బాబు స్టైల్ ఓదార్పు…

తెలుగుదేశం అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టైల్ మార్చారు. అందరినీ అక్కున చేర్చుకుంటున్నారు. ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఓదారుస్తున్నారు. పదే పదే ఒకే మాట వల్లె వేస్తున్నారు. [more]

Update: 2019-02-04 16:30 GMT

తెలుగుదేశం అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టైల్ మార్చారు. అందరినీ అక్కున చేర్చుకుంటున్నారు. ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఓదారుస్తున్నారు. పదే పదే ఒకే మాట వల్లె వేస్తున్నారు. ప్రజలందరినీ ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ ఓదార్పు యాత్రలను తలపింపచేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రల్లో ఒక ట్రేడ్ మార్కు స్రుష్టించారు. దగ్గరికి తీసుకుని తల నిమిరి నుదిటిపై ముద్దు పెట్టడం ఆయన ప్రత్యేకత. దీనివల్ల ఆత్మీయత, ప్రజలతో మమైకమైపోతున్నారన్న భావన, సింప్లిసిటీ తేటతెల్లమవుతాయి. ఎవరెంతగా ఎగతాళి చేసినా జగన్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. ఈరకమైన సంకేతాలతో ప్రజాక్షేత్రంలో తన శైలిని స్థిరపరుచుకోగలిగారు. చంద్రబాబు నాయుడు సైతం ఇటీవల ఆ రకమైన ఒక ప్రత్యేక ముద్ర కోసం యత్నిస్తున్నారు. ముఖ్యంగా వ్రుద్ధులు, పిల్లల విషయంలో ఒక స్పెషల్ ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నారు.

ఇమేజ్ మేకోవర్…

చంద్రబాబు నాయుడు సీరియస్ పొలిటీషియన్. చెప్పాలనుకున్న విషయాన్ని గంటల తరబడి చెబుతారు. ఆకట్టుకునే విధంగా చెప్పడానికి బదులు అదే విషయాన్ని పదే పదే నూరిపోయడానికే ఆయన ప్రాధాన్యత. సూటిగా చెప్పాలని, సుదీర్ఘంగా చెప్పాలని ప్రయత్నిస్తారు. అది ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం కావచ్చు. కార్యకర్తలకు ఉద్బోధ కావచ్చు. నాయకులకు చేసే సూచన కావచ్చు. ఏదైనా హెచ్చరించినట్లే ఉంటుంది. దీనివల్ల ప్రజల్లొ మంచి ముద్ర పడటం లేదని తాజాగా ఇమేజ్ మేకోవర్ కోసం లోకేశ్ కొందరు కన్సల్టెంట్లను సంప్రతిస్తే తెలియవచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో చంద్రబాబు ఇమేజ్ ను కొత్త పుంతలు తొక్కించాలనే కసరత్తు మొదలైంది. రాష్ట్రంలో జరుగుతున్న పనులకు సంబంధించి ప్రజలకు సమాచారం విషయంలో లోపం లేదు. వారికి ఏదో రూపేణా ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పథకాలు,ప్రభుత్వ పనితీరుపై సమగ్ర అవగాహన ఉంటోంది. దానిగురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆ పథకాలకు సంబంధించిన లబ్ధి తమకు ఓట్ల రూపంలో కురియాలంటే అధినాయకత్వం కొంత వ్యూహాత్మక పంథాని అనుసరించాలని కన్సల్టెన్సీ సంస్థలు సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై టీడీపీలో లోకేశ్, చంద్రబాబు , మరికొందరు సన్నిహితులు ఒక విధానాన్ని రూపొందించారు. అధినేతకు పబ్లిక్ లో ఒక సానుకూలత స్రుష్టించే వాతావరణం ఏర్పడేలా ప్రణాళికను ఆచరణలోకి తెస్తున్నారు.

జగన్ శైలి సక్సెస్...

