నల్లారికి లైన్ దొరకడం లేదులా ఉంది?

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చాలా రోజుల తర్వాత యాక్టివ్ అయ్యారు. అదీ నియోజకవర్గంలో మాత్రం కాదు. ట్విట్టర్ లోనే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన విమర్శలు [more]

Update: 2020-05-18 03:30 GMT

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చాలా రోజుల తర్వాత యాక్టివ్ అయ్యారు. అదీ నియోజకవర్గంలో మాత్రం కాదు. ట్విట్టర్ లోనే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన విమర్శలు చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరిని అవలంబిస్తున్నారు. మోదీని నిత్యం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. కానీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఇప్పటి వరకూ మౌనంగా…..

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎన్నికలకు ఏడాదిన్నర ముందు టీడీపీలో చేరారు. సోదరుడు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ పెట్టి దానిని మూసివేసిన పరిస్థితుల్లో రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీలో చేరారు. వైసీపీలో తన కుటుంబ ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండటంతో ఆయనకు టీడీపీ తప్ప మరో వే దొరకలేదు. టీడీపీలో చేరిన వెంటనే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి చంద్రబాబు కేబినెట్ ర్యాంకు కలిగిన నామినేటెడ్ పదవిని ఇచ్చారు.

వైసీపీ సర్కార్ పై….

పీలేరులో పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన పీలేరు నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు. హైదరాబాద్ లో తన వ్యాపారాలకు పరిమితమయ్యారు. పార్టీ చేపట్టే కార్యక్రమాలకు కూడా ఆయన స్పందించడం లేదు. కానీ తాజాగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కోరంగి మడ అడవులను నరకడంపై ఆయన జగన్ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. జగన్ కు ఇది అలవాటేనని ట్వీట్ చేశారు. పోతిరెడ్డి పాడు అంశం కూడా ప్రజల దృష్టిని మరల్చడానికే తీసుకువచ్చారన్నారు.

అన్న కోసమేనా?

ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై కూడా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ లైన్ బీజేపీ పట్ల సానుకూలతతో ఉండటమే. అయితే అందుకు భిన్నంగా ఇరవై లక్షలకోట్ల ప్యాకేజీపై కూడా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. నోట్లరద్దు, లాక్ డౌన్ లపై కూడా ఆయన కామెంట్స్ చేశారు. దీనికి ప్రధాన కారణం సోదరుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండటమే. అన్న పార్టీకి ఇబ్బంది కలగకూడదనే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బీజేపీ పై విమర్శలు చేశారన్నది టీడీపీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్. మొత్తం మీద నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్టీ లైన్ తెలియకుండానే ఈ వ్యాఖ్యలు చేశారా? కావాలనే కామెంట్స్ చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News