయంగా అంటున్నా కూడా జగన్ పాలనలో కొన్ని మంచి పనులకు మద్దతు ఇవ్వడం ద్వారా యువ ముఖ్యమంత్రి లైన్ కరెక్ట్ అని ఫార్టీ ఇయర్స్ అనుభవశాలి చంద్రబాబుసైతం అంగీకరిస్తున్నారనుకోవాలి. మరి ముందు ముందు జగన్ చేసే పనులకు టీడీపీ, చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News