ఓదార్పు యాత్రలోనూ, పాదయాత్రలోనూ జగన్ శైలిపై అనేక సెటైర్లు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కనిపిస్తుంటాయి. ఎవరేమి అనుకున్నా తనదైన ముద్ర వేసుకోగలిగారు. ప్రజలను దగ్గరికి తీసుకొనే వైఖరి, ధోరణి అనేది సక్సెస్ అయ్యింది. ప్రత్యేకించి వ్రుద్ధులు, పిల్లల విషయంలో ఆయన అనుబంధాన్ని పెనవేసుకుంటున్నట్లుగా ప్రజలలో గుర్తింపు తెచ్చుకోగలిగారు. చంద్రబాబు నాయుడు సైతం ఈ విధానం ద్వారా తన శైలిలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు. వ్రుద్ధులను దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకోవడం, వారికి పాదాబివందనాలు చేయడం వంటి వాటిని తరచూ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొందరిని ఎంపిక చేసి మరీ వేదికల మీదకు రప్పిస్తున్నారు. పింఛన్లతో తమ జీవితం బాగు పడిపోయిందని, తమను పట్టించుకోని పిల్లల లోటు తీర్చేశారన్న విధంగా ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసే ఏర్పాట్లను టీడీపీ చేపట్టింది. చంద్రబాబే తమ పెద్ద కొడుకు అని వ్రుద్ధులు వేదికలపైనే కన్నీళ్లు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మరోవైపు రాజధానికి ఏ చిన్న విరాళమిచ్చినా చంద్రబాబు వారికి పాదాభివందనం చేస్తున్న ద్రుశ్యాలనూ బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో సెంటిమెంటును, చంద్రబాబు ఇమేజ్ లో మార్పును కలగలిపి ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చనుకుంటున్నారు. ఇప్పటికే ఈ మేరకు ఏర్పాట్లు సాగిపోయాయి.

మళ్లీ మీరే రావాలి…

రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున అతిపెద్ద ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. గడచిన ఆరు నెలలుగా తెలుగు టీవీ చానళ్లను పోషించడంలో ఏపీ ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరిస్తోంది. ప్రతి చానల్ కూ రేటింగుతో నిమిత్తం లేకుండా ర్యాంకింగులను అనుసరించి ప్రతి నెలా 25 నుంచి 50 లక్షల రూపాయల వరకూ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. పత్రికలకు కోట్ల రూపాయల్లోనే ఈ మొత్తం ముడుతోంది. వివిద శాఖల నుంచి సమీకరించి మరీ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఈ ప్రచార వ్యయం రెండు వందల కోట్ల రూపాయల పైచిలుకు ఉందని అనధికార సమాచారం. మళ్లీ మీరే రావాలంటూ ప్రజలు కోరుకుంటున్నట్లుగా బలమైన భావాన్ని వ్యాపింపచేయడమే ఈ ప్రచార లక్ష్యం. న్యూట్రల్ ఓటర్లు, స్వింగ్ ఓటర్లు ఇంకా అనిశ్చిత స్థితిలో ఉన్నారు. వారిని టీడీపీ వైపు మళ్లించాలనే ధ్యేయంతో ప్రకటనలను గుప్పిస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ ప్రభుత్వ ప్రకటనలు చాలావరకూ నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ఆ కొరతను పూరిస్తోంది. అందులోనూ పొరుగు రాష్ట్రం పోటీ లేకపోవడంతో తెలుగు చానళ్లన్నీ ఏపీ ప్రచారంలో తలమునకలైపోతున్నాయి. ఏతావాతా టీడీపీకి అదనపు ప్రయోజనం కలిగించే దిశలో సాగుతున్న ప్రచారం ఎంతమేరకు సక్సెస్ అవుతుందనే విషయంలో కొన్ని సందేహాలున్నాయి. అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా తన శైలిలో మార్పులు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని బావిస్తుంటే ప్రభుత్వ ప్రచారంలో మాత్రం మూస ధోరణి విసుగు పుట్టిస్తోంది. ప్రభుత్వ ప్రచార యంత్రాంగాన్ని సరిదిద్దుకోకుండా ఎన్ని ప్రయోగాలు చేస్తే ఏమిటి ప్రయోజనమంటూ టీడీపీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.

Tags:    

Similar News