సైకిల్ ‘పై‘ చేయి...!!

Update: 2018-11-02 14:30 GMT

రాజకీయంగా వచ్చిన సామెతలు నూటికి నూరుపాళ్లు అనుభవైకవేద్యాలని నిరూపితమవుతుంటాయి. రాహుల్, చంద్రబాబుల భేటీ వీటికొక తాజా ఉదాహరణ. ’పాలిటిక్స్ లో పర్మినెంట్ శత్రువులు, మిత్రులు ఉండరు. అరుదైన కలయికలు అక్కడ సాధ్యమే.‘ ఇదీ అలాంటిదే. కాంగ్రెసు పార్టీ వ్యతిరేక పునాదులపై ఊపిరిపోసుకుంది తెలుగుదేశం పార్టీ తన సిద్దాంతానికి నీళ్లొదులుతూ కాంగ్రెసును అధికారంలోకి తెస్తానంటూ తాజాగా ప్రతిన బూనుతోంది. బీజేపీతో సిద్దాంతవైరుద్ధ్యం కాదు. కేంద్రంతో కయ్యమూ కారణం కాదు. ప్రధాన హేతువు రాజకీయ అవసరమే. సైకిల, హస్తం పార్టీల మైత్రిని తెలుగుదేశం క్యాడర్ ఎలా తీసుకుంటుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షిస్తారా? రాజకీయ అనివార్యతను రాజకీయ ప్రయోజనంగా మార్చుకోగలుగుతారా? వంటి సందేహాలు , అనుమానాలు అనేకం వెన్నాడుతూనే ఉన్నాయి.

ఒకే ప్లాట్ ఫారమ్...

‘సేవ్ డెమొక్రసీ, సేవ్ నేషన్’ నినాదాన్ని తలకెత్తుకున్న చంద్రబాబు నాయుడు తన చాణక్యాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు. నేరుగా కాంగ్రెసు తో పొత్తు అన్న ప్రచారం రాకుండా తెలివిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ వ్యతిరేకతను ముందుకు తెచ్చిపెట్టడం ద్వారా కాంగ్రెసుకు ముసుగు కప్పుతున్నారు. నేషన్ ఫస్టు అన్న సిద్దాంతాన్ని అవసరానికి అనువుగా వాడుకుంటున్నారు. దేశంలో బీజేపీ నేతలు వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు కాబట్టి కాంగ్రెసుతో చేతులు కలుపుతున్నామంటూ తెలుగుదేశం అధినేత తెలివిగా చెప్పుకొచ్చారు. నిజమే. మోడీ, అమిత్ షా ల ద్వయం తమ అధికారాన్ని స్థిరం చేసుకునే క్రమంలో భాగంగా అడ్డుచెప్పేవారిని అథ: పాతాళానికి తొక్కేస్తున్నారు. కానీ ఇది ఈరోజున మొదలైన ప్రక్రియ కాదు. నిన్నామొన్నటివరకూ భాగస్వామిగా ఉన్న టీడీపీ హయాంలోనూ సాగింది. అప్పుడు నోరెత్తని తెలుగుదేశం హఠాత్తుగా ప్రజాస్వామ్యానికి ప్రమాదం ముంచుకొచ్చిందని చెప్పడం విడ్డూరమే. ఒకే వేదికపై , ఉమ్మడి అజెండాతో మోడీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామంటూ రాహుల్ , చంద్రబాబు లిద్దరూ సంయుక్తంగా ప్రకటించారు. దేశ రాజకీయాల్లో ఒక మార్పునకు సంకేతంగానే దీనిని భావించాలి.

మధ్యవర్తి....

విడిగా చూస్తే తెలుగుదేశం,కాంగ్రెసుల సహకారం పరిధి ఆంధ్ర,తెలంగాణలకే పరిమితంగా చెప్పుకోవాలి. దానికి మించి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా పోషించాల్సిన పాత్ర పెద్దగా ఉంది. బీజేపీని ఓడించే అజెండా తనదే అన్నట్లుగా ఆయన భుజానికెత్తుకున్నారు. కాంగ్రెసుపార్టీకి కొన్నికష్టాలున్నాయి. అనేక ప్రాంతీయపార్టీలు, వామపక్షాలు కాంగ్రెసు గూటికిందకొచ్చి పనిచేసేందుకు సుముఖంగా లేవు. అలాగని మూడో ప్రత్యామ్నాయం కట్టి పవర్ చూపించేంత సాహసమూ, బలమూ వాటికి లేదు. చంద్రబాబు వంటి సీజన్డ్ పొలిటిషియన్ సహకారము వాటికీ, కాంగ్రెసుకూ చాలా అవసరం. కాంగ్రెసు ముక్త భారత్ నినాదాన్ని ప్రతిధ్వనిస్తున్న బీజేపీ ప్రాంతీయపార్టీలు, ఇతర ప్రత్యర్థులు సైతం ఎదురు నిలవని వాతావరణాన్ని కల్పిస్తోంది. కాంగ్రెసు, ప్రాంతీయ పార్టీలు అన్నీ కమలం గాలిలో కొట్టుకుపోతాయేమోనన్న భయం నెలకొంది. అందుకే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు పాత్ర అనివార్యమవుతోంది. మమతాబెనర్జీ, మాయావతి,నవీన్ పట్నాయక్ వంటివారితో సత్సంబంధాలున్న చంద్రబాబు ఎంతోకొంత కాంగ్రెసుకు అనుకూల వాతావరణాన్ని స్రుష్టించగలరనే నమ్మకం రాజకీయవర్గాల్లో ఉంది.

ఏపీలో ఎడమొఖమే...

తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెసు, తెలుగుదేశం కలిసి నడవాలని నిర్ణయించుకున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు రోడ్ మ్యాప్ ను తయారు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయం మాత్రం ఇంకా సందిగ్ధంగానే ఉంది. రాష్ట్ర విభజనకు ప్రధాన దోషిగా కాంగ్రెసును చూపిస్తూ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రచారం సాగించింది. ఆమేరకు రాజకీయ లబ్ధి పొందింది. ఇప్పుడు అదే కాంగ్రెసుతో చేయి కలుపుతోంది. దీనిని రాజకీయ నాయకుల తరహాలో ప్రజలు సులభంగా జీర్ణించుకోలేరు. ప్రధానంగా రెండు అవరోధాలు వెన్నాడుతున్నాయి. ఒకటి తొలినాటి నుంచి టీడీపీ క్యాడర్ కాంగ్రెసుకు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చింది. రెండు రాష్ట్రవిభజనలో కాంగ్రెసు పాత్రను తక్కువ చేసి చూపించడం సాధ్యం కాదు. అందువల్ల ఏపీ లో టీడీపీ, కాంగ్రెసులు వేర్వేరుగానే పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఏర్పాటయ్యే కాంగ్రెసు ప్రభుత్వానికి మద్దతు ఇస్తామంటూ టీడీపీ తెలివైన ప్రకటనతో సరిపుచ్చవచ్చనేది రాజకీయ అంచనా. ఒకవేళ 2019లో బీజేపీ అధికారానికి చేరువగా వస్తే ..మళ్లీ నినాదాలు కొత్త రూపు సంతరించుకుంటాయి. ప్రజాస్వామ్య అనివార్యతలు రూటు మారుస్తాయి. అదే అసలు సిసలు రాజకీయం.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News