మెగా బ్రదర్ హడావిడి కన్పించడం లేదెందుకో?

మెగా బ్రద‌ర్ నాగ‌బాబు.. ఏమ‌య్యాడు? రాజ‌కీయాల్లో ఉన్నాడా? లేడా? ఇప్పుడు రాష్ట్రంలోని మెగా ఫ్యాన్స్‌ను ఎవ‌రిని క‌దిపినా ఇదే చ‌ర్చ సాగుతోంది. నాయ‌కులు ఎంద‌రో వ‌స్తుంటారు.. పోతుంటారు.. [more]

Update: 2020-04-18 02:00 GMT

మెగా బ్రద‌ర్ నాగ‌బాబు.. ఏమ‌య్యాడు? రాజ‌కీయాల్లో ఉన్నాడా? లేడా? ఇప్పుడు రాష్ట్రంలోని మెగా ఫ్యాన్స్‌ను ఎవ‌రిని క‌దిపినా ఇదే చ‌ర్చ సాగుతోంది. నాయ‌కులు ఎంద‌రో వ‌స్తుంటారు.. పోతుంటారు.. అంద‌రినీ గుర్తు పెట్టుకోవ‌డం అంటే సాధ్యమ‌య్యేది కాదు. అంద‌రూ కూడా త‌మ‌కంటూ ప్రత్యేక పాలిటిక్స్‌ను నెల‌కొల్పేది కూడా ఉండ‌దు. అయితే, మెగా ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేక‌త నేపథ్యంలో ఈ ఫ్యామిలీ రాజ‌కీయాలు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫ్యామిలీపై అనేక ఆశ‌లు పెట్టుకున్న అభిమానులు కూడా ఉన్నారు. ఇలా మెగాస్టార్‌, ప‌వ‌ర్ స్టార్ స‌హా మెగా బ్రద‌ర్ రాజ‌కీయాల‌పై అనేక మంది అభిమానులు ఆశ‌లు పెట్టుకున్నారు.

పార్లమెంటుకు వెళ్లాలనుకున్నా….

వెండితెర‌పై ఆరాధించే వీరిని అసెంబ్లీ స‌హా పార్లమెంటులో చూసి మురిసిపోవాల‌నుకున్నారు. ఈక్రమంలో ఒక్క మెగాస్టార్ మాత్రం స‌క్సెస్ అయ్యారు. అది కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి పాల‌కొల్లు, తిరుప‌తిలో రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి తిరుప‌తిలో గెలిచి పాల‌కొల్లులో ఓడిపోయారు. త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్ ద్వారా రాజ్యస‌భ‌కు ఎంపికై కేంద్ర మంత్రి అయ్యారు. ఇక, నాగ‌బాబు, ప‌వ‌న్ మాత్రం రాజ‌కీయాల్లో గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. అన్న పార్టీ నుంచి పోటీ చేయ‌ని నాగ‌బాబు త‌మ్ముడు ప‌వ‌న్ జ‌న‌సేన నుంచి న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడారు.

సామాజికవర్గం ఓట్లతో….

ప‌వ‌న్‌, నాగ‌బాబు ఓడినా వారిని తక్కువ‌గా అంచ‌నావేసే అభిమానులు లేకపోవ‌డం గ‌మ‌నార్హం. త‌న సొంత ప్రాంత‌మైన న‌ర‌సాపురంలో కాపు వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువుగా ఉండ‌డంతో నాగ‌బాబు ఇక్కడ పోటీ చేశారు. ఓడిపోయినా కూడా ఆయ‌న‌కు ఏకంగా 2.50 ల‌క్షల ఓట్లు వ‌చ్చాయి. అయితే, ఎన్నిక‌ల‌క‌న్నాక గెలుపు ఓట‌ములు ప్రజ‌ల చిత్తమే కాబ‌ట్టి.. ఈ విష‌యంలో వారు ఊహించింది జ‌రిగే అవ‌కాశం లేదు. దీంతో నాగ‌బాబుకు కూడా ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి. ఆయ‌న ఓడిపోయారు. ఆ త‌ర్వాత రాజ‌ధాని ఉద్యమంలో భాగంగా ఒక రోజు వ‌చ్చి రాజ‌ధాని ప్రాంతంలో హ‌డావుడి చేశారు. మ‌ధ్యలో ఓ సారి మాత్రం వైజాగ్‌లో జ‌న‌సేన ఇసుక‌దీక్షలో మాత్రం క‌నిపించారు.

ఓటమి తర్వాత….

చివ‌ర‌కు ప‌వ‌న్ పార్టీ కార్యక‌ర్తల స‌మీక్షా స‌మావేశం పెట్టినా దానికి హాజ‌రు అయ్యేంత తీర‌క కూడా నాగ‌బాబుకు లేన‌ట్లుంద‌న్న విమ‌ర్శలు కూడా వ‌చ్చాయి. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత నాగ‌బాబు ఇటు వైపే చూడ‌డం మానేశారు. హైద‌రాబాద్‌లో కూర్చొని టీవీ ప్రోగ్రామ్‌లలో నిమ‌గ్నమ‌య్యార‌న్నది సుష్పష్టం. రాజ‌కీయాల‌కు, నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్నారు. త‌న‌ను అభిమానించేవారికి కూడాఆయ‌న దూరంగానే ఉన్నారు. కీల‌క‌మైన స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ అస‌లు నాగ‌బాబు అడ్రస్సే లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర విమ‌ర్శలు చేసిన నాగ‌బాబు జ‌గ‌న్ సీఎం అయ్యాక ఒక‌టీ ఆరా సార్లు మాత్రమే విమ‌ర్శ‌లు చేసినా ఇప్పుడు పూర్తిగా సైలెంట్‌గా ఉన్నారు. మ‌రి నాగ‌బాబు రాజ‌కీయంగా మ‌ళ్లీ యాక్టివ్ అయ్యేనా ? లేదా ఆయ‌న రాజ‌కీయాలు ఇక్కడితో స‌రిపెడ‌తారా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News