ఇది బాబుకు దెబ్బేనంటారా...?

Update: 2018-10-18 16:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్రసమితి అధినాయకుడు చంద్రశేఖరరావు అన్నిటా పోటీ పడుతుంటారు. ఉద్యోగుల జీతాల పెంపుదల మొదలు, సంక్షేమ పథకాల పింఛన్ల వరకూ పోటాపోటీ వాతావరణమే. రైతురుణమాఫీ,నిరుద్యోగభ్రుతి, చివరికి ఆధ్యాత్మిక వేడుకల నిర్వహణలోనూ వీరిద్దరిదీ ఒకే బాట. ఎదుటి వారి కంటే తామే ఎక్కువ చేశామని నిరూపించుకోవాలనేది వీరి తాపత్రయం. రెండు రాష్ట్రాల్లో టీఆర్ఎస్, టీడీపీ ప్రభుత్వాలు ఏర్పాటైంది మొదలు ఈ పోలికల పోటీ నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఎన్నికల ముంగిట్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి టీడీపీ, టీఆర్ఎస్ ల రాజకీయపోటీ చర్చనీయమవుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళుతున్న టీఆర్ఎస్ సంక్షేమ పథకాల విషయంలో సరికొత్త రికార్డు సృష్టించేలా ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. సకలజన సంక్షేమమే లక్ష్యం,గమ్యం అన్నట్లుగా వండివార్చిన ఈ మేనిఫెస్టోను చూసి ఎవరికైనా తలతిరిగిపోవాల్సిందే. నిధులు ఎక్కణ్నుంచి తెస్తారు? అప్పులు ఎలా చెల్లిస్తారు? సర్కారు దివాళా తీస్తే దిక్కెవరు? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. మరోసారి అధికారంలోకి వస్తే చాలు తర్వాత సంగతి చూసుకోవచ్చన్న భావనే ఎక్కువగా వ్యక్తమవుతోంది.

లక్ష్యం ..గమ్యం...

‘రాజకీయాలంటే ప్రతిపక్షాలకు ఒక గేమ్. మాకు మాత్రం ఒక టాస్క్.’ అంటూ కేసీఆర్ నొక్కి మరీ చెప్పారు. టీఆర్ఎస్ పరంగా చూస్తే లక్ష్యం, గమ్యం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రప్రగతి అంటూ తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి టీఆర్ఎస్ ప్రస్థానం అటువైపేనా ? అంటే అనుమానాలు వ్యక్తమవుతాయి. సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణ సరికొత్త రికార్డులు స్రుష్టిస్తోంది. ఈవిషయంలో ఎవరికీ పెద్దగా సందేహాలు లేవు. వ్యవసాయ రుణమాపీని దాదాపు విమర్శలకు అతీతంగా టీఆర్ఎస్ సర్కారు అమలు చేసింది. కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు వంటివాటిపైనా ఫెద్ద ఎత్తున క్రుషి చేసింది. తాజాగా ప్రవేశపెట్టిన రైతుబంధు మరో పెద్ద పథకం. వీటన్నిటి లక్ష్యం ఎన్నికలన్న విషయంలో రాజకీయ పార్టీలకు మరో ఆలోచన లేదు. సందేహమూ, సంశయమూ అంతకంటే లేవు. అయితే టీఆర్ఎస్ అధికారికంగా ఒప్పుకోదు. అంతమాత్రాన సమకూరే నష్టమూ లేదు. పొలిటికల్ గేమ్ అంటూ ప్రతిపక్షాలను ఎద్దేవా చేసిన కేసీఆర్ అదే తరహా పథకాలకు పదును పెడుతున్నారు. తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టో అందుకు అద్దం పడుతోంది.

అప్పు చేసి పప్పు కూడు...

ఏదోరకంగా పబ్బం గడిస్తే చాలు. కొత్తగా అప్పు పుడితే చాలు. అధికారం ఉంటే ఏదో రకంగా అప్పులు పుట్టించవచ్చు. ఒకవేళ విధి ప్రతికూలిస్తే వచ్చేవాడు అప్పు తీర్చుకుంటాడు. ఈరకమైన ధోరణి అధికారపక్షాల్లో ప్రబలిపోయింది. గడచిన నాలుగు సంవత్సరాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుల ఖాతా భారీగా పెరిగిపోయింది. అంతకుముందు అరవై సంవత్సరాల్లో చేసిన అప్పులకు రెట్టింపు మొత్తాన్ని నాలుగేళ్ల స్వల్ప వ్యవధిలోనే దూసి తెచ్చేశారు. రెండు రాష్ట్రాలు ఈవిషయంలో తమ రికార్డులను తామే బద్దలు కొట్టుకుంటున్నాయి. అమరావతి నిర్మాణం, బాండ్ల విడుదల వంటి విషయాలతో ముడిపెట్టి రుణాలకు కొత్త మార్గాలు తెరుస్తోంది ఆంధ్రప్రదేశ్. తెలంగాణ మరో పద్ధతిని అనుసరిస్తోంది. కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ద్రవ్యబాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్ట పరిమితులకు చిక్కకుండా అప్పులు తెస్తోంది. ఆయా కార్పొరేషన్లు చేసిన అప్పులు 50 వేల కోట్ల రూపాయల వరకూ ఉండవచ్చనేది అంచనా. ప్రభుత్వం నేరుగా చేసిన రుణాలకు ఇది అదనం. సర్కారీ అప్పుల పద్దు లక్షా యాభైవేల కోట్లరూపాయల పైచిలుకు కు చేరింది. అప్పు చేసి పప్పు కూడు విధానానికి అధికారిక ముద్ర పడుతోంది.

సైకిల్ సంగతేమిటి?...

టీఆర్ఎస్ ప్రతిపాదించిన మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి రూపాయలతో నిరుద్యోగభృతి ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ నిరుద్యోగులకు నెలకు మూడు వేలరూపాయలు ఇస్తామంటూ వాగ్దానం చేస్తోంది. ఆసరా పింఛన్లు రెండువేల రూపాయలపైచిలుకు ఇస్తామంటోంది. లక్షరూపాయల వరకూ రైతు రుణమాఫీకి వాగ్దానం చేస్తోంది. పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేసింది. ఇంకా పూర్తిగా స్థిరపడని ఆర్థిక వ్యవస్థతో సతమతమవుతోంది ఆంధ్రప్రదేశ్. గతంలో పక్కరాష్ట్రంతో పోల్చి ఉద్యోగులను సంతృప్తిపరచాలనే ఏకైక లక్ష్యంతో వారు ఊహించని, ఆశించని మొత్తాలను వేతనసవరణలో చేసేశారు. ఇప్పుడు ఎన్నికల పండగ వచ్చేస్తోంది. వెనకబడితే వెనకడుగే. టీఆర్ఎస్ మేనిఫెస్టో పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. అదే తరహాలో టీడీపీ సైతం వండివార్చాలనుకుంటోంది. అయితే 2014లో చేసిన రైతు రుణమాఫీయే ఇంకా పూర్తికా అమలు కాలేదు. రెండు విడతలు మిగిలే ఉంది. వాగ్దానం చేసినప్పటికీ ప్రజలు విశ్వసిస్తారనే నమ్మకం లేదు. దీంతో సైకిల్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News