రీ ఎంట్రీకి సిద్ధమయినట్లేనా?

Update: 2018-08-14 18:29 GMT

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ....ఇదేమీ ప్రతిష్టాత్మకమైన పదవి కాదు. అంతగా ప్రాధాన్యం గల పదవి కూడా కాదు. సాధారణ పదవే. మామూలు రోజుల్లో దీని గురించి మాట్లాడుకునే వారు కూడా ఉండరు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ అందుబాటులో లేనప్పుడు డిప్యూటీ ఛైర్మన్ రంగప్రవేశం చేస్తారు. సభా కార్యకలాపాలను నిర్వహిస్తారు. అంతకు మించి వారి పాత్ర ఏమీ ఉండదు. సభలో అధికార పార్టీకి తగినంత బలం లేకపోవడంతో ఈసారి ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార, ప్రతిపక్షాలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లకు దాదాపు సరిసమానమైన బలం ఉండటంతో రసవత్తర పోటీ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పదవికి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకోవడం ఆసక్తిదాయకం.

మూడోసారి ప్రాంతీయ పార్టీ నేత.......

ఈ పదవికి ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఎన్నిక కావడం ఇది మూడోసారి. ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్ బీహార్ కు చెందిన జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు. తొలిసారి పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఉన్నత విద్యావంతుడు., పాత్రికేయుడు. పూర్వాశ్రమంలో బ్యాంకు అధికారిగా పనిచేశారు. తొలిసారి రిపబ్లికన్ పార్టీకి చెందిన బి.డి. ఖోబ్రగడే1969లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. 1972 వరకూ పదవిలో కొనసాగారు. 1972 ఏప్రిల్ లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్ఎస్పీ)కి చెందిన గోడె మురహరి ఎన్నికయ్యారు. 1974లో రెండోసారి ఎన్నకై 1977 వరకూ ఆయన కొనసాగారు. తాజాగా ప్రాంతీయ పార్టీ అయిన జనతాదళ్ (యు) నాయకుడు హరివంశ్ ఎన్నికవ్వడం విశేషం. చాలా కాలం తర్వాత మళ్లీ ప్రాంతీయ పార్టీకి అవకాశం లభించింది. తొలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్.వి.కృష్ణమూర్తి రావ్ కర్ణాటక వాసి. 1952 నుంచి 62 వరకూ రెండుసార్లు డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరించారు. సుదీర్ఘకాలం డిప్యూటీ ఛైర్మన్ పదవి కాంగ్రెస్ ఆధీనంలోనే ఉంది. బి.డి.ఖోబ్రెగడే, గోడె మురహరి, ప్రస్తుత హరివంశ్ తప్ప మిగిలిన అందరూ కాంగ్రెస్ వారే కావడం గమనార్హం. 1986 నవంబరు నుంచి 1988 నవంబరు వరకూ డిప్యూటీ ఛైర్మన్ పనిచేసిన ప్రతిభా పాటిల్ అనంతర కాలంలో రాష్ట్రపతిగా ఎన్నిక కావడం విశేషం.

సుదీర్ఘకాలం రాజ్యసభలోనే.....

రాజ్యసభ పేరు చెప్పగనే చటుక్కున గుర్తొచ్చే పేరు నజ్మా హెప్తుల్లా. పెద్దల సభలో ఆమెపేరు తెలియని వారు ఉండరు. పెద్దల సభతో ఆమె అనుబంధం ప్రత్యేకమైంది. ఆరుసార్లు అంటే 36 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యురాలిగా, 16 ఏళ్ల పాటు నజ్మా హెప్తుల్లా డిప్యూటీ ఛైర్మన్ గా పనిచేసి రికార్డు సృష్టించారు. ఇంత సుదీర్ఘకాలం డిప్యూటీ ఛైర్మన్ గా, సభ్యురాలిగా ఎవరూ పనిచేయలేదు. మధ్యప్రదేశ్ కు చెందిన నజ్మా భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ దగ్గరి బంధువు. ఆమె రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ తో ప్రారంభమైంది. 1980 నుంచి 2016 వరకూ వరసగా ఆరుసార్లు అంటే 36 సంవత్సరాల పాటు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం విశేషం. 1980లో మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ తరుపున పెద్దల సభకు ఎన్నికైన నజ్మా తొలి దఫాలోనే సభకు సారథ్యం వహించే అనూహ్య అవకాశం పొందారు. 1985 జనవరి 25 నుంచి 1986 జనవరి 20 వరకూ ఈ పదవిలో కొనసాగారు. రెండోసారి 1988లో మళ్లీ ఎగువసభకు ఎన్నికై అప్రతిహతంగా 2004 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1988 నవంబరు 11 నుంచి 1992 జులై 4 వరకు రెండోసారి డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరించారు. మూడోసారి 1992 జులై 10 నుంచి 1998 జులై 4 వరకు పదవిలో కొనసాగారు. మూడోసారి 1998 జులై 9 నుంచి 2004 జూన్ 10 వరకు డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరించారు. మొత్తం 17 ఏళ్ల పాటు డిప్యూటీ ఛైర్మన్ గా సుదీర్ఘకాలం సేవలందించారు. వరుసగా 1980, 86, 92, 98 ల్లో మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో విభేదాల ఫలితంగా బీజేపీలో చేరారు. నితిన్ గడ్కరీ, రాజనాథ్ సింగ్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు పార్టీ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2004లో రాజస్థాన్ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2007లో బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేశారు. యూపీఏ అభ్యర్థి హమీద్ అన్సారీపై ఓడిపోయారు. 2004 నుంచి 2016 వరకూ మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు. 2014లో మోదీ కేంద్ర మంత్రివర్గంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2016 ఆగస్టు 17న హెప్తుల్లాను కేంద్రం మణిపూర్ గవర్నర్ గా నియమించింది. సుదీర్ఘకాలంగా రాజ్యసభ సభ్యురాలిగా నజ్మ హెప్తుల్లా అందించిన సేవలు చిరస్మరణీయం.

మళ్లీ క్రియాశీలకంగా......

నజ్మా మంచి వ్యాపారవేత్త. యూపీలోని జామియా మిలయా ఇస్లామియా విశ్వవిద్యాలయం కులపతిగా కొంతకాలం వ్యవహరించారు. 78 సంవత్సరాల నజ్మా హెప్తుల్లా ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ గా క్రియాశీలకంగా ఉన్నారు. అధికార భారతీయ జనతా పార్టీలో చెప్పుకోదగ్గ స్థాయి గల ముస్లిం నాయకులు ఎవరూ లేరు. కేంద్ర మంత్రి అబ్బాస్ నక్వీ వంటి ఒకరిద్దరు తప్ప జాతీయ స్థాయి నాయకులు ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సీనియర్ ముస్లిం నేత అవసరం పార్టీకి ఉంది. నజ్మా హెప్తుల్లాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా ఈ స్థానాన్ని భర్తీ చేస్తారన్న అభిప్రాయం బీజేపీలో వ్యక్తమవుతోంది. ముస్లిం కావడం, మహిళ కావడం, ఉన్నత విద్యావంతురాలు కావడం, వివాదస్పదరాలు కాకపోవడం నజ్మా ప్రత్యేకతలు. ఈ నేపథ్యంలో నజ్మాకు కీలకమైన కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం లేకపోలేదు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News