ఈసారి మామూలుగా ఉండదటగా?

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాలుగా కసరత్తులు చేస్తున్నారు. అన్ని ఈక్వేషన్లను పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఈసారి అభ్యర్థి ఎంపిక విషయంలో [more]

Update: 2021-01-01 09:30 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాలుగా కసరత్తులు చేస్తున్నారు. అన్ని ఈక్వేషన్లను పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఈసారి అభ్యర్థి ఎంపిక విషయంలో తప్పు చేయకూడదని నిర్ణయించుకుని ఆ దిశగా చర్యలకు ఉపక్రమించారు. గతంలో జరిగిన పొరపాట్లను అధిగమించేలా అభ్యర్థి ఎంపిక ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం వరసగా సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు.

అభ్యర్థి ఎంపికపైనే…

ఏ ఎన్నికలోనైనా విజయం దక్కాలంటే అభ్యర్థి ఎంపికే ప్రధానం. దుబ్బాక ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికలో జరిగిన పొరపాటు నాగార్జున సాగర్ విషయంలో జరగకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. నోముల నరసింహయ్య కుటుంబ సభ్యులకు మాత్రం టిక్కెట్ ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగా లేరు. ఈ విషయాన్ని ఆ కుటుంబానికి కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో వారికి నామినేటెడ్ పోస్టు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు…..

ఇక నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఇటీవల కేసీఆర్ ముఖ్యనేతలతో చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుందని కొందరు నేతలు సూచించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి కానీ ఆయన కుమారుడు కానీ ఖరారు కానున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన వారికి టిక్కెట్ ఇస్తే గెలుపు సులువవుతుందని కొందరు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.

వారిద్దరిలో ఒకరు….?

ఈ సందర్భంగానే ముగ్గురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. నల్లగొండ రాజకీయాల్లో సీనియర్ నేత, ప్రస్తుత శాసనమండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి పేరును కొందరు ప్రస్తావించగా దీనికి కేసీఆర్ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. తర్వాత ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈయన ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన నేత కావడంతో ఈయన పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే మరో సీనియర్ నేత ఎంసీ కోటిరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. వీరి పేర్లతో సర్వేను నిర్వహించి ఫలితాల అనంతరమే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కొందరు బీసీ నేతల పేర్లను కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ ఈసారి కసరత్తు మామూలుగా చేయడం లేదంటున్నారు పార్టీ నేతలు.

Tags:    

Similar News