ఇంతకూ జరిగిందదేనా?

Update: 2018-06-18 15:30 GMT

అక్కడ ఇప్పుడు చేసేదేం లేదని అందరికీ తెలుసు. అయినా మైలేజీ కావాలి. పాలిటిక్స్ పండాలి. తాము తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పరితపిస్తున్నామని ముద్ర పడాలి. దేశం మొత్తం తమ కోసం అగ్రనాయకులు ఏదో చేస్తున్నారని భావించాలి. వచ్చే ఎన్నికల నాటికి అజెండాను ఈ వేదికనుంచే వినిపించాలి. తాము చెప్పే ఉపన్యాసం జాతీయాంశంగా గుర్తింపు తెచ్చుకోవాలి. ప్రధాని, కేంద్రమంత్రులు, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైన అత్యున్నత వేదిక నీతి ఆయోగ్ సమావేశాల సారాంశమిదే. నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియాగా భారతదేశ రూపురేఖలను మార్చేయాలనే సమున్నత ఆశయంతో నెలకొల్పిన సంస్థ క్రమేపీ ఆ ప్రాధాన్యాన్ని కోల్పోయింది. సహకార సమాఖ్య, టీమ్ ఇండియా అంటూ తొలినాళ్లలో ఊదరగొట్టిన ఉత్సాహం క్రమేపీ కనుమరుగైంది. 2015లో నీతి అయోగ్ ఊపిరిపోసుకున్న తర్వాత ఇది నాలుగో సమావేశం. దేశ అత్యున్నత చట్టసభలైన లోక్ సభ, రాజ్యసభ లు నిర్వీర్యం అయిపోతున్న తరుణంలో సీఎంలు తమ రాష్ట్రాల హక్కులను నినదించే వేదికగా నీతి అయోగ్ ను వినియోగించుకునే వీలుంది. దేశానికి దిశానిర్దేశం చేసేందుకు అవసరమైన అజెండాను కూడా రూపకల్పన చేసుకోవచ్చు. కానీ ఎవరి అజెండాతో వారు ఈ సమావేశానికి హాజరుకావడంతో రాజకీయాలే చర్చనీయమవుతున్నాయి.

ప్రధాని జమిలీ జపం..

ఆకాశానికి, భూమికి లంగరు వేసే మాటలతో ఆకట్టుకునే ప్రధానమంత్రి తన వాక్చాతుర్యాన్ని చక్కగా ప్రదర్శించారు. 160 లక్షల కోట్ల స్థూలజాతీయోత్పత్తితో ఉన్నదేశం త్వరలోనే 350 లక్షల కోట్లకు చేరిపోనుందంటూ అతిశయోక్తులు వల్లె వేశారు. దేశంలో కొత్త ఉద్యోగాల కల్పన కుంటుపడి ఉసూరుమంటుంటే ముద్రయోజన, కౌశల్ యోజన వంటి అరకొర సాయం, శిక్షణలను పెద్దగా చేసి చూపించే ప్రయత్నం చేశారు. సర్వీసు సెక్టారుపై ఆధారపడి జాతీయోత్పత్తి పెరుగుతోందే తప్ప మేకిన్ ఇండియా వంటి నినాదాలు వట్టిపోతున్నవాస్తవాలను ఏ దశలోనూ అంగీకరించలేదు. రెండంకెల వృద్ధి, సహకార సమాఖ్య పద్ధతిలో పనిచేయాలన్న పాత ప్రవచనాలనే వల్లె వేశారు. సమావేశంలో అతికీలకమైన అంశం ఏకకాలంలో లోక్ సభకు, శాసనసభలకు ఎన్నికలు జరపాలన్న జమిలీ పద్ధతిని అజెండాలో మరోసారి ముందుకు తెచ్చారు. ఈ నిర్ణయం అమలైతే జాతీయపార్టీల్లో బలంగా ఉన్న బీజేపీవైపు రాష్ట్రాలు మొగ్గు చూపకతప్పని పరిస్థితి ఏర్పడుతుందనేది అంచనా. ఈమేరకు ఇతర పార్టీలను ఒప్పించే పనిలో నిరంతరం నిమగ్నమై ఉంటున్నారు ప్రధాని. ఈ వేదికను మరోసారి కూడా అందుకు సాధనంగా వినియోగించుకున్నారు.

కేసీఆర్ కేసు క్లోజ్...

ప్రత్యామ్నాయ అజెండా ఫెడరల్ ఫ్రంట్ అంటూ మూడు నాలుగు నెలల క్రితం హడావిడి చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తిగా చల్లబడి పోయారు. తనతో కలిసి వచ్చే ముఖ్యమంత్రులు, కీలక నాయకులు ఎవరూ లేరన్న అంశం నీతి ఆయోగ్ వేదిక సాక్షిగా మరోసారి కేసీఆర్ తెలుసుకోగలిగారు. కాంగ్రెసు , బీజేపీ రెంటికీ ప్రత్యామ్నాయమంటూ తొలుత చేసిన ప్రకటనలు వట్టి మాటలుగా నిరూపితమైపోయాయి. తెలంగాణలో తమ ప్రభుత్వం చేసిన ఘనతలను చాటుకోవడానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. రైతుబంధు , మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి అంశాల గొప్పతనాన్ని మరోసారి జాతీయ వేదికపై చాటిచెప్పారు. తమనే మిగిలిన రాష్ట్రాలు ఫాలో కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెసు, బీజేపీలకు సమ దూరం అన్న సూత్రం డొల్లగా తేలిపోయింది. బీజేపీ నాయకుల కనుసన్నల్లో తెలంగాణ సీఎం ఉన్నారంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. థర్డ్ ఫ్రంట్ ద్వారా జాతీయ నాయకుడు కావాలనుకున్నారు. బీజేపీతో అంటకాగడంతో ఆ అవకాశం చేజారిపోయింది. ఇక రాష్ట్రస్థాయి రాజకీయాలే కేసీఆర్ కు దిక్కనే వాదనలు బలం పుంజుకుంటున్నాయి.

ఆ నలుగురు...

ఈ విడత నీతి అయోగ్ సమావేశంలో ఒక సెపరేట్ జెండా, అజెండాతో కనిపించిన నలుగురు ముఖ్యమంత్రులు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి. నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు ఇంకా చాలామంది ముఖ్యమంత్రులు సిద్దం కావడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్, తమిళనాడు సీఎం పళనిస్వామి వంటివారు గోడమీద పిల్లి వాటంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ అజెండాతో బీజేపీకి దూరమైన చంద్రబాబునాయుడు, తొలి నుంచి ప్రధానితో విభేదిస్తున్న మమతాబెనర్జీ, సైద్దాంతికంగా బీజేపీని దుయ్యబట్టే పినరయి విజయన్ వంటివారు ఒక కూటమి కట్టినట్టుగా కనిపించింది. ఈ జట్టులోకి కొత్తగా వచ్చి చేరారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సంఘీభావం ప్రకటించడం మొదలు అన్నిటా ఒకే మాట ఒకేబాటగా నడిచారు. నీతి అయోగ్ వేదికపై సైతం ఒకేరకమైన అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడి చుట్టూ కాంగ్రెసు, బీజేపీయేతర రాజకీయం రూపుదిద్దుకుంటోన్న సూచనలకు నీతి అయోగ్ వేదిక దర్పణం పట్టింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News