గేమ్ ప్లాన్ ఏంటో...!

Update: 2018-08-20 15:30 GMT

అబ్బే, వీళ్లిద్దరూ మామూలోళ్లు కాదు. ఒకరు తలపండిపోయిన సీనియర్ రాజకీయవేత్త. ఇంకొకరు ఎత్తు వేస్తే ఎదుటివాళ్లు చిత్తు కావాల్సిందేనన్నంత కసి కనిపించే ఉద్యమయోధుడు. కాంగ్రెసు,బీజేపీలకు రెండు రాష్ట్రాల్లో స్థానం లేకుండా చేయడమెలా? అన్నట్లుగా ఉంది వీరి వ్యూహం. సానుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తూనే జాతీయ పార్టీలు పూర్తి బలహీనపడేలా చేసుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీలకుతప్ప జాతీయపార్టీలకు అధికార ప్రాపకం లేని మరో తమిళనాడును తమ రాష్ట్రాల్లో ఆవిష్కరించాలని చూస్తున్నారు. వీరి వ్యూహాల ముందు నేషనల్ పార్టీలు నేలబారు చూపులు చూస్తున్నాయి. ఆయా పార్టీల లోకల్ లీడర్లు తమకు ఎటువంటి సందేశం అందక దిక్కులు చూస్తున్నారు. ఆరోపణలు గుప్పించాలో, అక్కున చేర్చుకోవాలో తెలియక అల్లాడిపోతున్నారు.

ఏం మంత్రం వేశాడో...

కేసీఆర్ ఎవరికి ఏమి చెబుతాడో , దాని వెనకాల ఉన్న వ్యూహమేమిటో ఎవరికీ అంతుచిక్కదు. రెండు మార్లు ఢిల్లీ వెళ్లాడు. రెండు సార్లూ ప్రధానిని కలిశాడు. రాష్ట్రానికి వచ్చి ముందస్తు ఏర్పాట్లు చేపట్టాడు. కాలూచేయి కూడదీసుకుని అధికారపార్టీతో కలపడాలని చూస్తున్న కమలం పార్టీ స్థానిక నాయకులు డైలమాలో పడిపోయారు. అసలు రాష్ట్రంలో ఏంజరగబోతోంది? తమ జాతీయ నాయకులు కేసీఆర్ కు ఏమి హామీలు ఇచ్చారనేది వారికెవరికీ తెలియదు. లోకల్ లీడర్లను కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం తమ అధినాయకత్వమూ పట్టించుకోవడం లేదు. తగిన సమాచారం ఇవ్వడం లేదని బీజేపీ వారు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా రాజకీయ ప్రయోజనాలు సమకూరే అవకాశాలు లేవు. తెలంగాణలోని సున్నితత్వం దృష్ట్యా బీజేపీ బలపడేందుకు ఇక్కడే అవకాశాలు ఎక్కువ. ఆ అవకాశానికి కూడా కేసీఆర్ గండి కొట్టేశారు. ఆయన తీరు మోడీతో మాట్లాడతానన్నట్లుగా తయారైంది. దూకుడుగా వెళ్లవద్దని పైనుంచి బీజేపీ రాష్ట్ర నాయకులకు సూచనలు వస్తున్నాయి.

చంద్రజాలంలో కాంగ్రెసు...

కాంగ్రెసు పార్టీ రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఆంధ్రాలో ఎలాగూ నీళ్లు వదిలేసుకుంది. తెలంగాణలోనూ పూర్తిగా నిలదొక్కుకోలేకపోతోంది. ఆంధ్రాలో అస్తిత్వం నిలబెట్టుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టాలంటే టీడీపీ సహకారం అవసరమని గుర్తించింది. తెలంగాణలో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలంటే తెలుగుదేశం కలిసిరావాలి. ప్రత్యక్షలేదా పరోక్ష పొత్తు కు హస్తం చేయి చాస్తోంది. పైపెచ్చు రేపొద్దున్న కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే చంద్రబాబు అవసరం చాలా ఉంది. మమత బెనర్జీ, కుమారస్వామి , అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు ఆయనకు టచ్ లో ఉన్నారు. 60 మంది వరకూ ఎంపీల బలాన్ని సమకూర్చిపెట్టగల సామర్ధ్యం చంద్రబాబుకు ఉందని హస్తం పార్టీ నమ్ముతోంది. అందుకే బాబుతో మైత్రికి అర్రులు చాస్తోంది. ఏపీలో ఒంటరిగా వెళతామని చెబుతూనే తెలంగాణలో కలుస్తామంటూ బహిరంగప్రకటనలు చేస్తోంది. ఏదేమైనా చంద్రజాలంలో కాంగ్రెసు పూర్తిగా మునిగిపోయింది.

ఆట అర్థం కాదు...

రాజకీయ చదరంగం నడపటంలో ఆరితేరిన ఇద్దరు చంద్రులు జాతీయ పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. మార్గాలు వేరైనా ఇద్దరూ రెండు పార్టీలను ఫినిష్ చేసే ఎత్తుగడలలో నిమగ్నమై ఉన్నారు. తెలంగాణలో పెద్దగా పట్టులేని బీజేపీని ఆసరా చేసుకుంటూ కేంద్ర సహకారంతో ఎన్నికల వ్యూహాలు పన్నుతున్నారు కేసీఆర్. కాంగ్రెసును కోలుకోలేని దెబ్బతీయాలని చూస్తున్నారు. పదిలోపు సీట్లకు పరిమితం చేయాలనే దిశలో కదులుతున్నారు. ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు అయిపోవాలి. తర్వాత పార్లమెంటుకు బీజేపీతో పొత్తు అనే ప్రతిపాదన చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కేసీఆర్ అవసరం తీరిన తర్వాత అంత సులభంగా కలిసిరాడనేది బీజేపీ స్థానిక నాయకుల నమ్మకం. మరోవైపు చంద్రబాబు నాయుడు బీజేపీపై యాంటీ సెంటిమెంటు ప్రయోగించి దాదాపుగా ఆ పార్టీని ఆంధ్రాలో నిర్వీర్యం చేసేశారు. కాంగ్రెసుతో పూర్తిగా చెలిమి చేయకుండానే కేంద్రంలో తన రాజకీయ అవసరాలు, పోరాటాలకు హస్తం పార్టీని ఆసరా చేసుకుంటున్నారు. పొత్తు విషయం పక్కాగా చెప్పడం లేదు. కనీసం ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తాననే విషయంలోనూ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో చంద్రబాబు ఆట అర్థం కాక కాంగ్రెసు కొట్టుమిట్టాడుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News