మళ్లీ గర్జిస్తున్నారే?

రాజకీయాల్లో, సినిమాల్లో అవుట్ డేటేడ్ అవుతున్నా ఇంకా తాము లైమ్ లైట్ లో ఉన్నామని చెప్పుకుంటూ భ్రమల్లో బతకడమే అసలైన విచిత్రం. అందుకే అక్కడ ఏజ్ బార్ [more]

Update: 2020-02-05 00:30 GMT

రాజకీయాల్లో, సినిమాల్లో అవుట్ డేటేడ్ అవుతున్నా ఇంకా తాము లైమ్ లైట్ లో ఉన్నామని చెప్పుకుంటూ భ్రమల్లో బతకడమే అసలైన విచిత్రం. అందుకే అక్కడ ఏజ్ బార్ అయినా డిబార్ అయినా కూడా పాత ముఖాలకు రంగులేసుకుని సిధ్ధంగా ఉంటారు. అవకాశం వస్తే మళ్లీ హీరో కావాలన్న తాపత్రయమే వారిని అలా తెర నీడలో ఉండేలా చేస్తుంది. విషయానికి వస్తే రాయలసీమ కోసం పోరాటాలు చాలా జరిగాయి. అక్కడ ప్రాంతాల అభివృధ్ధి కోసం రోడ్లెక్కిన నేతలు ఎంతో మంది చరిత్రలో కనిపిస్తారు. అయితే ఆధునిక తరంలో మాత్రం పోరాటాలకు స్వస్తివాచకం పలికేశారు. దీంతో మళ్లీ పాతతరమే జూలు విదిలిస్తోంది.

యంగ్ టర్కులుగా…

నాడు అంటే ఎన‌భై దశకంలో యంగ్ టర్కులుగా సీమ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి. ఎంవీ మైసూరారెడ్డి వంటి వారు ఉండేవారు. అప్పట్లో అన్న నందమూరి జమానాలో వైఎస్ ఒక ఆట ఆడుకున్నారు. సీమకు నీళ్ళ కోసం పాదయాత్రలు, ఉద్యమాలు పెద్ద ఎత్తున చేశారు. టీడీపీ సర్కార్ని గడగడలాడించారు. దాని వల్ల సీమకు ఎంత మేలు జరిగిందో తెలియదు కానీ వైఎస్ చరిష్మా ఒక్కసారిగా పెరిగింది. మైసూరా సైతం హోం మంత్రి దాకా కీలకమైన పదవులు కాంగ్రెస్ లో చేపట్టారు. ఇపుడు సీమలో మిగిలిన పాతతరం నేతల్లో మైసూరారెడ్డి ఒకరుగా ఉన్నారు.

గ్రేటర్ రాయసీమట…..

మైసూరారెడ్డి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎందుకో పెదవి విప్పలేదు, గడప దాటలేదు. పైగా ఆయన బాబు తరం రాజకీయ నాయకుడు కూడా. అయినా సీమ గురించి పల్లెత్తు మాట నాడు మాట్లాడని మైసూరారెడ్డి ఇపుడు సమరశంఖం పూరిస్తున్నారు. సీమకు అన్యాయం జరిగితే ఊరుకోను అంటూ గద్దిస్తున్నారు. రాయలసీమకు కనీసం హైకోర్టు బెంచ్ కూడా ఇవ్వని చంద్రబాబుపై పోరు చేయని మైసూరా జగన్ మీద మాత్రం గట్టి బాణాలే వేస్తున్నారు. రాజధానిని కర్నూల్లో పెట్టాలని మైసూరారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ కచ్చితమైన అమలుకు పూనుకోకపోతే గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని కోరుతామని తెగేసి చెబుతున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకుని మరీ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమిస్తామని అంటున్నారు. ఆయనకు టీడీపీ మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వంటి వారు తోడవుతున్నారు. ఈ వృధ్ధ నాయకులు ఉద్యమాలు చేయగలరా అన్నదే పెద్ద ప్రశ్న.

జగన్ బలం ముందు …

రాయలసీమ అంటేనే వైస్ కుటుంబానికి పెట్టని కోట. అది ఎన్నో ఎన్నికల్లో రుజువు అయింది. ఇక తాజా ఎన్నికల్లో మొత్తం సీమలోని 52 సీట్లకు గానొ 49 గెలుచుకుని గొప్ప చరిత్రను సృష్టించిన ఘనత జగన్ ది. జగన్ మాటే వేదంగా సీమ రాజకీయం నడుస్తుంది. అక్కడ టీడీపీ బాగా బలహీనంగా ఉంది మరో వైపు చూసుకుంటే కొత్త తరం నాయకులు పూర్తిగా జగన్ వెంట ఉన్నారు. పాత కాలం పులులు ఉద్యమాలు చేస్తాం అంటే పట్టించుకునే తీరిక, ఓపికా జనానికి ఉన్నాయా అన్నది పెద్ద ప్రశ్న. పైగా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టుని ఇస్తున్న జగన్ దానితో పాటు భారీ ఎత్తున అభివ్రుధ్ధికి కూడా అక్కడ ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపధ్యంలో ఉడత ఊపులకు జగన్ బెదురుతారా అన్నది చర్చగా ఉంది. ఏది ఏమైనా జగన్ పార్టీలో చేరి తరువాత బయటకు పోయిన మైసూరారెడ్డి ఇపుడు ఆయన మీదనే కత్తులు దూస్తే సహించేందుకు యువ ముఖ్యమంత్రి సిధ్ధంగా ఉండరని గట్టిగా వినిపిస్తున్న మాట. జన బలం లేని నాయకుల ప్రకటనలకు విలువ ఇవ్వాల్సినది లేదని కూడా వైసీపీలో మరో మాటగా ఉంది.
.

Tags:    

Similar News