నో ఫస్ట్ యూజ్…

అణ్వస్త్రాలు కలిగిన దేశాలు ఒక అవగాహనకు వస్తుంటాయి. తమ దేశం మొదటిగా శత్రు దేశంపై అణు ఆయుధాలు ప్రయోగించదని చెబుతుంటాయి. దీనివల్ల తమ ఉదారతను చాటు కోవడమే [more]

Update: 2019-06-14 15:30 GMT

అణ్వస్త్రాలు కలిగిన దేశాలు ఒక అవగాహనకు వస్తుంటాయి. తమ దేశం మొదటిగా శత్రు దేశంపై అణు ఆయుధాలు ప్రయోగించదని చెబుతుంటాయి. దీనివల్ల తమ ఉదారతను చాటు కోవడమే కాదు, తమ దేశ రక్షణకు సంబంధించి జాగ్రత్త తీసుకున్నట్లుగా కూడా చూడాలి. ఎందుకంటే ఒకసారి అణ్వాయుధాలు వాడితే అంతర్జాతీయ సమాజం మొత్తం ఆ దేశానికి వ్యతిరేకమైపోతుంది. పైపెచ్చు ప్రత్యర్థి ఎలాగూ ఏదో రూపంలో దాడి చేసిన దేశంపై వాటిని తిరిగి వినియోగిస్తాడు. పర్యవసానంగా ఇరుదేశాలు నాశనమవుతాయి. ఇటువంటి ఇబ్బంది లేకుండా శాంతిదూతలుగా తమను తాము ప్రకటించుకునే క్రమంలోనే నో ఫస్ట్ యూజ్ అనే సాంకేతిక, నైతిక , దౌత్య నీతిని ప్రకటిస్తుంటాయి. ఇది ఇరుపక్షాలకూ క్షేమ దాయకం. రాజకీయాల్లోనూ అంతే. పరస్పరం ఎన్ని రకాలుగా విమర్శలు గుప్పించుకోవాలో అన్ని విధాలుగానూ రోడ్డున పడి చెలరేగిపోయిన పార్టీలు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు. ఎన్నిక ముగిసింది. ఏకపక్షంగా తీర్పు వచ్చేసింది. ప్రజాక్షేత్రంలో ఎవరి బలమెంతో తేలిపోయింది. అందువల్ల ఇరుపార్టీలు గత వైరాన్ని పక్కనపెట్టి కొత్తగా రూపుదిద్దుకుంటున్న రాష్ట్రానికి ఏది ప్రయోజనమనే విషయంపై దృష్టి పెడితే మంచిదంటున్నారు సీనియర్ నాయకులు. గడచిన వారం రోజులుగా అదే వాతావరణం కనిపించినప్పటికీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన నేపథ్యంలో మళ్లీ గాడి తప్పి శత్రు శిబిరాలుగా మోహరిస్తారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉభయతారకం…

కొంతకాలం పాటు విమర్శలు చేయకుండా ప్రభుత్వం పనితీరును అధ్యయనం చేయాలని చంద్రబాబు నాయుడు తొలుత సూచించడం మంచి పరిణామంగానే కనిపించింది. అనూహ్యమైన ప్రజామద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా వెంటనే విరుచుకుపడితే ఓర్వలేనితనమే బయటపడుతుంది. ప్రజల్లో ప్రతిపక్షానికి మరింత చెడ్డపేరు వస్తుంది. ఇది గ్రహించి సీనియర్ రాజకీయవేత్తగా పార్టీ నాయకులకు సంయమనం పాటించాలనే హితోక్తులు పలికారు. అదే విధంగా ప్రతిపక్షంపై వ్యక్తిగతంగా కక్ష సాధింపు ఉండదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రకటించారు. గతంలో అధికార టీడీపీ తనకు అవకాశం ఇవ్వడం లేదని అసెంబ్లీనే బహిష్కరించాల్సి వచ్చింది. గతంలో ఎన్టీరామారావు, జయలలిత వంటి కరిష్మాటిక్ నాయకులు మాత్రమే ఇంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకోగలిగారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డినే చెప్పుకోవాలి. తాను మాత్రమే కాకుండా మొత్తం పార్టీయే అసెంబ్లీని బహిష్కరించడం చిన్న విషయం కాదు. అయినప్పటికీ ప్రతిపక్షానికి సముచిత గౌరవాన్ని ఇస్తామని చెప్పడం ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్యమంత్రిగా జగన్ లోని పరిణతిని కూడా చాటిచెబుతుంది. అయితే ప్రాజెక్టుల్లోని అవినీతి, రాజధాని నిర్మాణంలోని అక్రమాలు, పర్సంటేజీలుగా పారిన నిధుల ప్రవాహాలపై ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ప్రజాధనాన్ని కక్కించేందుకు బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సర్కారు కు సంపూర్ణమైన అధికారం ఉంటుంది. అందుకు ఉపక్రమిస్తే టీడీపీ సైతం అడ్డు చెప్పలేదు. అయితే అది కక్ష సాధింపుగా కనిపిస్తే మాత్రం అధికారపార్టీకి లభించిన ప్రజామద్దతును దుర్వినియోగం చేసినట్లవుతుంది.

