నందిగంతో నానా అగచాట్లు

రాజ‌కీయాల్లో నాయ‌కులు వేసే చిందులు భ‌లే గ‌మ్మత్తుగా ఉంటాయి. ఆధిప‌త్య రాజ‌కీయాల కోసం ఉవ్విళ్లూరే నాయ‌కుల వ‌ర‌స ఇక‌, చెప్పాల్సిన ప‌నికూడా లేదు. ఇప్పుడు ఇలాంటి గ‌మ్మత్తు [more]

Update: 2019-11-12 00:30 GMT

రాజ‌కీయాల్లో నాయ‌కులు వేసే చిందులు భ‌లే గ‌మ్మత్తుగా ఉంటాయి. ఆధిప‌త్య రాజ‌కీయాల కోసం ఉవ్విళ్లూరే నాయ‌కుల వ‌ర‌స ఇక‌, చెప్పాల్సిన ప‌నికూడా లేదు. ఇప్పుడు ఇలాంటి గ‌మ్మత్తు రాజ‌కీయాలు చేస్తున్నారు వైసీపీకి చెందిన కీల‌క ఎంపీ నందిగం సురేష్‌. ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న ఎవ‌రో కూడా పెద్దగా ఎవ‌రికీ తెలియ‌దు. ఆయ‌న చెప్పుకొన్నట్టే.. రోడ్డు ప‌క్కన పండ్లు అమ్ముకునేవాడ‌ట‌..! అలాంటి వ్యక్తి వైసీపీ కార్యక‌ర్తగా మారారు. జెండాను భుజాన మోశారు. ఈ క్రమంలో నే జ‌గ‌న్ చేసిన ప్రజాసంక‌ల్ప యాత్రలో కూడా త‌న‌దైన శైలిలో పాల్గొని ఆయ‌న కంట్లో ప‌డ్డారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా బాపట్ల ఎంపీ టికెట్‌ను ద‌క్కించుకుని నందిగం సురేష్‌ విజ‌యం కూడా సాధించారు.

ఆధిపత్య రాజకీయాలతో….

తాను ఏ రాజ‌ధాని ప్రాంతంలో కూలి ప‌ని చేసుకున్నానో ఇప్పుడే అదే జిల్లాకు ఎమ్మెల్యేగా ఉన్నాన‌ని నందిగం సురేష్‌ చెప్పుకుంటుంటారు. గ‌తంలో కొమ్ములు తిరిగిన నాయ‌కులు పోటీ చేసి ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి రాజ‌కీయ బ్యాక్‌గ్రౌండ్ లేని నందిగం సురేష్‌ విజ‌యం సాధించ‌డంతో వైసీపీలో సంబ‌రాలు చేసుకున్నారు. అయితే, ఇప్పుడు నందిగం సురేష్‌ చేస్తున్న ఆధిప‌త్య రాజ‌కీయాలను చూస్తున్న ఈపార్టీ నాయ‌కులే ముక్కున వేలేసుకుంటున్నారు. నందిగం సురేష్ గెలిచింది బాప‌ట్లే అయినా.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం మాత్రం తాడికొండ‌. ఇది గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ప‌రిధిలోకి వ‌స్తుంది. బాప‌ట్ల నియొజ‌క‌వ‌ర్గంతో తాడికొండ‌కు ఎలాంటి సంబంధం ఉండ‌దు. అయినా కూడా.. నందిగం సురేష్‌ త‌ను పుట్టి పెరిగిన నియొజ‌క‌వ‌ర్గం కావ‌డంతో తాడికొండ‌పై క‌న్నేశారు. ఇక్కడ ఆధిప‌త్యం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

గిట్టని వారిని అనుకూలంగా….

తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. ఇక్కడ నుంచి డాక్ట‌ర్ ఉండ‌వ‌ల్లి శ్రీదేవి విజ‌యం సాధించారు. ఈమె హైద‌రాబాద్‌లో పేరున్న డాక్టర్‌. అయితే, వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం నేప‌థ్యంలో ఆమెకు జ‌గ‌న్ ఇక్కడ టికెట్ ఇచ్చారు. ఇక‌, ఆరు మాసాలకు ముందుగానే పార్టీలోకి వ‌చ్చినప్పటికీ శ్రమించి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇదిలావుంటే, బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్‌ ఇక్కడ కార్యక్రమాల్లో వేలు పెట్టడం ప్రారంభించారు. ఇసుక దందాచేసే వారిని ప్రోత్సహిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అదేవిధంగా ఇత‌ర కార్యక్రమాల్లోనూ ఆయ‌నే ముందుంటున్నార‌ని, శ్రీదేవి సెకండ్ అయిపోయార‌ని తెలుస్తోంది. పైగా శ్రీదేవికి గిట్టని వారిని త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ఆమెపై ఆధిప‌త్యం చేయాల‌ని నందిగం సురేష్‌ చూస్తున్నారు.

నాన్ లోకల్ కావడంతో….

శ్రీదేవి ఇప్పటికే తాడికొండ మండ‌ల పార్టీ అధ్యక్షుడిని మార్చాల‌ని నేరుగా విజ‌య‌సాయిరెడ్డి ద‌గ్గరే ఫిర్యాదు చేశారు. ఇలాంటి అసంతృప్త నేత‌ల‌ను ఇప్పుడు నందిగం సురేష్‌ ఎంక‌రేజ్ చేస్తున్నారు. శ్రీదేవి నాన్‌లోక‌ల్ కావ‌డంతో ఆమె ఎప్పటికైనా హైద‌రాబాద్ వెళ్లిపోతుంది కాబ‌ట్టి.. తనే ఇక్కడ చ‌క్రం తిప్పాల‌నే వ్యూహంతో నందిగం సురేష్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య తీవ్ర పోరు సాగుతోంది. దీనిపై ఇప్పటికే శ్రీదేవి బ‌హిరంగ విమ‌ర్శలు కూడా చేస్తున్నారు.

అన్నీ వివాదాలే….

ఇసుక రీచ్‌లు, క్రష‌ర్ల గొడ‌వ‌లు… చివ‌ర‌కు ఫ్లెక్సీల వివాదం… వ‌ర్గ పోరు ఇలా చెప్పుకుంటూ పోతే తాడికొండ ఎంపీ నందిగం సురేష్‌ వ‌ర్సెస్ ఎమ్మెల్యే శ్రీదేవి వ‌ర్గాల రాజ‌కీయం హాట్ హాట్‌గానే ఉంది. ఈ విష‌యాన్ని శ్రీదేవి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి శ్రీరంగ‌నాథ‌రాజు దృష్టికి కూడా ఆమె తీసుకు వెళ్లిన‌ట్టు స‌మాచారం. అదేవిధంగా సీఎం జ‌గ‌న్ దృష్టికి కూడాతీసుకు వెళ్లాల‌ని చూస్తున్నారు. మొత్తంగా ఎంపీగా ఉన్న నందిగం సురేష్‌ రెండు జిల్లాల‌తో అనుసంధాన‌మైన త‌న నియోజ‌క‌వ‌ర్గంలో బాగోగుల‌ను మానేసి.. ఇలా త‌న‌కు సంబంధం లేని నియోజ‌క‌వ‌ర్గంలో ఆధిప‌త్యం చ‌లాయించేందుకు ప్రయ‌త్నించ‌డం వివాదంగా మారుతోంది. మ‌రి జ‌గ‌న్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News