నాలుగేళ్ల నవ చాలనం

Update: 2018-06-02 15:30 GMT

భారత రాజకీయాల్లో తెలుగోడిది ఒక ప్రత్యేకత. తొలి భాషాప్రయుక్త రాష్ట్రమే కాకుండా ఆ నిబంధనకు చరమగీతం పాడి మళ్లీ ప్రాంతీయ ఆకాంక్షలకు పట్టంగట్టిందీ తెలుగు రాష్ట్రాలే. ఒకవైపు సీనియర్ ముఖ్యమంత్రి , మరోవైపు ఉద్యమ నాయకుడు ఆంధ్రా,తెలంగాణలను ఏవిధంగా ముందుకు నడిపారనే అంశం సర్వత్రా చర్చనీయమవుతోంది. గడచిన నాలుగేళ్లలో సాగినదే పాలనగా చెప్పుకోవాలి. మిగిలినది ఎన్నికల ఏడాది కాబట్టి అంతా రాజకీయమే నడుస్తుంది. అద్భుతాలు ఆవిష్కరించకపోయినా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పూర్తి పొటెన్షియల్ ను సద్వినియోగం చేసే దిశలో అడుగులు పడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలా విషయాల్లో ఉదాసీనత కొనసాగేది. పోకస్డ్ గా డెవలప్మెంట్ పై కేంద్రీకరణ సాగేది కాదు. ఇప్పుడు నాది అన్నభావన. తమ ప్రాంతం అభివృద్ధి చెందితేనే మనుగడ అన్న ప్రాప్తకాలజ్ణత పాలకుల్లో ఏర్పడింది. విభజిత రాష్ట్రాల్లో ఏర్పడిన పోటీ తత్వం కూడా ప్రగతికి దోహదకారిగా మారింది. ఇద్దరు నాయకులూ సమర్థ ముఖ్యమంత్రులుగా తమనుతాము నిరూపించుకునే ప్రయత్నంలో విజయం సాధించారు. అనుభవం ఆసరాగా ఆర్థిక ఆటంకాలను అధిగమించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు. ప్రజల ఆకాంక్షలే పథకాలుగా పాలనపై పట్టుసాధించారు కేసీఆర్.

చిక్కులకు చంద్రన్న చెక్...

కొత్తగా రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆంధ్రప్రదేశ్ కే ఎక్కువ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇది అందరూ ఊహించిందే. ప్రజలు కూడా ముందస్తుగానే పసిగట్టి అనుభవజ్ణుడైన చంద్రబాబును సీఎంగా చేశారు. ఆర్థిక సమస్యలు, రాజధాని నిర్మాణం, ఎన్నికల హామీల అమలు వంటి వన్నీ తలపై భారంగా పరిణమించాయి. ఒక్కటొక్కటిగా ఆయా చిక్కుముడులను విప్పుకుంటూ ప్రజలకు ప్రభుత్వ కష్టాలు తెలియకుండా వ్యవహారనైపుణ్యం ప్రదర్శించారు చంద్రబాబు. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న పక్క రాష్ట్రంతో పథకాల విషయంలోనూ పోటీ పడ్డారు. చంద్రబాబు పాలనాదక్షుడే కాకుండా ఫక్తు రాజకీయవేత్త. ఈ నాలుగేళ్లు పాలిటిక్స్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కలగలిపి రంగరించిన ఘట్టాలు కనిపిస్తాయి. ఎప్పుడు ఎవరితో పొత్తు కలపాలో, ఏ క్షణంలో చిత్తు చేయాలో టైమింగ్ పాటించారు. అంతిమంగా రాజకీయప్రయోజనం పరమావధిగా నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానికి రైతులను ఒప్పించి 34 వేల ఎకరాల భూమిని సర్కారుకు పైసా ఖర్చు లేకుండా సమీకరించడం ఒక అపూర్వ ఘట్టం. టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న అంచనాలు చేరుకోలేకపోతున్న తరుణంలో రాజకీయ పాచిక ప్రయోగించి బీజేపీకి దూరమయ్యారు. కేంద్రాన్ని దోషిగా నిలపడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రతను తగ్గించుకుంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. పవన్ తో నాలుగేళ్లపాటు సాన్నిహిత్యం నెరపడం, జగన్ ఏమాత్రం రాజకీయంగా గెయిన్ చేయకుండా చూసుకోవడంలోనూ బాబు నైపుణ్యం తేటతెల్లమయ్యింది.

కేక పుట్టించిన కేసీఆర్..

