బాబు ప్రపోజల్ కు నో చెప్పడం వెనక?

తెలుగుదేశం పార్టీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇటీవల కాలంలో యాక్టివ్ అయ్యారు. అయితే ఆయన తన పీలేరు నియోజకవర్గానికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. [more]

Update: 2021-09-26 08:00 GMT

తెలుగుదేశం పార్టీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇటీవల కాలంలో యాక్టివ్ అయ్యారు. అయితే ఆయన తన పీలేరు నియోజకవర్గానికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు సమాచారం. పుంగనూరు బాధ్యతలను కూడా చూసుకోవాలన్న చంద్రబాబు ప్రతిపాదనను నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు.

పట్టు పెంచుకునేందుకు….

ప్రస్తుతం పీలేరు నియోజవర్గంలో తన పట్టును పెంచుకోవడంపైనే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దృష్టి పెట్టారు. మండల స్థాయిలో నేతలతో ఇటీవల ఆయన సమావేశం అయ్యారు. తాను ఇకపై పీలేరు నియోజకవర్గంలోనే ఉంటానని వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈసారి గెలవడమే ధ్యేయంగా పనిచేయాలని నేతలకు చెప్పడంతో పాటు వారి వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరిస్తానని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

రెండు సార్లు ఓడి….

పీలేరు నియోజకవర్గం నల్లారి కుటుంబానికి కంచుకోట. అలాంటి కంచుకోటలో రెండు దఫాలుగా గెలుపు పిలుపు విన్పించడం లేదు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీడీపీ లో చేరినా ఫలితం కన్పించలేదు. మొన్నటి ఎన్నికల్లోనూ ప్రజలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ని ఆదరించలేదు. అయితే ఈసారి స్థానిక వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత కన్పిస్తుంది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగకపోవడం, రోడ్లు, మంచినీటి వంటి సమస్యలను ఎమ్మెల్యే పట్టించుకోక పోవడంతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటి నుంచే రంగంలోకి దిగాలని భావిస్తున్నారు.

అందుకే తిరస్కరించారట…

అందుకే చంద్రబాబు ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించాలని తనకు ఉన్నప్పటికీ ఎక్కువ సమయాన్ని పీలేరుకే కేటాయిస్తానని చంద్రబాబు తో చెప్పారు. తాను ఇతర సాయమంతా చేస్తానని, కానీ ప్రత్యక్షంగా ఎక్కువ సమయం అక్కడ కేటాయించలేనని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రత్యర్థిని ఓడించడం కంటే తాను గెలవడమే ఈసారి ముఖ్యమని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అందుకే చంద్రబాబు ప్రపోజల్ కు నో చెప్పారంటున్నారు.

Tags:    

Similar News