మా బాలయ్య గొప్పోడు.. బోళా శంకరుడు

అన్న ఎన్టీఆర్ సినీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నాలుగున్నర దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగిస్తున్న తొలితరం నటవారసుడు బాలకృష్ణ. బాలయ్య సినీ రంగంలో రాణించినా రాజకీయాల్లో మాత్రం వట్టి ఎమ్మెల్యేగా [more]

Update: 2020-04-12 02:00 GMT

అన్న ఎన్టీఆర్ సినీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నాలుగున్నర దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగిస్తున్న తొలితరం నటవారసుడు బాలకృష్ణ. బాలయ్య సినీ రంగంలో రాణించినా రాజకీయాల్లో మాత్రం వట్టి ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. దానికి తాను ఎంతగానే నమ్మిన బావ చంద్రబాబు ప్రధాన కారణం. అది తెలిసినా హుందాగా మిన్నకుండడం బాలకృష్ణకే చెల్లు. జగన్ ప్రభంజనం వెల్లువలా వీచినా కూడా హిందూపురం నుంచి రెండవ సారి గెలిచిన బాలయ్య తన సత్తా ఏంటో చూపారు. ఇంత చేసినా ఆయన టీడీపీలో ఏమీ కానీ సాధారణ నాయకుడు. అదే బాలకృష్ణ ఒకపుడు అంటే తండ్రి ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కుని బావ చంద్రబాబుకు అప్పగించిన కొత్తల్లో టాప్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు. అప్పట్లో బాలయ్య సినిమా ఫంక్షన్లకు ముఖ్యమంత్రి హోదాలో బాబు వస్తే ఆయన చెవులు మారుమోగేలా ఒకటే నినాదాలు వినవచ్చేవి. కాబోయే సీఎం బాలయ్య అంటూ ఫ్యాన్స్ హోరును చూసిన బాబు ముఖం ముడుచుకున్న వైనాన్ని నాటి చానళ్ళు ఎంతో కొంత చూపించాయి కూడా.

సీన్ అలా ….

ఇక నాడు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడే ఏకైన నటుడుగా కొన్ని సార్లు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన హీరోగా బాలకృష్ణ ఇమేజ్ ని చూసే బాబు జాగ్రత్త పడ్డారని అంటారు. ఆ కారణంగానే తన కుమారుడు లోకేష్ కి బాలయ్య కూతుర్ని చేసుకుని వియ్యమందారని చెబుతారు. బాలకృష్ణకు దాని వల్ల భారీ నష్టం జరిగిందని ఇప్పటికీ అభిమానులు అంటారు. ఆ రకమైన దగ్గర చుట్టరికం లేకపోతే టీడీపీలో బాలయ్య సీన్ వేరేగా ఉండేదన్న వారూ ఉన్నారు. ఈ బంధంతో బాలయ్య బాగా తగ్గిపోగా బాబుకు ఓ భారీ పోటీ నందమూరి కుటుంబం నుంచి తప్పినట్లైంది.

మంచితనమే …?

బాలకృష్ణ విషయంలో అందరూ చెప్పే మాట ఒక్కటే. ఆయన భోళా శంకరుడు. మాట ఇస్తే వెనక్కి తగ్గరు. ఇక ఆయన చేయి కూడా పెద్దదే. కష్టంలో ఎవరైనా ఉంటే అది ఆయన వింటే మాత్రం తక్షణ సాయానికి సిధ్ధమవుతారు. ఆయన తన తండ్రి లాగానే రాజకీయాలు అసలు ఎరుగరు. ముక్కుసూటిగా ఉండడమే బాలకృష్ణకు తెలుసు. ఇది సినీ లోకమే కాదు, ఆయనతో సన్నిహితంగా ఉండేవారంతా చెప్పే మాట. అందుకే బాలయ్య రాజకీయాలకు పెద్దగా సూటు అవలేకపోయారని చెబుతారు. ఆయన బావను నమ్మి ఎమ్మెల్యేగా పోటీ చేసి బావుకున్నది లేదు. ఇంతటి మాస్ హీరో, సూపర్ స్టార్ డం అనుభవించిన బాలయ్య కనీసం మంత్రి కూడా కాలేకపోయారన్న వేదన ఫ్యాన్స్ లోనే కాదు, ఆయన కుటుంబంలో కూడా ఉంది.

బాబు కంటే బెటర్ …..

ఇక బాలయ్య కరోనా వైరస్ వంటి పెను విపత్తు సమయంలో భారీ విరాళం ఇచ్చి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. తెలంగాణా సర్కార్ కి యాభై లక్షలు, ఏపీ సర్కార్ కి మరో యాభై లక్షలు విరాళంగా ఇచ్చారు. అలాగే సినిమా కార్మికుల సంక్షేమం కోసం పాతిక లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇక బాలకృష్ణ కంటే ముందు ఆయన బావ బాబు వ్యక్తిగత హోదాలో కరొనా వైరస్ కి ఇచ్చిన విరాళం కేవలం పది లక్షలు మాత్రమే. బాబు పేదవాడు ఏమీ కాదు, హేరిటేజ్ సంస్థ మూడు రాష్ట్రాల్లో ఉంది. దానికి ఆయనే యజమాని. ఇక మూడు సార్లు సీఎం గా పని చేసి మరో మూడు సార్లు విపక్ష నేతగా ఉన్నారు. పైగా జాతీయ పార్టీ అధ్యక్షుడిని అని చెప్పుకునే బాబు ఇచ్చింది పది లక్షలు మాత్రమే. అదే బాలకృష్ణ యాభై లక్షలు ఇచ్చి బావ కంటే ఎన్నో రెట్లు బెటర్ అనిపించుకున్నారు. అలాగే మిగిలిన మాజీ మంత్రులు, సామంతుల కంటే కూడా తన ఉదారత్వాన్ని ఆయన చాటుకున్నారు. మొత్తానికి పారదర్శకమైన రాజకీయాలు కావాలని కోరుకునే వారు టీడీపీ వంటి పార్టీలో బాలయ్య మంచితనం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News