బాలయ్య చరిష్మా ముగిసినట్లేనా?

తెలుగుదేశం పార్టీలో తండ్రీ కొడుకులదే రాజ్యం. అయితే చంద్రబాబు లేకపోతే లోకేష్. పార్టీ అంటే అంతే. కనీసం ఏపీ ప్రెసిడెంట్ గా ఉన్న అచ్చెన్నాయుడు కూడా కొంతవరకైనా [more]

Update: 2021-03-18 11:00 GMT

తెలుగుదేశం పార్టీలో తండ్రీ కొడుకులదే రాజ్యం. అయితే చంద్రబాబు లేకపోతే లోకేష్. పార్టీ అంటే అంతే. కనీసం ఏపీ ప్రెసిడెంట్ గా ఉన్న అచ్చెన్నాయుడు కూడా కొంతవరకైనా తన హవా చాటుకోలేరు. ఇక బాబు బావమరిది బాలకృష్ణ సంగతి వేరే చెప్పాలా. అందుకే ఆయన్ని ఆటలో అరటిపండు అంటూ చాలా సులువుగా తీసి పక్కన పడేశారు మంత్రి కొడాలి నాని. నందమూరి కుటుంబానికే వీరాభిమానిగా ఉండే కొడాలినాని బాలయ్య మీద ఇలా ఇటీవల కాలంలో ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు.

బావ చాటుగానే ….

బాలకృష్ణ సరైన సమయంలో గర్జించలేదు. నట సింహం అని వెండి తెర మీద తొడ కొట్టే బాలయ్య రాజకీయాల్లో సింహద్వారం గుండా రాలేకపోయారు. బావ చాటు బావమరిదిగానే ఉండిపోయారు. చంద్రబాబు ఎమ్మెల్యేని చేస్తే శాసనసభలో అడుగుపెట్టారు తప్ప అక్కడా పోరాడి సాధించుకోలేకపోయారు. ఇక ఎమ్మెల్యేగా నెగ్గాక మంత్రి పదవి ఇవ్వమని కనీసమైనా కూడా డిమాండ్ చేయలేకపోయారు. 2014 నాటికీ ఏమీ కానీ లోకేష్ 2017లో మాత్రం అయిదు కీలకమైన శాఖలకు మంత్రిగా అవతరించారు. మరి బాలకృష్ణ ఆటలో అరటిపండు కాకపోతే ఇలా జరుగుతుందా అన్నది నందమూరి అభిమానుల ఆవేదన.

హడావుడి చేసినా…?

ఎందుకో ఈ మధ్య బాలకృష్ణ బాగానే హడావుడి చేస్తున్నారు. ఎక్కడో కాదు తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ఆయన తరచుగా కనిపిస్తున్నారు. ఏపీలో టీడీపీకి తాను ఒక దిక్కుగా కనిపించాలన్న ఆరాటమో లేక తన రాజకీయ ఉత్సాహాన్ని బాబు గుర్తించలేదన్న పొరాటమో తెలియదు కానీ బాలకృష్ణ మాత్రం జనంలోకి అపుడపుడు వస్తున్నారు. అయినా కూడా ఆయన మీద పొలిటికల్ గా పెద్దగా ఫోకస్ ఉండడంలేదు. లోకేష్ పాటి కవరేజి కూడా అనుకూల మీడియాలో దక్కడంలేదు. బాలయ్యను ప్రొజెక్ట్ చేయడం బాబు లాబీకి అసలు ఇష్టం లేదన్నది ఈ విధంగా బయటపడుతోంది మరి.

కధ కంచికేనా..?

బాలకృష్ణ రెండవసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మూడవసారి టికెట్ దక్కుతుందా లేదా అన్నది డౌట్. ఒకవేళ దక్కినా గెలుస్తారా లేదా అన్నది మరో పెద్ద డౌట్. ఆయన గెలిచినా పార్టీ అధికారంలోకి వస్తుందా అన్నది ఇంకో డౌట్. ఇన్ని డౌట్ల మధ్య బాలకృష్ణ మాత్రం అమాయకంగా రాజకీయ గర్జనలు చేస్తున్నారు అంటున్నారు. ఏపీలో వైసీపీ ఇపుడు బలంగా ఉంది. ఇపుడున్న పరిస్థితే కంటిన్యూ అయితే మరో టెర్మ్ ఈజీగా అధికారంలోకి వస్తుందన్న లెక్కలు ఉన్నాయి. బాలయ్య వయసు రిత్యా చూసుకున్నా కూడా వచ్చే ఎన్నికలే చివరి ఎన్నికలు అని భావించాలి. ఆయన గెలిచి పార్టీ కూడా గెలిస్తే అపుడు బాబు దగ్గర ఏమైనా సౌండ్ చేస్తే ఫలితం ఉంటుందేమో. లేకపోతే మాత్రం రాజకీయ తెర నుంచి పూర్తిగా తప్పుకోవడమే అవుతుంది అంటున్నారు. మొత్తానికి టీడీపీని పెట్టి తెలుగు వారి గుండెల్లో పౌరుషాన్ని నిద్ర లేపిన అన్న గారి కుమారుడు బాలకృష్ణ ఇలా రాజకీయ ఆటలో అరటి పండుగా మారిపోవడం విషాదమే.

Tags:    

Similar News