నాగబాబు.. అక్కడితోనే ఆపేస్తారా?

మెగా బ్రదర్ అన్న ట్యాగ్ తో నాగబాబు సినీరంగంలో ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆయన అన్న చాటు తమ్ముడు, తమ్ముడి మాటు అన్నగా కూడా కనిపిస్తారు. ఆయన కొణిదెల [more]

Update: 2021-09-14 02:00 GMT

మెగా బ్రదర్ అన్న ట్యాగ్ తో నాగబాబు సినీరంగంలో ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆయన అన్న చాటు తమ్ముడు, తమ్ముడి మాటు అన్నగా కూడా కనిపిస్తారు. ఆయన కొణిదెల కుటుంబంలో మధ్యముడు. అన్నా తమ్ముడు చల్లంగా ఉంటే చాలు అనుకునే విశాల హృదయం నాగబాబు సొంతం. ఇక అన్న ప్రజారాజ్యం పార్టీకి ఇంజన్ గా పనిచేసిన నాగబాబు జనసేనలోనూ తనదైన పాత్ర పోషించారు. నర్సాపురం లోక్ సభ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన బాగానే ఓట్లు సంపాదించారు. చివరి నిముషంలో రాజకీయ ఎంట్రీ ఇచ్చినా కూడా బాగానే ప్రదర్శన ఉందని అంతా అనుకున్నారు. అయితే ఇలా ఓడిపోగానే అలా నాగబాబు రాజకీయ తెర నుంచి అదృశ్యం కావడమే విశేషంగా చూడాలి.

దూకుడు చూపినా…?

నాగబాబు ఎటువంటి ముందస్తు ప్రయత్నం లేకుండా సడెన్ గా నర్సాపురం లోక్ సభ బరిలోకి దిగినా కూడా ఆయనకు రెండున్నర లక్షల ఓట్లు వచ్చాయి. అది సామాన్య విషయం కాదు. జనసేనకు అన్ని ఓట్లు పడ్డాయి అంటే అది మెగా బ్రదర్ మీద జనం చూపించిన ఆదరణగానే చూదాలి. ఇక నాగబాబు కూడా ఆ ఎన్నికలలో అగ్రెస్సివ్ గానే వ్యవహరించారు. అటు జగన్, ఇటు చంద్రబాబులను గట్టిగా విమర్శిస్తూ అనుభవం కలిగిన నాయకుడి మాదిరిగానే సత్తా చాటారు. ఇక గెలిచినా ఓడినా తాను నర్సాపురం జనం మధ్యనే ఉంటాను అని కూడా నాగబాబు చెప్పారు. కానీ రెండున్నరేళ్ళు గడచినా కూడా నాగబాబు అటు వైపు కన్నెత్తి చూడడమే మానేశారు.

ఆ వైరాగ్యంలోనే …

నాగబాబు ఇపుడు రాజకీయ వైరాగ్యంలో ఉన్నారనే అంటున్నారు. అందుకే ఆయన అటు జనసేన కార్యక్రమాలలో కూడా ఏ మాత్రం చురుకుగా పాల్గొనటంలేదని చెబుతున్నారు. పార్టీ తమ్ముడిది అయినా పెత్తనం వేరొకరిది అన్నట్లుగా అక్కడ సీన్ ఉంది. నిజానికి నాగబాబుకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఆయన ఈ రోజుకీ జనాల్లో ఉండేవారని అంటారు. పవన్ సినిమాలు చేసుకున్నా కూడా క్యాడర్ కి ఉత్సాహమిస్తూ పార్టీ పటిష్టంగా ఉండేలా చేసేవారు అని చెబుతారు. నిజానికి పార్టీ ఓడిన కొత్తల్లో నాగబాబు విశాఖ గోదావరి జిల్లాలలో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు. కానీ ఆ తరువాత ఎందుకో ఆయన దూరం అయిపోయారు.

ఆయనే ముద్దు అట….

ఇక తెలుగుదేశం 2019 ఎన్నికల్లో సీనియర్ నేత వేటకూరి వెకట శివరామరాజుకి టికెట్ ఇచ్చింది. ఆయన నాలుగు లక్షల దాకా ఓట్లు సంపాందించారు. ఇపుడు ఆయనను పక్కన పెట్టి మరీ వైసీపీ తరఫున గెలిచి రెబెల్ గా మారిన కనుమూరి రఘు రామ కృష్ణరాజుకే బాబు మద్దతు ఇవ్వడం తమ్ముళ్లకు కూడా షాక్ గా ఉంది. మరో వైపు నాగబాబుని డైరెక్ట్ గా ఎన్నో విమర్శలు చేసిన రఘురామ ఇపుడు జనసేనాని పవన్ కి కూడా ఆప్తుడుగా మారారు అంటున్నారు. తన సోదరుడు ఓడినా కూడా నర్సాపురం ఎంపీ తమవాడే అన్న ఫీలింగ్ అయితే జనసేనానిలో ఎక్కడో ఉన్నట్లుంది మరి. టీడీపీ తీరు కూడా అదే కావడంతో నాగబాబు ఓడారు అన్నది ఎవరికీ గుర్తుకురావడంలేదు అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన పొత్తు కుదిరితే టీడీపీ నుంచి రఘురామ మరోమారు ఎంపీగా పోటీ చేసినా చేస్తారు. అందువల్ల నాగబాబు రాజకీయం నర్సాపురంతోనే మొదలై అక్కడే ఆగిపోయింది అనే చెప్పాలి.

Tags:    

Similar News