వైసీపీ ఎంపీల్లో ఆయ‌న‌కే అత్తెస‌రు మార్కులా…?

రాష్ట్రంలో గ‌తంలో ఏ పార్టీకీ ల‌భించ‌న‌న్ని ఎంపీ స్థానాలు గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీకి ల‌భించాయి. మాకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వండి మీ ఆకాంక్షలు మేం [more]

Update: 2020-06-29 15:30 GMT

రాష్ట్రంలో గ‌తంలో ఏ పార్టీకీ ల‌భించ‌న‌న్ని ఎంపీ స్థానాలు గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీకి ల‌భించాయి. మాకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వండి మీ ఆకాంక్షలు మేం తీరుస్తాం! ఏపీకి ప్రత్యేక హోదా దానంత‌ట అదే వ‌స్తుంది అన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ పిలుపు మేర కు ప్రజ‌లు అలా ప‌ట్టంక‌ట్టారా? లేక‌.. జ‌గ‌న్‌పై న‌మ్మకంతో ఇచ్చారా? ఇవన్నీ ప‌క్కన పెడితే.. టీడీపీపై న‌మ్మకం లేక గుండుగుత్తుగా వైసీపీకి గుద్దేశారా? అనే విష‌యాల‌ను ప‌క్కన పెడితే.. మొత్తం 25 ఎంపీ స్థానాల్లో 22 స్థానాలు వైసీపీకి ద‌క్కాయి. వైసీపీ ఓడిపోయిన మూడు స్థానాలు కూడా అతి త‌క్కువ మార్జిన్‌తో పోయిన‌వే. అయితే, ఇప్పుడు ఏడాది పూర్తయింది. రాష్ట్ర స‌మ‌స్యలు ప‌క్కన పెడితే.. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఆయా ఎంపీలు సాధించిన ప్రగ‌తి ఏంటి? అనే విష‌యాల‌ను చ‌ర్చిద్దాం.

నాలుగు సీట్లలో ఓడినా…..

వైసీపీలో జ‌గ‌న్ అత్యంత ఇష్టంగా ఒక సాధార‌ణ వ్యక్తిని తీసుకువ‌చ్చి.. ఎంపీ వంటి కీల‌క టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఆయ‌నే బాప‌ట్ల నియోజ‌క‌వర్గం నుంచి ఎంపీగా విజ‌యం సాధించిన నందిగం సురేష్‌. గ‌తంలో ఆయ‌న వైసీపీకి అభిమానే అయినా.. ఈ రేంజ్‌లో ఎంపీ సీటు ద‌క్కుతుంద‌ని ఆయ‌న క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. అతి సాధార‌ణ కార్యక‌ర్త అయిన సురేష్ రాజ‌ధాని భూముల పోరాటంలో పాల్గొని అప్పట్లో పోలీసుల నుంచి, అధికార పార్టీ నేత‌ల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే గ‌త యేడాది ఎన్నిక‌ల టైంలో బాప‌ట్ల నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాని ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ సురేష్‌కు సీటు ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో సురేష్ పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో నాలుగు ఎమ్మెల్యే సీట్లలో వైసీపీ ఓడిపోయినా కూడా గెలిచారు.

పార్లమెంటు సమావేశాల్లోనూ….

మ‌రి ఈనేప‌థ్యంలో జ‌గ‌న్ క‌ల‌ల‌ను కానీ, నియోజ‌క‌వ‌ర్గంలో ప్రజ‌ల ఆకాంక్షల‌ను కానీ, ఆయ‌న నెర‌వేర్చారా? అంటే.. లేద‌నే అంటున్నారు స్వయంగా వైసీపీ నాయ‌కులు. తాజాగా పార్లమెంటు ఎన్నికలకు ఏడాది పూర్తి అయిన సంద‌ర్భంగా ఎంపీ పెర‌ఫార్మెన్స్ నివేదిక‌ను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ఎంపీ నందిగం సురేష్ అట్టర్ ఫ్లాప్ పెర్ఫార్మెన్స్‌ను ప్రద‌ర్శించారు. పార్లమెంటుకు హాజరు లోను, పార్లమెంటులో నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన స‌మ‌స్యల‌పై చ‌ర్చించ‌డంలోను, ప్రశ్నలు సంధించ‌డంలోనూ కూడా ఆయ‌న వెనుక‌బ‌డ్డారు. నిజానికి బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గం రెండు జిల్లాల ప‌రిధిలో ఉంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాలు బాప‌ట్ల ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలోకి వ‌స్తాయి.

సమస్యలు చాలానే ఉన్నా…..

ఇక్కడ స‌మ‌స్యలు చాలానే ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని వేమూరు, రేప‌ల్లె, ప్రకాశం జిల్లాలోని చీరాల‌, అద్దంకి, సంత‌నూత‌ల‌పాడు నియోజ‌క‌వ‌ర్గాలు వెన‌క‌బ‌డిన ప్రాంతాలు. ఇక్కడ స‌మ‌స్యలు కోకొల్లలు. ఈ ప్రాంతం ఇటు ప్రకాశం బ్యారేజ్ కాలువ‌ల‌కు, అటు నాగార్జున సాగ‌ర్ కాలువ‌ల‌కు చివ‌రి ఆయ‌క‌ట్టు ప్రాంతం. నీరు లేక పంట‌లు పండ‌క రైతులు ప‌డుతోన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఎంపీగా నందిగం సురేష్ ఆయా స‌మ‌స్యల‌పై దృష్టి పెట్టలేదు. ఏడాది కాలంగా ఆయ‌న చేసింది కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించ‌డం, త‌న వ్యాపారాన్ని అభివృద్ది చేసుకోవ‌డం లేదా పార్టీ త‌ర‌ఫున నాలుగు వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌డంతోనే స‌రిపెట్టారు.

ఎమ్మెల్యేలతో పొసగని పరిస్థితి…..

ఇక ఆయ‌నకు తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవితోనూ పొస‌గ‌ని ప‌రిస్థితి. చీరాల‌, అద్దంకి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆయ‌న‌కు స్థానిక వైసీపీ నేత‌ల‌తో స‌ఖ్యత లేదు. చిత్రంగా గుంటూరు జిల్లాకు చెందిన గుంటూరు నియోజ‌క‌వ‌ర్గం ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ అన్ని విష‌యాల్లోనూ ముందుండ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న ఏనాడు ప్రజ‌ల్లో ఉండ‌ర‌న్న టాక్ ఉంది. మ‌‌రి నందిగం ప‌రిస్థితి ఇలా ఉంటే.. వ‌చ్చే ద‌ఫా గెలిచేనా? అనే సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి. మ‌రి జ‌గ‌న్ ఎలాంటి చ‌ర్యలు తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News