ఇక మొత్తం అంతా నాదెండ్లదేనా?

దేశంలోనే వెన్నుపోటు రాజకీయాలకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు అంటారు. మిగిలిన చోట ఈ రేంజిలో నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసిన ఘటనలు లేవు. అక్కడా [more]

Update: 2020-12-30 15:30 GMT

దేశంలోనే వెన్నుపోటు రాజకీయాలకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు అంటారు. మిగిలిన చోట ఈ రేంజిలో నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసిన ఘటనలు లేవు. అక్కడా పదవీ వ్యామోహాలు ఉన్నాయి. కుర్చీలాటలూ ఉన్నాయి. కానీ ఇంత దారుణమైన రాజకీయాలు మాత్రం లేవనే అంటారు. నాదెండ్ల భాస్కర రావు 1984లో ఎన్టీయార్ ముఖ్యమంత్రి కుర్చీ లాక్కుని నెలరాజుగా మిగిలితే అప్పటికి అది ఘాతుకం అనుకున్నారు. పదకొండేళ్ళ తరువాత సొంత అల్లుడు చంద్రబాబు పార్టీనీ, ప్రభుత్వాన్ని కూడా లాగేసుకుంటే ఎప్పటికీ అది చరిత్రలో నిలిచిపోయే దారుణమని చెప్పుకుంటున్నారు.

కుదిరిన పోలిక…..

ఇక పవన్ కళ్యాణ్ కి నాదెండ్ల కుటుంబంతోనూ సాన్నిహిత్యం ఉంది. అలాగే చంద్రబాబుతోనూ ఒకప్పటి దోస్తీ ఉంది. ఎన్టీయార్ తో పోలిస్తే పవన్ కొంత రాజకీయంగా రాటుదేలినవాడేనని చెప్పుకోవాలి కానీ ఇది రాజకీయం, విషం కంటే ప్రమాదకరం కాబట్టి ఎంతటి నాయకులకైనా కూడా వెన్నుపోట్లు తప్పవని చరిత్ర నిరూపించింది. అందుకే ఇపుడు నాదెండ్ల కుమారుడు మాజీ స్పీకర్ మనోహర్ కో పైలెట్ గా ఉన్న మరో ఫిల్మ్ స్టార్ పార్టీ జనసేనను కూడా నాటి ఎన్టీయార్ తెలుగుదేశంతో సరి పోలుస్తున్నారు.

నంబర్ టూగా….

జనసేనలో వన్ టూ టెన్ పవన్ మాత్రమేనని అభిమానులు అనుకుంటారు. కానీ పవన్ మాత్రం తనకు అన్ని రకాలుగా తోడూ నీడగా నాదెండ్ల మనోహర్ ని పక్కన పెట్టుకున్నారు. ఆయనతోనే ఢిల్లీ వెళ్లినా విజయవాడలో గుడికి వెళ్లినా, లేక మరో పరామర్శకు వెళ్ళినా మీటింగులకు వెళ్ళినా వెంట ఉండే ఏకైక నాయకుడు నాదెండ్ల మనోహర్ మాత్రమే. అంతలా నాదెండ్లను నమ్మేసిన పవన్ పార్టీ మొత్తాన్ని ఆయనకు అప్పగించారని అంటున్నారు. పవన్ ఇపుడు క్షణం తీరిక లేని విధంగా సినిమాలను ఒప్పుకున్నారు. వాటిని 2022 నాటికి పూర్తి చేయాలని కూడా ఆయన కంకణం కట్టుకున్నారు. దాంతో నాదెండ్లనే జనంలోకి పంపుతున్నారు.

డౌట్ కొడుతోందా…?

నిజానికి నాడు నాదెండ్ల భాస్కరరావు కూడా ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడవాలనుకోలేదు. పార్టీలోని వారే ఆయన్ని అలా ప్రోత్సహించారని చెబుతారు. ఎంతైనా పదవీ రాజకీయాలు ఇవి. ఎటువంటి వారికైనా కన్ను కొట్టడంలో తప్పు కూడా లేదు. నాదెండ్ల మనోహర్ పవన్ కంటే రాజకీయంగా సీనియర్. అనుభవం ఉన్నవాడు. పైగా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వాడు. బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్న వాడు. ఆయన ఇపుడు పవన్ లేకుండా టూర్లు చేస్తున్నారు. జనసైనికులతో మీటింగులు పెడుతున్నారు. ఏపీలో జనసేనకు బలం ఉంది. సరైన రాజకీయం చేసి గాడిలో పెడితే మూడవ శక్తిగా ఎదగడం ఖాయం. ఇపుడు పవన్ పక్కనే ఉన్న నాదెండ్ల మనోహర్ రేపటి రోజున జనసేన పుంజుకుంటే ఏమైనా చేస్తారా అన్న డౌట్లు అయితే ఉన్నాయట. పైగా కోస్తా జిల్లాల్లో కాపులకు కమ్మలకు పడదు అని చెబుతారు. మరి కమ్మ కులానికి చెందిన నాదెండ్ల మనోహర్ ను పక్కన పెట్టుకున్న మరో ఫిల్మ్ స్టార్ పవన్ కి గత చేదు అనుభవాలు ఎదురవుతాయా అని కరడుకట్టిన జనసైనికులు బాధ పడితే తప్పు వారిది కాదు. అచ్చంగా పవన్ దే. సినిమాలు చేసుకుంటూ రాజకీయాలను వదిలేయడం ముమ్మాటికీ తప్పే కదా.

Tags:    

Similar News