ఏపీకి సామాజిక వైద్యుడు అవసరమా?

శ్రీరాముడి చరిత్రలో రెండు ప్రధాన ఘట్టాలు విమర్శనాత్మకంగా నిలుస్తాయి. అందులో ఒకటి తన భార్య సీతాదేవికి “శీల పరీక్ష” చేయడం, రెండోది “శంభూక వధ”. ఈ రెండు [more]

Update: 2020-05-27 16:30 GMT

శ్రీరాముడి చరిత్రలో రెండు ప్రధాన ఘట్టాలు విమర్శనాత్మకంగా నిలుస్తాయి. అందులో ఒకటి తన భార్య సీతాదేవికి “శీల పరీక్ష” చేయడం, రెండోది “శంభూక వధ”. ఈ రెండు అంశాలపై విమర్శల్లో శ్రీరాముడిని “లింగ వివక్ష” మరియు “కుల వివక్ష” చూపిన రాజుగా గుర్తిస్తారు. ఒక స్త్రీకి శీలపరీక్ష పెట్టడం సమర్ధనీయం కాదు. సీత కూడా శ్రీరాముడి శీల పరీక్ష కోరి ఉంటే? అలాగే అస్పృష్యుడు అనే కారణంతో మహర్షి శంభూకుని వధించడం కూడా సమర్ధనీయం కాదు.

మన పురాణాల్లోనూ…

అయితే రామాయణంలోనే కాక, మహాభారతంలో కూడా ఇలాంటి వివక్షే కనిపిస్తుంది. మహా వీరుడైన ఏకలవ్యుడి ధనుర్విద్యా ప్రతిభ చూసిన ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటనవేలు గురుదక్షిణగా తీసుకుంటాడు. ఒక వీరుని (అర్జునుడు) మహావీరునిగా చూపేందుకు ద్రోణుడు “పెద్ద గీత చెరిపే” సూత్రం పాటిస్తాడు. వశిష్ఠుడు తన ఆధిపత్యం నిలుపుకునే క్రమంలో శంభూకుని రాముడి ద్వారా అంతమొదించి “పెద్ద గీత చెరిపివేసే” నీతిని అనుసరిస్తారు. పెద్ద గీత చెరిపేస్తే పక్కనున్న చిన్నగీతే పెద్దగా కనిపిస్తుంది. శతాబ్దాలు గడిచినా స్త్రీకి శీలపరీక్ష జరుగుతూనే ఉంది. శంభూక వధ కొనసాగుతూనే ఉంది. అయితే అప్పుడప్పుడూ, అక్కడక్కడా సామాజిక మార్పు కోరే వ్యక్తులు వస్తుంటారు. వాస్తవానికి ఇలాంటి వారివల్లనే కొన్ని వివక్షలు చరిత్ర చిహ్నాలుగా మిగిలిపోతాయి. కొంత సామాజిక మార్పు వస్తుంది. వివక్షను వ్యతిరేకించే అన్నమయ్య, శ్రీనాధుడు, వేమన వంటివారు సాహిత్యం ద్వారా తమ వంతు ప్రయత్నం చేశారు. పల్నాటి వీరుడు బ్రహ్మనాయుడు మహావీరుడైన కన్నమదాసును తన సర్వసైన్యాధ్యక్షుడిగా కొనసాగిస్తాడు. పల్నాటి చరిత్రలో బ్రహ్మనాయుడు, నాగమ్మ తో సమఉజ్జిగా కన్నమదాసు కనిపిస్తాడు. బ్రహ్మనాయుడికి అత్యంత విశ్వాసపాత్రుడిగా కూడా కనిపిస్తాడు.

త్రిపురనేని వంటి వారు…

సమాజంలో సీతలు, ఏకలవ్యులు, శంభూకులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు. ఈ సీత తరపున పోరాటం “ఫెమినిజం” అయింది కానీ ఏకలవ్యులు, శంభూకుల తరపున పోరాటానికి ఏ “ఇజం” రాలేదు. అది ఇంకా “సామాజిక వివక్ష వ్యతిరేక పోరాటం” పేరుతోనే సాగుతోంది. ఈ పోరాటానికి అప్పుడప్పుడూ “భవభూతి” (శంభూకుడి చరిత్రకారుడు) లాంటి వారు వస్తూ ఉంటారు. అలాంటి ఒకానొక “భవభూతి” త్రిపురనేని రామస్వామి చౌదరి. ఈ వివక్ష స్వయంగా అనుభవించే వారిలో కూడా జాషువా, కన్నమదాసు, అంబేద్కర్ వంటివారు సమాజ ముఖచిత్రంపై వచ్చి, తమదైన ముద్రవేసి వెళుతూ ఉంటారు. ఆ ముద్రలు కూడా సమాజాన్ని ఆరోగ్యకరంగా ఉంచేందుకు మూలస్తంభాలుగా నిలుస్తాయి. ఇది సమాజ పరిణామ క్రమం. సమాజంలోని అవలక్షణాలకు వైద్యం చేసేందుకు ఈ సామాజిక వైద్యులు అవసరం ఉంది. సామాజిక అవలక్షణాలు బయటపడినప్పుడల్లా త్రిపురనేని వంటి సామాజిక వైద్యుల అవసరం ఉంటూనే ఉంటుంది. వైద్యంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంలా కన్నమదాసులూ, అంబేద్కర్ ల అవసరమూ ఉంటుంది.