కేసీఆర్ కు ఉండే వ్యక్తిగత బలహీనతలను దృష్టిలో పెట్టుకుని పరిపాలన సాగించలేడంటూ తొలి దశలో విమర్శలు వినిపించేవి. నాలుగేళ్లలో తెలంగాణలో తిరుగులేని నాయకునిగా నిరూపించుకున్నారు. ఉద్యమమే ఊతంగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆ సెంటిమెంటు ప్రభావం తగ్గిపోతుంది.దీనిని గ్రహించే కేసీఆర్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు,ఆలోచనలకు అనుగుణమైన పథకాలను రూపకల్పన చేశారు. గడచిన రెండు దశాబ్దాలుగా కులాల వారీగా రాజకీయాధికారాన్ని ఆశిస్తున్న సామాజిక వర్గాలు పెరుగుతున్నాయి. ఈ సోషల్ బేస్ కేసీఆర్ కు లేకపోవడం ప్రధాన లోపం. దీనిని అధిగమించాలంటే ముఖ్యమైన పార్టీలకు మద్దతుగా నిలుస్తున్న సామాజిక వర్గాల్లోకి చొచ్చుకుపోవాలి. ఆయా పార్టీలను బలహీన పరచడం ద్వారా సంఘటితమైన మద్దతులో చీలిక తేవాలి. బీసీలు వెన్నుదన్నుగా ఉన్న తెలుగుదేశం పార్టీని రాజకీయంగా కేసీఆర్ దెబ్బతీయగలిగారు. టీడీపీ బలహీనపడటంతో బేస్ కోల్పోయింది. ప్రత్యేక రిజర్వేష్లన్లు, ఎంఐఎంతో స్నేహం పేరిట ముస్లిం సామాజికవర్గాన్ని టీఆర్ఎస్ కు చేరువ చేసేందుకు యత్నించారు. తనకు లేని సోషల్ బేస్ గ్యాప్ ను వివిధవర్గాలను ఆకట్టుకోవడం ద్వారా భర్తీ చేసుకోవాలని కేసీఆర్ పక్కాగానే పావులు కదిపారు. ఆర్థికంగా, అంగబలం రీత్యా పటిష్టంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం మద్దతుతో ఉన్న కాంగ్రెసు పార్టీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ వేసిన ఎత్తుగడలు రాజకీయ పరిణతికి అద్దం పడుతున్నాయి. పరిపాలనను సుస్థిరం చేసుకుని పాలిటిక్స్ లో పట్టు సాధించగలిగారు కేసీఆర్.

ప్లస్సులు, మైనస్సులు..

రెండు రాష్ట్రాల ఏర్పాటును చాలామంది నెగటివ్ గా చూశారు. కానీ ఓవరాల్ గా మంచే జరిగిందనేది కాలం చెబుతున్న సత్యం. కేంద్ర విద్యాలయాలు మొదలు సంస్థల వరకూ రెండేసి ఏర్పాటు చేయకతప్పని స్థితి ఏర్పడింది. చిన్న మంత్రివర్గాలు, వికేంద్రీకృతపాలన సాధ్యమైంది. ప్రజల్లోనూ, పాలకుల్లోనూ తమ సొంత ప్రాంతం అన్న భావన పెరిగింది. శాశ్వతజలవనరులదిశలో రెండు రాష్ట్రాల్లోనూ బృహత్తర కృషి మొదలైంది. ఇటు కాళేశ్వరం, అటు పోలవరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు జలసిరులు. పెట్టుబడుల ఆకర్షణలోనూ ఇరు రాష్ట్రాలూ విజయం సాధిస్తున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతాలు పారిశ్రామికీకరణ దిశలో వేగం పుంజుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇంతటి కృషి పెట్టి ఉండేవారు కాదు. హైదరాబాదుకున్న సహజ ఆకర్షణ తెలంగాణకు ఎలాగూ అస్సెట్ గా మారింది. బడ్జెట్టులు రెట్టింపు అయ్యాయి. తలసరి ఆదాయం సైతం మెరుగైంది.కొన్ని మైనస్సులూ వెన్నాడుతున్నాయి. కాంట్రాక్టుల్లో అవినీతి గతంలో కంటే బాగా పెరిగింది. ప్రభుత్వాల్లో పారదర్శకత లోపించింది. మీడియాను రకరకాల రూపంలో లొంగదీసుకోవడం కనిపిస్తోంది. తద్వారా నెగటివ్ వార్తలు రాకుండా కట్టడి చేయడం వల్ల ప్రజాస్వామ్య యుత స్వేచ్ఛావాతావరణం లోపించింది. భావప్రకటనకు నిర్బంధాలు, నిషేధాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాలనూ అప్పుల కుప్పలుగా మార్చేయడమూ రానున్న తరాలపై భారమే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News