ముదురు రాజకీయం.. కెలికింది అందుకేనట?

ఎలా ఉండాల్సిన వారు అలాగే ఉండాలి. అపుడే జనం వారిలోని రియాలిటీని గుర్తిస్తారు. అంతే తప్ప ఎటు వైపు పడితే అటువైపు జారిపోతూ ఊగిపోతూంటే దాన్ని పట్టించుకోరు [more]

Update: 2020-05-24 12:30 GMT

ఎలా ఉండాల్సిన వారు అలాగే ఉండాలి. అపుడే జనం వారిలోని రియాలిటీని గుర్తిస్తారు. అంతే తప్ప ఎటు వైపు పడితే అటువైపు జారిపోతూ ఊగిపోతూంటే దాన్ని పట్టించుకోరు సరికదా నిలకడ లేని తత్వమని గట్టిగానే దెబ్బేస్తారు. ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే జనసేన సీన్ అలాగే కనిపిస్తోంది. రాజకీయ పార్టీలకు అసలు సిధ్ధాంతాలే తక్కువ అనుకుంటే జనసేన వాటిని మించిపోతోంది. కనీసం ఒక పార్టీగా ఉండాల్సిన విధానాలు కూడా లేకుండా పోతోంది అంటున్నారు. ఆ పార్టీకి ఎందరో స్పూర్తిదాతలు, అంబేద్కర్ మొదలుకుని అందరికీ దాటుకుని వచ్చేశాక, చెగువెరా సైతం ఏమీ చేయలేకపోయాక ఇపుడు నాధూరాం గాడ్సేనే దిక్కు అయినట్లుగా కనిపిస్తోంది. నాధూరాం గాడ్సె పేరు ఈ దేశానికి ఎలా తెలుసు అంటే గాంధీ హంతకుడిగా, అంతకు మించి బీజేపీ వారు ఆయన్ని కీర్తించడం బట్టి కూడా అని చెప్పాలి. ఇంతకీ ఈ నాధూరాం గాడ్సే అన్న వ్యక్తి ఫక్తు ఆర్ఎస్ఎస్ మనిషి. అందుకే ఇపుడు జనసేనాని పవన్ కి అన్నయ్య, ఆ పార్టీలో నేత అయిన నాగబాబు ఆయన్ని గొప్ప దేశ భక్తుడు అంటూ ట్వీటింది, మొత్తం కెలికింది అన్న అనుమానాలు వస్తున్నాయి.

కలసిపోవాలనా…?

హఠాత్తుగా ఉన్నట్లుండి నాగబాబు గాడ్సె గొప్ప దేశభక్తుడు అంటూ ట్వీటేశారు. అంతే కాదు ఆయన గాంధీని ఎందుకు చంపారో చర్చించాలని కూడా కోరుతున్నారు. గాడ్సె దేశ‌భక్తుడని ఓ వైపు కితాబు ఇస్తూ ఆయన చేసిన నేరాన్ని సమర్ధించడం లేదని నాగబాబు అనడం ముదురు రాజకీయమే. అవును మరి రాజకీయాల్లోకి వచ్చాక బాగానే పండారని ఈ స్టేట్మెంట్స్ చెబుతున్నాయి. ఇదంతా ఎందుకు అంటే కమలనాధులకు ఇష్టమైన గాడ్సేని పొగిడితే తమకూ ఆ పార్టీ నేతల వద్ద పలుకుబడి పెరుగుతుందని అంటున్నారు ఈ వ్యాఖ్యలను చూసిన వారు, రాజకీయ విశ్లేషకులు.

ఇజంలో నిజమెంత?

అసలు పవనిజం అని చాన్నాళ క్రితం పుస్తకం ఒకటి వచ్చింది. అందులో భావాలు పూర్తిగా వేరుగా ఉన్నాయి. ఇక పవన్ తాను ఎర్రన్నలంటే ఇష్టపడతాను అని పదే పదే చెప్పుకున్నారు. కమ్యూనిజం తన ఇజం అని కూడా వల్లించినట్లు గుర్తు. ఇక అర్జెంటీనా విప్లవకారుడు చెగువెరను అభిమానించే పవన్ ఉన్నట్లుండి అపర హిందుత్వగా మారిపోతున్నారు. ఆయన గారి అన్న నాగబాబు తాను నాస్తికుడినని చెప్పుకున్నారు. తనకు దేవుడు, గుళ్ళూ వంటి వాటి మీద నమ్మకాలు లేవని కూడా అనేశారు. అలాంటిది హిందూత్వకు ప్రాణమైన ఆర్ఎస్ఎస్ భావజాలం వైపుగా మొగ్గు చూపడంలోని పరమార్ధం ఏంటో. అసలు హిందూత్వ భావజలానికైనా ఈ అన్నదమ్ములు బద్ధులైనట్లేనా. లేక బీజేపీ ప్రాపకం కోసం ఇలా చేస్తున్నారా. జనసేన నేతల ఇజాలల్లో నిజాలు ఏంటి, ఎంత అన్నది కూడా ఇపుడు చర్చగా ఉంది.

జరిగే పనేనా?

బీజేపీని మెప్పించాలంటే మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ నుంచి నరుక్కురావడం కరెక్ట్ అని ఎవరు చెప్పారో లేక జనసేనలోని పెద్దలకు తట్టిందో తెలియదు కానీ నాగబాబు చేత ఈ రకమైన ప్రకటన ఇప్పించారని అంటున్నారు. నిజానికి గాంధీని దూషించి సాధించేది ఏదీ లేదని బీజేపీయే గ్రహించి చాన్నాళ్ళు అయింది. ఇక ఆర్ఎస్ఎస్ కూడా గాంధీని కొలుస్తోంది. ఈ నేపధ్యంలో తమ పార్టీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సైతం గాడ్సేని పొగిడినా బీజేపీ క్షమించలేదు. అలాంటిది కేవలం సినీ గ్లామర్ తప్ప మరేమీ లేని జనసేన పార్టీలోని నాయకులు తమ వాచాలత్వంతో గాంధీని నిందిస్తూ, గాడ్సేను పొగుడుతూ బీజేపీకి చేరువ కావాలనుకుంటే అది జరిగే పనేనా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రపంచం మొత్తం అభిమానించే గాంధీని చంపిన గాడ్సేను వెనకేసుకు వచ్చి నాగబాబు పెద్ద తప్పే చేశారని అంతటా వినిపిస్తోంది. వ్రతం చెడింది. ఫలం దక్కదు అన్న తీరున జనసేన నేతల పరిస్థితి ఉందని అంటున్నారు. కొసమెరుపు ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి గాంధీయిజాన్ని కొలుస్తూ శంకర్ దాదా జిందాబాద్ మూవీ అప్పట్లో తీశారు. మరి ఆ సినిమా నాగబాబుకు గుర్తుందో లేదో.

Tags:    

Similar News