ముద్దుల మామయ్యది మొద్దు నిద్రేనా?

నందమూరి బాలకృష్ణ రాజకీయ నేత అనేకంటే సినిమా నటుడిగానే ఉండటం ఎక్కువ ఇష్టపడతారు. ఆయనకు రాజకీయాలు ఇష్టం లేదని కాదు కానీ, ఎక్కువ దానిపై ఆయన దృష్టి [more]

Update: 2020-11-03 08:00 GMT

నందమూరి బాలకృష్ణ రాజకీయ నేత అనేకంటే సినిమా నటుడిగానే ఉండటం ఎక్కువ ఇష్టపడతారు. ఆయనకు రాజకీయాలు ఇష్టం లేదని కాదు కానీ, ఎక్కువ దానిపై ఆయన దృష్టి పెట్టారు. తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బాలకృష్ణ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. సినిమాలే పిచ్చిగా బతుకుతుంటారు. చంద్రబాబు బావ కావడంతో పార్టీని కూడా పెద్దగా పట్టించుకోరు. అప్పుడప్పుడు పార్టీ సమావేశాలకు హాజరై మమ అనిపించేస్తూ ఉంటారు.

పెద్ద చిక్కొచ్చి పడింది….

కానీ ఇప్పుడు బాలకృష్ణకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఆయన ఇద్దరు అల్లుళ్లు వైసీపీ ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. పెద్ద అల్లుడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. నారాలోకేష్ ను పార్టీ భావినేతగా భావించి ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. అయితే తాజాగా నారా లోకేష్ పై ఫైబర్ గ్రిడ్ కుంభకోణం మెడ మీద కత్తిలా వేలాడుతోంది. దానిపై ఎప్పుడైనా కేసు నమోదయ్యే అవకాశముంది.

అల్లుళ్లు టార్గెట్ అవుతున్నా….

ఇక బాలకృష్ణ మరో అల్లుడు శ్రీ భరత్ గీతం యూనివర్సిటీ ఛైర్మన్ గా ఉన్నారు. శ్రీ భరత్ ను కూడా రాజకీయాల్లోకి రావాలని బాలకృష్ణ ప్రోత్సహించారంటారు. గత ఎన్నికల్లో విశాఖ లోక్ సభకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తాజాగా గీతం యూనివర్సిటీలో ఆక్రమణలను వైసీపీ ప్రభుత్వం తొలగించింది. నలభై ఎకరాలను ఆక్రమించారని కూల్చివేతలను ప్రారంభించింది. విశాఖలో అల్లుడు శ్రీభరత్ వైసీపీకి టార్గెట్ అయ్యారు.

పెదవి విప్పడం లేదే…..

అయితే ఇంత జరుగుతున్నా బాలకృష్ణ మాత్రం పెదవి విప్పడం లేదు. ఇద్దరు అల్లుళ్లు చిక్కుల్లో ఉన్నా రాజకీయంగా ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలకు దిగడం లేదు. బాలకృష్ణ ఈ అంశాలపై మాట్లాడకపోవడంపై తెలుగుదేశం పార్టీలో కూడా చర్చజరుగుతోంది. అయితే ప్రస్తుతం బాలకృష్ణ 104వ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారని, అది పూర్తి చేసుకున్న తర్వాత పూర్తి స్థాయి ఏపీ రాజకీయాలపై దృష్టి పెడతారని చెబుతున్నారు. మొత్తం మీద మామయ్య మౌనం ఎందుకో అన్న చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News