ఆ బలం ప్రజాశీర్వాదం…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1994లో ఎన్టీయార్ నేతృత్వంలో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత ఇంతటి పెద్ద విజయం మరే పార్టీకి దక్కలేదు. ఇప్పుడు వైసీపీ ఆ రికార్డును తిరగరాసింది. ప్రజలిచ్చిన ఈ బలాన్ని వారి సంక్షేమం కోసం, రాష్ట్రప్రగతి కోసం సంపూర్ణంగా వినియోగిస్తేనే వైసీపీకి మంచి పేరు నిలబడుతుంది. లేకపోతే రాజకీయాల్లో ఓడలు బళ్లు, బళ్లు ఓడలు కావడానికి ఒక ఎన్నిక సరిపోతుంది. అయితే యువరక్తం తొణికిసలాడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలను నియంత్రించడం అంత సులభం కాదు. రెండు సంవత్సరాల పాటు తాము అసెంబ్లీకి దూరం కావడానికి కారణమైన టీడీపీ పట్ల ఉదారంగా ఉంటారనుకోలేం. అయితే అధికారం వచ్చినప్పుడు అణకువగా ఉండటం చాలా అవసరం. లేకపోతే ప్రజల్లో ప్రతిపక్షానికి అనవసరమైన సానుభూతి తెచ్చిపెట్టినట్లవుతుంది. అందులోనూ ఇప్పుడు ఎన్నికలనేవి నిరంతర ప్రక్రియ గా మారిపోయాయి. స్థానిక సంస్థలు మొదలు ఉప ఎన్నికల వరకూ ఎప్పుడు ఏమి వచ్చిపడతాయో తెలియడం లేదు. అందుకే వచ్చిన మెజార్టీని ప్రజాశీర్వాదంగా భావించి ముందడుగు వేస్తేనే వైసీపీకి మేలు. అందులోనూ ఏ మాత్రం అవకాశం దొరికినా రాయలసీమ ముఠాతత్వం పేరిట అధికారపార్టీని బద్నాం చేయడానికి టీడీపీ ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది. అవినీతిపై దూకుడు ప్రదర్శిస్తే ఫర్వాలేదు. కానీ టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను సహేతకు కారణాలు లేకుండా పక్కన పెడితే వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉంటుంది. పొరుగు రాష్ట్రం, కేంద్రం ప్రస్తుతం సంపూర్ణంగా సహకరించే రాజకీయ వాతావరణం ఏర్పడింది. అందువల్ల పోలవరం వంటి ప్రాజెక్టులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేస్తే శాశ్వతమైన ప్రయోజనం దక్కుతుంది.

నేలమీద నడిస్తేనే...

ప్రజలు ఎవరినీ అనవసరంగా అధికారం నుంచి దింపేయడం జరగదు. కేంద్రంలో మళ్లీ మోడీయే అధికారం దక్కించుకున్నారు. దాయాది తెలంగాణలో మళ్లీ కేసీఆర్ గద్దె నెక్కారు. కానీ చంద్రబాబు నాయుడికి మాత్రం ప్రజలు ఆ చాన్సు ఇవ్వలేదు. కేంద్రంతోనూ, పొరుగు రాష్ట్రంతోనూ సత్సంబంధాల కంటే శత్రుభావంతో ప్రజల్లో సెంటిమెంటును రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని తెలుగుదేశం భావించింది. ఆ ప్రయత్నం వికటించింది. యాంటీ తెలంగాణ, యాంటీ మోడీ ప్రచారం ఫలించలేదు. కనీసం దానిని ప్రజలు పట్టించుకోలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ, ఆకాశ హర్మ్యాలతో కూడిన అమరావతి, పోలవరం పూర్తి వంటి హామీలేవీ నెరవేర్చలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ప్రజల్లో అంచనాలు పెంచేశారు. ఆచరణలో చూపలేకపోయారు. తన కాలంలో ఎక్కువ సమయాన్ని రాజకీయ ఎత్తుగడలకు వినియోగించారు. ఫలితంగా పరాభవం తప్పలేదు. ఎంతగా ప్రచారం చేసుకున్నప్పటికీ , చివరి క్షణాల్లో ఎన్ని సంక్షేమ పథకాలను పట్టాలకు ఎక్కించినప్పటికీ ప్రజల్లో విశ్వాసం కొరవడింది. ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా పనిచేయకుండా కక్షపూరితంగా ప్రతివిషయాన్ని రాజకీయం చేద్దామని చూస్తే తెలుగుదేశం పార్టీ మరింత ఇబ్బందుల్లో పడుతుంది. ఓటమిని అంగీకరించడమే కాకుండా ఆత్మావలోకనం చేసుకుని లోపాలను దిద్దుకుంటేనే వైసీపీకి దీటైన పార్టీగా వచ్చే ఎన్నికల నాటికి తనను తాను నిరూపించుకోగలుగుతుంది. తెలుగుదేశం పార్టీ మీద తాజాగా మంత్రులు గురిపెట్టి విమర్శలు మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడిని లక్ష్యం చేసుకుంటూ వ్యవసాయ, నీటి పారుదల శాఖల మంత్రులు అప్పుడే బాణాలు ఎక్కుపెడుతున్నారు. అదే సమయంలో తెలుగు దేశం సైతం అభివ్రుద్ధి ఆగిపోతోందంటూ గగ్గోలు మొదలు పెట్టింది. జగన్, చంద్రబాబు నాయుడు విజ్ణత ప్రదర్శించకపోతే ఆంధ్రప్రదేశ్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది.

Tags:    

Similar News