బావయ్య తగ్గుతున్న వేళ బాలయ్య హెచ్చుతున్నారు ?

నందమూరి వంశమే ఒక బ్రాండ్. అది సినిమా అయినా రాజకీయమైనా కూడా ఆ వంశానికి ఉన్న పొగరు, పవరూ వేరు. వాటిని మరొకరితో అసలు పోల్చలేము. ఇక [more]

Update: 2020-06-11 13:30 GMT

నందమూరి వంశమే ఒక బ్రాండ్. అది సినిమా అయినా రాజకీయమైనా కూడా ఆ వంశానికి ఉన్న పొగరు, పవరూ వేరు. వాటిని మరొకరితో అసలు పోల్చలేము. ఇక ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పుకున్నా తక్కువ చేసినా కూడా బాలకృష్ణ బలం ఎన్టీయార్. ఆయన తెలుగు దిగ్గజం అన్నగారి ముద్దుల తనయుడు. అది ఒక్కటి చాలు బాలకృష్ణ ఎంత దూరం అయినా వెళ్లడానికి. అయితే కేరాఫ్ రామారావు గా మాత్రమే బాలయ్య లేరు. ఆయన కూడా తనకంటూ సొంతంగా ఇమేజ్ సాధించారు. నటుడిగా ఎన్నో హిట్స్ కొట్టి టాలీవుడ్ లో సూపర్ స్టార్ డం ని సాధించారు. ఎన్టీయార్ వారసత్వాన్ని నాలుగు దశాబ్దాల పాటు నిలపడం అంటే మాటలు కాదు. పైగా వందకు పైగా సినిమాల్లో నటించి అచ్చం తండ్రికి తగిన తనయుడిగా నవరసాలు పలికించడంలోనూ బాలకృష్ణ మంచి మార్కులే సంపాదించారు.

రాజకీయంగా…..

మరో వైపు ఎన్టీయార్ ప్రస్తావన కేవలం సినిమాలకే పరిమితం కాదు, ఆయన్ని రాజకీయ మేరు పర్వతంగా కూడా చూస్తారు. ఆయన రాజకీయాల్లో ఉన్నది పట్టుమని పద్నాలుగేళ్ళు. ఇది నిజానికి చాలా తక్కువ సమయం. కానీ అక్కడ ఉన్నది ఎన్టీయార్ అందువల్ల ఆయన ఈ తక్కువ సమయంలో ఎవరూ చేయని ఎన్నో అద్భుతాలను ఉమ్మడి ఏపీలోనూ, జాతీయ స్థాయిలోనూ చేసి చూపించారు. అపుడెపుడో జయప్రకాష్ నారాయణ్ చేసిన జనతా ప్రయోగం తరువాత నేషనల్ ఫ్రంట్ పేరిట అన్న గారు చేసిన ప్రయోగమే గొప్పది. అలా జాతీయ నాయకుడు అనిపించుకున్న అన్న గారు కుమారుడిగా బాలకృష్ణ ఇంకా జూనియర్ గానే పొలిటికల్ తెర మీద ఉన్నాడు. అయితే దీనికి కారణాలు కూడా ఉన్నాయి. బావ చాటు మరిదిగా, మరో వైపు ఫుల్ టైం సినీ నటుడిగా బాలయ్యకు రాజకీయంగా పరిమిత పాత్ర అని అంతా సర్దుకుంటారు కూడా.

అలా ఇలా లేదుగా…?

ఇపుడు బాలకృష్ణ కూడా పేరు వరకే తప్పవయసు వైపుగా చూస్తే సీనియర్ సిటిజన్ అయిపోతున్నాడు. అరవయ్యేళ్ళు అంటే చిన్న విషయం కాదు. అయినా సినిమా నటుడుగా గ్లామర్, ఆయన వ్యాయామాలు అన్నీ కలని యంగ్ లుక్ తో ఉండడమే గొప్పతనం. సరే ఇవన్నీ ఎలా ఉన్నా బాలయ్య తన షష్టి పూర్తికి చేసిన హడావుడి అలా ఇలా లేదు. బాలకృష్ణ వరసగా ఇంటర్వ్యూలు మీడియాకు ఇచ్చాడు, ఇది ఆయన సహజ స్వభావానికి విరుధ్ధం. మరో వైపు సినీ పెద్దగా నాయకత్వం కోసం మెగాస్టార్ ని సవాల్ చేస్తున్నాడు. ఇంకో వైపు నందమూరి కుటుంబం అంతా ఒక్కటేనని జూనియర్ ఎన్టీయార్ తో చేతులు కలిపాడు, మరో వైపు తండ్రి నాటి కుటుంబాన్ని అంతా తన పుట్టిన రోజు వేళ మరో మారు కలుపుతున్నాడు. ఇవన్నీ చూసిన వారికి బాలకృష్ణ హడావుడి వెనక ఏదో ఉందన్న అనుమానం రాక మానదు.

పట్టు కోసమా…?

సరిగ్గా అరవయ్యేళ్లకే ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన తొమ్మిది నెలలు తిరిగి అధికారంలోకి వచ్చి సీఎం కూడా అయిపోయారు. ఇపుడు బాలకృష్ణ కూడా అరవయ్యేళ్ళు కాబట్టి రాజకీయంగా ఇంకా ఎక్కువగా రాణించాలనుకోవడంలో తప్పులేదు. అయితే బావ చంద్రబాబు అక్కడ పగ్గాలు పట్టుకుని ఉన్నాడు. మరి తన పట్టు పెంచుకోవాలంటే నందమూరి బ్రాండ్ ఇప్పటికీ గట్టిగా ఒక్కటిగా ఉందని చెప్పడం అవసరం. అందుకే బాలకృష్ణ హడావుడి చేస్తున్నారు అన్న వారూ లేకపోలేదు. బాలయ్య తన ఇంటర్వ్యూలలో వైసీపీని గద్దె దించేది నేనే అంటున్నారు. అంటే తన వల్లనే జగన్ చేతిలో నుంచి అధికారం టీడీపీ పరం అవుతుందని చెబుతున్నారు. మరి ఏ ఆశా లేకుండా బాలకృష్ణ ఇలాంటి భారీ స్టేట్మెంట్లు ఇవ్వగలరా అన్నది కూడా చూడాలి. మరో వైపు టీడీపీలో నాయకత్వ సమస్య ఉంది. దాంతో బాలకృష్ణ సై అంటూ దూకుడుగా ముందుకు వస్తే రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారుతాయి అన్న వారూ లేకపోలేదు. మొత్తానికి షష్టిపూర్తి పెళ్ళికొడుకు గా బాలకృష్ణ చేస్తున్న కొత్త హుషార్ టీడీపీని ఏ వైపునకు తీసుకువెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News