సామాజిక వైద్యుడు….

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు ఓ సామాజిక వైద్యుని అవసరం కనిపిస్తోంది. కన్నమదాసు, అంబేద్కర్ వంటి ఆహారం, వ్యాయామం అవసరమూ కనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఏకలవ్యుల బొటనవేలు తెగిపడుతూనే ఉన్నా, శంభూక వధ జరుగుతూనే ఉన్నా, ప్రస్తుతం అవి అంత తీవ్రంగా కనిపించడం లేదు. రాష్ట్రంలో రెండు ప్రధాన కులాల మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు అందుకు కారణం. ఇప్పుడు ఈ ఆధిపత్య పోరులో శంభూక వధ అప్రధానంగా కనిపిస్తోంది. రాజకీయ రంగు పులుముకున్న ఈ ఆధిపత్య పోరు చాలా హేయంగా, అమానవీయంగా సాగుతోంది. ఈ ఆధిపత్య పోరు ప్రజాస్వామ్యాన్ని కూడా గుర్తించనంత స్థాయికి చేరింది. ఆధిపత్య పోరు తమ ప్రత్యర్థిని గుర్తించడానికి కూడా అంగీకరించని అధమ స్థాయికి చేరుకుంది.

రెండు ప్రధాన కులాలకు….

ఈ రెండు ప్రధాన కులాలకు నాయకత్వ స్థానంలో ఉన్న ఇద్దరు నాయకులూ ప్రత్యర్థి వర్గం నుండి కనీస గౌరవం పొందే పరిస్థితి కనిపించడం లేదు. వారి అనుచరగణం, అభిమానగణం కూడా శృతిమించిన పదప్రయోగం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడుని గుర్తించేందుకు ప్రత్యర్థి వర్గం సిద్ధంగా లేదు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గుర్తించేందుకు ప్రత్యర్థి వర్గం అంగీకరించడం లేదు. ఈ వైరం ఆరోగ్యకరమైన సామాజిక పరిణామం కాదు. రెండు పార్టీలుగా ఉండాల్సిన వ్యక్తులు ఇప్పుడు రెండు కులాలుగా అనారోగ్యకరమైన పోరాటంలో చిక్కుకున్నారు. ఈ పోరాటానికి ఏకలవ్యులు, శంభూకులు, సీతలు అక్కర్లేదు కానీ ఏకలవ్యుల బొటనవేళ్ళు తెగుతూనే ఉంటాయి. శంభూకుల తలలు రాలి పడుతూనే ఉంటాయి. సీతలు అగ్నిప్రవేశం చేస్తూనే ఉంటారు. అయినా అవి అప్రస్తుతంగానూ, అప్రాధాన్యంగానూ పక్కకు ఒదిగి పోతాయి.

అనారోగ్యకర వాతావరణం…

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో చాలా విషయాలు అప్రధానంగా పక్కకు జరిగిపోతున్నాయి. బలమైన రెండు పొటేళ్ళు తలపడినప్పుడు ఇతర గొఱ్ఱెల ఆకలి, అవసరాలు అప్రధానం అవుతాయి. రాష్ట్రంలో ఈ పొటేళ్ళ పోరాటం ఇంత అనారోగ్యకరంగా జరుగుతున్నప్పుడు, సామాజిక ప్రయోజనాల దృష్ట్యా త్రిపురనేని వంటి సామాజిక వైద్యుడి అవసరం ఉందనిపిస్తోంది. త్రిపురనేని “వీరగంధం” తెచ్చి పూస్తే తప్ప ఈ జబ్బు తగ్గేలా, రాష్ట్రం ఆరోగ్యంగా ఉండేలా లేదు. అప్పుడెప్పుడో స్వాతంత్య్ర పోరాటం కోసం త్రిపురనేని తెచ్చిన “వీరగంధం” ఇప్పుడు ఆరోగ్యకరమైన సమాజంకోసం వాడాల్సి ఉంది. ఈ “వీరగంధం” పూశాక కన్నమదాసులూ, అంబేద్కర్ లూ కూడా “పోస్ట్ సర్జరీ” (post- surgery) పని కోసం వస్తారు. “వీరగంధం”తో పాటు “పోస్ట్ సర్జరీ క్లినికల్ కేర్” కూడా అవసరమే.

 

-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News