దేవ్వుడా...నువ్వే కాపాడాలి...!

Update: 2018-06-22 15:30 GMT

నాయకత్వం ఎదగాలంటే ఏం చేయాలి? ప్రజల్లో కలిసి పోవాలి. ప్రజల కోసం పనిచేయాలి.సామాజిక అంశాలను తమ సొంత సమస్యలుగా భావించి పంతం పట్టాలి. పరిష్కరించాలి. ఇదంతా గతం. ఇప్పుడు నాయకులు కొత్త పద్ధతి కనిపెట్టారు. ప్రజల్లో సెంటిమెంటు రెచ్చగొడితేచాలు నాయకులైపోయినట్లే. ఇదే నూతన ఆలోచన విధానం. దీనికనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో హడావిడి మొదలైంది. నాయకులు హల్ చల్ చేస్తున్నారు. ప్రజలతో మమేకం కాని నాయకులు సైతం ప్రజామద్దతు సెంటిమెంటును ప్రయోగిస్తున్నారు. పెద్ద అస్త్రాలుగా దీక్షలను బయటికి తీస్తున్నారు. పార్టీలు, ప్రజాసంఘాలు చేయాల్సిన సామాజిక డిమాండ్లను పక్కనపెట్టేశారు. నాయకులు వ్యక్తిగత దీక్షలకు దిగుతున్నారు. ప్రభుత్వ హోదాలో ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దీక్షలకు ఆద్యునిగా నిలిచారు. పోరాట దీక్షల పేరిట సర్కారీ ఖర్చుతో ఏసీ కూలర్ల మధ్య కోట్ల రూపాయల వ్యయంతో ఒక తంతు మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా డిమాండు వీటి లక్ష్యం. ఎటూ నెరవేరని ఈ డిమాండును దీక్షలకు ప్రాతిపదికగా చేసుకోవడంలోనే రాజకీయం తొంగి చూస్తోంది.

ఎదగాలంటే ఏదో చేయాలి...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ నాయకులకు ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చేశారు. రాష్ట్ర ఏర్పాటు దినోత్సవమైన జూన్ 2 నాడు మాత్రమే కాకుండా, తన పుట్టిన రోజు న కూడా నిరసన దీక్షలు చేపట్టారాయన. ఇదే రాష్ట్ర సంకల్పమని చెప్పకనే చెప్పేశారు. ప్రయోజనాల సంగతి ఎలా ఉన్నా ప్రచారానికి, ఏర్పాట్లకు కోట్లాది రూపాయలు గుమ్మరించారు. దీనిని దృష్టాంతంగా తీసుకుని తమ వంతు దీక్షలు మొదలుపెడుతున్నారు నాయకులు. నిన్నామొన్నటి వరకూ పార్టీ ఇమేజ్ పై ఆధారపడి రాజకీయాలు, పదవులు నిర్వహించిన నాయకులు సొంత ముద్ర వేసుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ రైల్వేజోన్ దీక్ష చేశారు. అదీ తన పుట్టిన రోజున చేయడం విశేషం. తాజాగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కడప ఉక్కు కోసం దీక్ష పేరు పెట్టారు. ప్రజల నుంచి ఎప్పుడూ నేరుగా ఎన్నిక కాకుండా జాక్ పాట్ కొట్టేసిన సీఎం రమేశ్ పై అనేక వివాదాలున్నాయి. కాంట్రాక్టరుగా ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయలు పనులు పొందుతున్న రమేశ్ టీడీపీకి ప్రధాన ఆర్థిక వనరు అనే పేరుంది. అందుకే ప్రజలతో సంబంధం లేకుండా పెద్దల సభ పదవి దక్కిందనే విమర్శలున్నాయి. ఇప్పుడు ప్రజల నుంచి ప్రజాప్రతినిధిగా గెలిచేందుకు ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని ప్రాతిపదిక చేసుకుంటున్నారని పార్టీ వర్గాలు అంతర్గతంగా చెబుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఎదగాలంటే ప్రజలకు సేవ చేయడం కంటే సెంటిమెంటును పట్టుకుంటే ఈజీగా ఎదగగలమనేది నాయకుల భరోసా.

నడుం బిగిస్తేనే...

