బాల‌కృష్ణ‌కు అంత ఈజీ కాదటగా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం పార్టీకి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో అనంత‌పురం జిల్లా హిందూపురం ఒక‌టి. ఇక్క‌డి నుంచి దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ కుమారుడు నంద‌మూరి బాల‌కృష్ణ పోటీ చేస్తుండ‌ట‌మే [more]

Update: 2019-05-15 15:30 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం పార్టీకి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో అనంత‌పురం జిల్లా హిందూపురం ఒక‌టి. ఇక్క‌డి నుంచి దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ కుమారుడు నంద‌మూరి బాల‌కృష్ణ పోటీ చేస్తుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ పార్టీ ఆవిర్భ‌వించిన నాటి నుంచి 8 సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా అన్ని సార్లూ తెలుగుదేశం పార్టీనే విజ‌యం సాధించింది. ఎన్టీఆర్ ఏకంగా మూడుసార్లు ఇక్క‌డి నుంచి విజ‌యం సాధించడంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఆ పార్టీకి పెట్ట‌ని కోట‌లా మారింది. త‌ర్వాత హ‌రికృష్ణ ఒక‌సారి ఇక్క‌డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌గా గ‌త ఎన్నిక‌ల్లో బాల‌కృష్ణ పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి న‌వీన్ నిశ్చ‌ల్ పై 16 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఈసారి కూడా బాల‌కృష్ణ మ‌రోసారి ఇక్క‌డి నుంచి బ‌రిలో నిల‌వ‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున రిటైర్డ్ పోలీసు ఉన్న‌తాధికారి ఇక్బాల్ అహ్మ‌ద్ పోటీ చేశారు.

మైనారిటీ అభ్య‌ర్థిని దింపిన వైసీపీ

వాస్త‌వానికి వైసీపీ నుంచి హిందూపురం టిక్కెట్ కోసం న‌వీన్ నిశ్చ‌ల్ చివ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నించారు. వ‌రుస‌గా మూడుసార్లు ఓడిపోయిన సానుభూతి ఆయ‌న మీదున్నందున ఆయ‌న‌కు టిక్కెట్ ఇస్తే ఈసారి గెలిచే అవ‌కాశం ఉంద‌ని అంతా భావించారు. కానీ, వైసీపీ అధిష్ఠానం మాత్రం సామాజ‌క‌వ‌ర్గ లెక్క‌ల‌ను వేసుకొని ఇక్బాల్ కు చివ‌రి నిమిషంలో టిక్కెట్ కేటాయించింది. దీంతో న‌వీన్ నిశ్చ‌ల్ తో పాటు ఇటీవ‌ల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘ‌నీ అసంతృప్తికి గుర‌య్యారు. అయితే, పోలీస్ అధికారిగా గుర్తింపు ఉండ‌టం, విద్యావంతులు కావ‌డం, మైనారిటీ వ‌ర్గానికి చెందిన వారు కావ‌డంతో ఇక్బాల్ కు పార్టీ టిక్కెట్ ఇచ్చింది. అయితే, ఆయ‌న స్థానికేత‌రుడు కావ‌డం, రాజ‌కీయాల‌కు కొత్త అవ‌డం, చివ‌రి నిమిషంలో నియోజ‌క‌వ‌ర్గానికి రావ‌డం ఆయ‌న‌కు మైన‌స్ గా మారింది.

ఎదురీదుతున్న బాల‌కృష్ణ‌

గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన బాల‌కృష్ణ నియోజ‌క‌వ‌ర్గాన్ని బాగానే అభివృద్ధి చేయ‌గ‌లిగారు. నీటి స‌మ‌స్య ప‌రిష్క‌రించారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆయ‌న ఎక్కువ‌గా న‌మ్ముకున్నారు. టీడీపికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ముందు నుంచీ బ‌లం ఉండ‌టం, బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌లు ఓటు బ్యాంకు ఉండ‌టం, అన్నింటికీ మించి ఎన్టీఆర్ కుమారుడు కావ‌డం ఆయ‌న‌కు క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది. అయితే, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌క‌పోవ‌డం, పీఏల పెత్త‌నం జ‌ర‌గ‌డం మైన‌స్ అయ్యింది. ఇక‌, ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌లుమార్లు ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం మైన‌స్ అయ్యింది. విద్యావంతులు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఈ విష‌యంలో బాల‌య్య‌పై అసంతృప్తితో విద్యావంతుడైన ఇక్బాల్ వైపు మొగ్గు చూపారు. ఇక‌, వైసీపీ ఈసారి మైనారిటీ ఓట్ల‌ను కొల్ల‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నించారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న 55 వేల మంది మైనారిటీలు గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చూప‌గ‌ల‌రు. టీడీపీ మ‌రోసారి బీసీల ఓట్ల‌ను న‌మ్ముకుంది. మొత్తానికి బాల‌కృష్ణ ఈసారి హిందూపురంలో ఎదురీదుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అయితే, ఎన్టీఆర్ కుమారుడిగా ఆయ‌న గెలిచే అవ‌కాశం ఉన్నా స్వ‌ల్ప మెజారిటీతోనే బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

Tags:    

Similar News