బాబుకు అదృష్టం అలా కలసివచ్చిందేమో....!

Update: 2018-09-15 15:30 GMT

చంద్రబాబు నాయుడు అదృష్టవంతుడు. తన రాజకీయ చాణక్యానికి పరిస్థితులు కూడా కలిసి వస్తుంటాయి. రాష్ట్రవిభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడంలో అనేక అంశాలు కలిసి వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ వ్యతిరేక అజెండాను పైకి తీశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వర్సెస్ కేంద్రం అన్న వాతావరణం సృష్టించారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెసు పార్టీతో కలిసి నడవడం ఎలా? అన్న తర్జనభర్జన పడుతున్నస్థితిలో మహారాష్ట్రలోని కోర్టు కేసు అయాచిత వరంగా లభించింది. హస్తంతో చేయి కలిపేందుకు అడ్డు తొలగిపోయింది. తెలుగుదేశం పార్టీపై పాత కేసు పాలు పోసింది. ఎలా ముందుకెళ్లాలన్న విషయంలో న్యాయస్థానమే దిక్సూచిగా మార్గం చూపింది. గత కొంతకాలంగా తెలంగాణలో అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిన టీడీపీకి కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఊపిరి పోసిన వారెంట్...

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సంధి యుగంలో ఉంది. ఎటు పోవాలో తెలియని కూడలిలో నిలుచుంది. కాంగ్రెసుతో కలిసి వెళ్లక తప్పని అనివార్యత. ఆంధ్రాపార్టీకి ఇక్కడ స్థానమేమిటంటూ టీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. దానికి బదులివ్వడం కష్టమే అవుతోంది. తెలుగుదేశం తెలంగాణలో ఉండటం చారిత్రక అవసరమంటూ చంద్రబాబు నాయుడు నినదిస్తున్నారు. నిజంగా అంతటి అవసరం ఉందా? అంటే ఇంతవరకూ జవాబు చెప్పలేకపోయారు. బాబ్లీ వివాదం పైకి రావడంతో టీడీపీ ఒక్కసారిగా నైతిక స్థైర్యాన్ని నింపుకుంది. 2010లో సంక్షోభ సమయంలో చంద్రబాబు నాయుడు బాబ్లీని అడ్డుకునే క్రమంలో భాగంగా మహారాష్ట్రలో ప్రవేశించి ఉద్యమం చేశారు. బాబ్లీ పూర్తయితే ఉత్తర తెలంగాణకు నీళ్లు దొరకవనే అంశం ప్రాతిపదికగా ఆందోళన చేశారు. అప్పట్లో ఈ విషయాన్ని టీఆర్ఎస్ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఈ ఉద్యమం తెలుగుదేశం పార్టీకే పరిమితమైంది. ఆ క్రెడిట్ కూడా ఆపార్టీకే దక్కింది. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం ఎందుకు అవసరమనే విషయాన్ని చెప్పడానికి ఈ వారెంట్ ను ప్రాతిపదికగా చేసుకోబోతున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం చేసిన ఘనత టీడీపీకి దక్కిందని చెప్పడానికి ఆస్కారం ఏర్పడింది.

తెలంగాణలో రూట్ క్లియర్...

తెలుగుదేశానికి బీజేపీ బంగారు బాతులా మారింది. ఏ అంశంతోనైనా కమలం పార్టీని ముడిపెట్టి కక్ష సాధింపు అంటూ యాగీ చేస్తున్నారు. దీనివల్ల ఓటు బ్యాంకు నిర్మించుకోవచ్చనే అంచనాలో ఉంది తెలుగుదేశం పార్టీ. అటు ఆంధ్రప్రదేశ్ లో ఇదే అజెండాతో కొంత మైలేజీ సాధించింది. ఇప్పుడు తాజాగా కోర్టు కేసు వివాదంలోనూ బీజేపీకి చుట్టేయాలని చూస్తోంది. మహారాష్ట్రలో కమలం పార్టీ అధికారంలో ఉండటమూ టీడీపీకి కలిసొచ్చింది. కక్ష సాధింపు తో ఈ నోటీసులు ఇప్పించారని ఆరోపిస్తున్నారు. బీజేపీతో టీఆర్ఎస్ దోస్తీపై ఇప్పటికే ప్రచారం మొదలైంది. తాజా వివాదాన్ని ఈ రెండు పార్టీలకు అంటగట్టగలిగితే చాలు తెలంగాణలో టీడీపీ కాలూనినట్టే . తెలంగాణ ప్రయోజనాలకోసం పాటుపడిన టీడీపీ అధినేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది యోచన. దీనివల్ల టీఆర్ఎస్ సైతం రాజకీయంగా ఇరకాటంలో పడుతుంది. బీజేపీ, టీఆర్ఎస్ లను దోషులుగా నిలబెట్టి కాంగ్రెసుతో చేతులు కలిపేయొచ్చనేది అంచనా. కేంద్రం, మహారాష్ట్ర,తెలంగాణ.. మూడు చోట్లా కాంగ్రెసు అధికారంలో లేకపోవడం ఇక్కడ కలిసొచ్చే అంశం.

బాబ్లీ..గుగ్లీ...

నిజానికి చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేయడం యాదృచ్చికంగా జరిగిన తంతు. సాంకేతికంగా ఎవరికైనా అదే జరుగుతుంది. గతంలో 22 సార్లు న్యాయస్థానానికి హాజరుకమ్మని చంద్రబాబు నాయుడికి నోటీసులు అందించారు. కానీ స్పందించలేదు. దాంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. ఇందులో పెద్దగా రాజకీయ కోణాలు కనిపించవు. కానీ సమయం కలిసి రావడంతో టీడీపీ రాజకీయం చేస్తూ వచ్చే ఎన్నికలకు దీనిని ముడిపెడుతోంది. ప్రధానంగా తెలంగాణలో ఇదొక అడ్వాంటేజ్ గా మారుతుందని భావిస్తున్నారు. కోర్టుకు హాజరైతే దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అరెస్టుకు సైతం సిద్ధమైతే పూర్తి ఫలితం లభిస్తుందనుకుంటున్నారు. కోర్టుకు స్వచ్ఛందంగా హాజరు కాకపోతే చంద్రబాబును అరెస్టు చేస్తారు. అదే జరిగితే తెలంగాణలో ఎన్నికలకు పార్టీకి ప్రధాన ప్రాతిపదిక లభిస్తుంది. ఆ ఉద్దేశంతో ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని తెలుగుదేశం యోచిస్తోంది. ఏం చేసినా రాజకీయంగా మైలేజీ రావడమే లక్ష్యంగా ముందుకు కదలబోతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News