నంద్యాలలో సీన్ మారిందా..?

కర్నూలు జిల్లాలో ఈసారైనా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధించాలని తెలుగుదేశం పార్టీ భావించింది. ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నించింది. చేరికలను ప్రోత్సహించి [more]

Update: 2019-04-20 00:30 GMT

కర్నూలు జిల్లాలో ఈసారైనా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధించాలని తెలుగుదేశం పార్టీ భావించింది. ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నించింది. చేరికలను ప్రోత్సహించి జిల్లాలో బలపడింది. ఈసారి ఆ పార్టీ జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ సీటుపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఈ స్థానాన్ని కచ్చితంగా దక్కించుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే, ఎన్నికల పోలింగ్ తర్వాత నంద్యాలలో గెలుపు అంత సులువు కాదనే అంచనాలు ఏర్పడ్డాయి. పోలింగ్ సరళిని చూస్తే తెలుగుదేశం – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నడుమ హోరాహోరీ పోరు సాగింది. ఇక జనసేన కూడా ఇక్కడ భారీగా ఓట్లు సాధించే అవకాశం ఉంది.

ఉప ఎన్నిక పరిస్థితి లేదు..!

గత ఎన్నికల్లో నంద్యాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డిపై వైసీపీ నుంచి పోటీ చేసిన భూమా నాగిరెడ్డి 3,604 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత ఆయన టీడీపీలో చేరిపోయారు. నాగిరెడ్డి మరణంతో వచ్చిన ఉపఎన్నికలో నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేశారు. టీడీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి వచ్చి ఉప ఎన్నికలో పోటీ చేశారు. రెండు పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలో వైసీపీపై టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఏకంగా 30 వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి బరిలో ఉండగా వైసీపీ నుంచి శిల్పామోహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేశారు. ఇద్దరూ యువకుల మధ్య పోటీ జరిగింది.

జనసేన ఎవరికి నష్టం చేస్తోందో..?

నంద్యాల నియోజకవర్గంలో భూమా, శిల్పా కుటుంబాలకు మంచి పట్టు ఉంది. వరుసగా రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి శిల్పా కుటుంబంపై బాగా ఉంది. తన స్వంత నిధులతో నియోజకవర్గంలో శిల్పా చేసిన సేవా కార్యక్రమాలు, చాలా రోజులుగా ప్రజల్లో ఉండటం వైసీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డికి కలిసివచ్చినట్లు కనిపిస్తోంది. ముస్లింలు గెలుపోటములను ప్రభావితం చేసే ఈ నియోజకవర్గంలో వారి ఓట్లు ఈసారి చీలినట్లు కనిపిస్తోంది. సిట్టింగ్ గా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డికి మంత్రి ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డి అదనపు బలంగా కనిపించారు. నియోజకవర్గంలో పట్టున్న వీరిద్దరూ భూమా తరపున ప్రచారం చేశారు. అయితే, ఉప ఎన్నిక సమయంలో హామీ ఇచ్చిన కొన్ని పనులు జరగకపోవడం టీడీపీకి కొంత మైనస్ అయ్యింది. ఉప ఎన్నికలో భూమాకు అవకాశం ఇచ్చినందున ఈసారి శిల్పాకు అవకాశం ఇద్దామనే భావన కూడా ప్రజల్లో కనిపించింది. ఇక, జనసేన నుంచి పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి కూడా బాగా ప్రచారం చేశారు. ఆయన భారీగా ఓట్లు సాధించే అవకాశం ఉంది. అయితే, ఆయన ఎవరి ఓట్లు చీల్చారనే దానిపై గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. మొత్తానికి టీడీపీ, వైసీపీలో ఏ పార్టీ గెలిచినా స్వల్ప మెజారిటీ మాత్రం వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News