బాలయ్యను టైం చూసి దెబ్బేశారా?

సినిమా రంగం అంతా కలిసే ఉంటామని పైకి కబుర్లు చెప్పినా అందరికి అక్కడి గ్రూప్ ల గోల తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి ఒక పక్క బాలకృష్ణ [more]

Update: 2020-06-07 00:30 GMT

సినిమా రంగం అంతా కలిసే ఉంటామని పైకి కబుర్లు చెప్పినా అందరికి అక్కడి గ్రూప్ ల గోల తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి ఒక పక్క బాలకృష్ణ మరోపక్క అన్నది లెక్క తేలింది. ఇవి కాక చిన్నా చితకా గ్రూప్ లు చాలానే ఉన్నాయి. మా అసోసియేషన్ లో రాజశేఖర్ మొదలు చాలామంది అప్పుడప్పుడు టాలీవుడ్ లుకలుకలు రోడ్డెక్కిస్తూనే వున్నారు. తాజాగా టాలీవుడ్ ను ఎప్పుడు తెరవాలి. షూటింగ్స్ ఎప్పుడు మొదలు పెట్టాలి ? ఎలా చేయాలి అనే అంశం ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కిందా మీదా పడుతున్న అంశం.

పిల్లి మెడలో గంట కట్టిన చిరంజీవి …

దీనిపై ఇప్పటికే భాగ్యనగర్ లో టాలీవుడ్ స్టూడియో లు అన్ని ఉన్నందున చిరంజీవి పిల్లి మెడలో గంట కట్టి కెసిఆర్ తో మమ అనిపించారు. ఈ వ్యవహారం లో తన పాత్ర ఏమి లేకపోవడంతోనే సహజంగానే ఆవేశపరుడు నందమూరి బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సిట్టింగ్స్ అంటూ ఆ వర్గాన్ని చులకన చేసే ప్రయత్నం చేశారు. తనను పిలవలేదని కడుపు మంట ను బాలయ్య అలా మాటల తూటాలతో పేల్చేశారు. ఆ ఎపిసోడ్ లో అంతా కిందా మీదా పడి మళ్ళీ తామంతా ఒక్కటే అంటూ ఐక్యతా రాగం పాడి టీ కప్పులో తుఫాన్ ను చల్లబరిచారు.

బాలకృష్ణ ట్విస్ట్ వెనుక …

కట్ చేస్తే ఇప్పుడు ఎపి సిఎం జగన్ తో వేసేందుకు సినీపరిశ్రమ పెద్దలు కదిలారు. ఈసారి దీనికి బాలయ్యను కూడా సి. కళ్యాణ్ వంటివారు స్వయంగా ఆహ్వానించి పెద్దరికాన్ని ఇచ్చారు. అయితే బాలకృష్ణ దీనికి ట్విస్ట్ ఇచ్చేశారు. ఈనెల 9 న జగన్ తో జరిగే భేటీకి హాజరు కావడం లేదని తేల్చేశారు. తన పుట్టిన రోజు కారణంగా పూజలు ఏర్పాటు చేసుకున్నందున రావడం లేదని ముందే చెప్పేశారు. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లోను సినీపరిశ్రమ వైపు ఆసక్తిగా చేసేవారిలో హాట్ టాపిక్ అయ్యింది.

పొమ్మనలేక పొగబెట్టారా … ?

బాలయ్యను పిలిచినట్లు ఉండాలి ఆయన రాలేని పరిస్థితి కల్పించాలనే ఆ డేట్ ను ఆయన వ్యతిరేకవర్గం సెట్ చేసినట్లు ప్రచారం మొదలైపోయింది. వాస్తవానికి ఆ డేట్ కాక మరో తేదీ అయినా బాలకృష్ణ ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు ఆసక్తి చూపేవారు కాదని అంటున్నారు కొందరు. ఇటీవలే డిజిటల్ మహానాడు లో జగన్ సర్కార్ ఇక ఎంతోకాలం సాగదంటూ కామెంట్స్ చేసిన బాలయ్య ఏ మొహం పెట్టుకుని ఆయన వద్దకు వెళతారని చెబుతున్నారు. దీనికి తోడు చిరంజీవి టాలీవుడ్ కి నాయకత్వం వహించడానికి నందమూరి బాలకృష్ణ మొదటి నుంచి అంతర్గతంగాను, బాహాటంగాను వ్యతిరేకంగా ఉన్నట్లు పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు చర్యలే చెప్పక చెప్పేశాయి. ఇప్పుడు కూడా మరోసారి అవి స్పష్టం కావడంతో టాలీవుడ్ లో సినీ జనం ఐక్యత నీటిరాత, గాలిమాటలే అంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News