ఇక ఫీల్డులెవెల్ లోకి దిగితే తప్ప ప్రజల ఆదరణ పొందలేమనే విషయం పార్టీలు క్రమేపీ గ్రహిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని నిరంతరం ప్రచార సరంజామాతో సిద్ధంగానే ఉంచుతారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత నుంచి పూర్తిగా రాజకీయ కార్యకలాపాలతోనే రాష్ట్రాన్ని నింపేశారు. జగన్ మోహన్ రెడ్డి ఏడు నెలలుగా ప్రజల్లోనే ఉన్నారు. పవన్ కల్యాణ్ ఒక నెల రోజులపాటు ఉత్తరాంధ్ర పర్యటన చేసి, విరామం ప్రకటించారు. జనసేనకు నిర్మాణం లేకపోవడంతో ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారన్న వాదనను పార్టీ అధినేత గ్రహించారు. పార్టీ కార్యాలయానికి గతంలోనే గుంటూరులో శంకుస్థాపన చేశారు. టీడీపీ, వైసీపీ రెండూ బలంగానే ఉన్నాయి. మూడోపక్షంగా మాత్రమే జనసేనను ప్రజలు గుర్తిస్తున్నారు. సీరియస్ నెస్ కనిపించడం లేదు. ఇలాగే కొనసాగితే సంప్రదాయంగా జనసేనకు రావాల్సిన ఓటింగు కూడా కుచించుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే పవన్ కల్యాణ్ తాను పాలిటిక్స్ పై పక్కాగా, సీరియస్ గా ఉన్నాననే సందేశం ఇవ్వాలనుకున్నారు. అందుకే తన నివాసాన్ని విజయవాడకు మార్చేసుకున్నారు. ఇక నుంచి పార్టీ కార్యకలాపాలకు, ప్రజలకు సాధ్యమైనంతవరకూ విజయవాడలోనే అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టంగా తేల్చి చెప్పేశారు. మరోవైపు వామపక్షాలు సైతం ప్రజా ఉద్యమాలపై ప్రత్యక్ష కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతున్నాయి. జనసేన, వామపక్షాలు కలిసి నడిస్తేనే కొంత బలం పెరుగుతుందనే భావన నెలకొంది.

ప్రచారం..పాలిటిక్స్...

నిజానికి రాష్ట్రంలో కృత్రిమంగా సృష్టిస్తున్న ఉద్యమాలు, ఆందోళనలు అన్నీ కూడా రాజకీయాలకు ఉద్దేశించినవే. వేటికీ పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు. అయినప్పటికీ తాము తీవ్రత ప్రదర్శించడం ద్వారా ఓటర్ల నుంచి సానుభూతి కొట్టేయాలనే ధోరణి రాజకీయ పక్షాల్లో కనిపిస్తోంది. ప్రత్యేక హోదా ఇందులో ప్రధానమైనది. ఎలాగూ రాదన్న విషయం అందరికీ తెలుసు. అయినా దీక్షలు సాగుతుంటాయి. ఆందోళనలు చేస్తుంటారు. ఇదంతా రాజకీయ ఎత్తుగడ. అధికార టీడీపీ మొదలుపెట్టిన వ్యూహం. దీనికి ప్రతిగా వైసీపీ రాజీనామాల అస్త్రం బయటికి తీసింది. బీజేపీని దోషిగా చూపిస్తూ టీడీపీ గరిష్టంగా లబ్ధి పొందుతోందని గ్రహించింది. దాంతో ఏదో రకంగా ఒత్తిడి తెచ్చి ఎంపీల రాజీనామాలను ఆమోదింప చేసుకున్నారు. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ తాము త్యాగధనులమనే ముద్రతో ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ భావిస్తోంది. తెలుగుదేశం చేపట్టిన ప్రత్యేక దీక్షలకు ఈ రాజీనామాల ప్రచారం ప్రత్యామ్నాయం. ఎటాక్ లు కౌంటర్ ఎటాక్ లతో ప్రచార పాలిటిక్స్ దీక్షాదక్షతలను చాటుకొంటోంది. ఉక్కు లేదు..తుక్కు లేదు..వచ్చేది లేదు..పోయేది లేదు అంటూ అసలు సంగతిని తేల్చేసిన జేసీ వ్యాఖ్యలే కొసమెరుపు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News