తగ్గడు... వెరవడు...ఈ చంద్రుడు...!

Update: 2018-06-08 15:30 GMT

చంద్రబాబు నాయుడికి ఒక ప్రత్యేకత ఉంది. అలుపెరుగని పట్టుదల. అనుకున్నది సాధించే పంతం. అదే విషయాన్ని పదే పదే చెప్పే ఓపిక. రాజకీయాల్లో రాణింపునకు ఈ లక్షణాలు చాలావరకూ దోహదం చేశాయి. గతంలో తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. తాజాగా విభజిత ఏపీ తొలి సీఎంగా నాలుగేళ్లు పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి అరుదైన అవకాశం వేరెవ్వరికీ దక్కలేదు. భవిష్యత్తులో అవకాశం లేదు. అచంచలమైన నమ్మకంతో అధికారపగ్గాలు అప్పగించారు ప్రజలు. నిర్వీర్యమైపోతున్న టీడీపీకి నీరు పోశారు. నాలుగేళ్ల నడకలో తాము ఆశించింది ఎంతవరకూ నెరవేరిందని అసెస్ చేసుకుంటున్న తరుణమిది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఎదురీదడంలో చంద్రబాబునాయుడు తన రాజకీయ నైపుణ్యాన్ని బాగానే ప్రదర్శించగలిగారు. కేంద్రప్రభుత్వం నుంచి మ్యాగ్జిమమ్ ప్రాజెక్టులు రాబట్టడంలోనూ మంచి ఫలితమే సాధించారు. పాలన, రాజకీయం కలగలిసిన నాలుగేళ్ల ప్రస్థానంలో పాలిటిక్స్ దే పైచేయిగా మారింది.

ఆశ బారెడు..ఆచరణ మూరెడు.....

ఆంధ్రప్రదేశ్ విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు అయితేనే పరిస్థితులను చక్కదిద్దగలరని ఏపీలో మెజార్టీ ప్రజలు భావించారు. సామాజిక సమీకరణలు వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ చివరి క్షణాల్లో విద్యావర్గాలు, మధ్యతరగతి మొగ్గు టీడీపీ వైపు స్వింగ్ అయ్యింది. దాంతో గెలుపు సులభసాధ్యమైంది. అయితే ఏపీని ఒక భూతల స్వర్గంగా, ప్రపంచ అద్భుతంగా మారుస్తానంటూ మూడేళ్లపాటు చంద్రబాబు చేసిన విన్యాసాలు కొంత ప్రతికూలతకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి, ఆచరణాత్మక వాస్తవికతను దృష్టిలో పెట్టుకోకుండా హామీలు గుప్పించారు. డిజైన్లు, గ్రాఫిక్కులతో ఏదో జరగబోతోందనే చిత్రాన్ని ఆవిష్కరించారు. అమరావతి నిర్మాణం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఇది టీడీపీ ఇమేజ్ ను దెబ్బతీసే సూచనలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికే పూర్తిచేస్తామంటూ నిర్మాణ బాధ్యతను రాష్ట్రప్రభుత్వం తలకెత్తుకుంది. ఇది కూడా ఫలించలేదు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన కాపు రిజర్వేషన్లు, నిరుద్యోగభ్రుతి వంటివి ఇంకా అమలుకు నోచుకోలేదు. రైతురుణమాఫీ కూడా పాక్షికంగానే పూర్తయ్యింది. ప్రజల్లో అంచనాలను పతాకస్థాయికి తీసుకెళ్లడం చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం. అదే ఇప్పుడు ప్రతికూల ప్రచారానికి తావిస్తోంది.

సంతృప్తస్థాయి సంక్షేమం...

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాధించిన ఘనవిజయం ఒకటుంది. పింఛన్ల వంటి సంక్షేమ పథకాల విషయంలో పెద్దగా ఫిర్యాదులు లేవు. గతంలో తక్కువ సంఖ్యలోనే ఈ పథకాలు అమలయినప్పటికీ అవినీతి రాజ్యం చేస్తుండేది. ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతుండేవి. పారదర్శకతతో పాటు నేరుగా లబ్ధిదారులకు నిధులను చేరవేయగలుగుతున్నారు. అంతేకాకుండా స్కీముల ప్రచారం సైతం టీడీపీకి కలిసిరావాలనే ఉద్దేశంతో చాలా పథకాలకు చంద్రన్న పేరు పెట్టేసుకున్నారు. పాలనపగ్గాలు మారితే స్కీములు కొనసాగినా పేరు మారిపోయే అవకాశం ఉంది. గతంలో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన విగ్రహాలను నిర్మించుకుని విమర్శలు ఎదుర్కొన్నారు. బాబు పథకాలను తన పేరుతో రూపకల్పన చేసుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనం రూపంలో నేరుగా తన ఖాతాలోనే క్రెడిట్ జమకావాలనే ఉద్దేశమిది. ఎన్టీయార్ వంటి వ్యక్తి పేరిట ఎన్ని పథకాలు ఉన్నప్పటికీ అదో సంతృప్తి. కానీ కొందరు పార్టీ నేతలే చంద్రబాబుకు ప్రచార యావ కల్పించి పథకాలకు స్వీయనామకరణం చేయించారు. ఇది కొంచెం ఎబ్బెట్టు వ్యవహారమే. ప్రకృతి విపత్తులు, ప్రమాద సంఘటనలపై ప్రభుత్వం చాలా వేగంగా స్పందిస్తోంది. బాధితులకు నష్టపరిహారం కూడా వెంటనే అందేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వంపై పాజిటివ్ ఇమేజ్ నెలకొనేందుకు ఈ చర్యలు దోహదం చేస్తున్నాయి.

రాజకీయాలకే పెద్దపీట...

1995 నుంచి 2004 వరకూ గతంలో చంద్రబాబు పాలన సాగింది. అప్పటికి ఇప్పటికి ఒకటే ప్రధాన తేడా. పాలనకు పెద్ద పీట వేసే సంస్కరణల సారథిగా, హైటెక్ ముఖ్యమంత్రిగా అప్పట్లో పేరు తెచ్చుకున్నారు. తనను తాను సీఈఓ గా అభివర్ణించుకున్నారు. ఇప్పుడు రాజకీయాలదే ఫస్టు ప్రయారిటీ. పథకం, ప్రకటన, పరిపాలన..అంశం ఏదైనా రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ముందుగా పెద్ద విభేదాలు లేవు. కానీ ఎన్నికల గడువు దగ్గర కొచ్చేసరికి దూరం పెరిగింది. బీజేపీని పక్కనపెట్టి స్పెషల్ స్టేటస్ అంశాన్ని పొలిటికల్ టూల్ గా బయటికి తీశారు చంద్రబాబు. ప్రతి నిర్ణయంలోనూ ఓట్ల లెక్కలకే పెద్దపీట. సంస్కరణలను పక్కనపెట్టేసి సంక్షేమం పేరిట నిధులను పప్పుబెల్లాలుగా పంచిపెడుతున్నారు. విపరీతంగా అప్పులు దూసి తెస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్ట గలిగితే చాలు ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారినా పర్వాలేదనే ఉదాసీన ధోరణి నెలకొంది. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరం. రానున్న ప్రభుత్వాలపైన, వచ్చే తరాలపైన భారం పడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న తెలంగాణతో పోల్చుకుంటూ ఉద్యోగుల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ దూకుడు చూపుతున్నారు. దీంతో కోలుకోలేని స్థితికి ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది. అయినప్పటికీ ఇది ఎన్నికల ఏడాది కావడంతో ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశాల్లేవు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News