తిరుగుబాటుకు సిల్లీ కాజ్… ఏం చేయలేరా?

మాములు పరిస్థితుల్లో అయితే మయన్మార్ అంతగా అంతర్జాతీయ వార్తల్లోకి ఎక్కదు. ఆగ్నేయ ఆసియాలో ఈ చిన్నదేశానికి ప్రపంచంలో పెద్దగా ప్రాధాన్యం కూడా లేదు. మయన్మార్ పేరు చెప్పగానే [more]

Update: 2021-02-23 16:30 GMT

మాములు పరిస్థితుల్లో అయితే మయన్మార్ అంతగా అంతర్జాతీయ వార్తల్లోకి ఎక్కదు. ఆగ్నేయ ఆసియాలో ఈ చిన్నదేశానికి ప్రపంచంలో పెద్దగా ప్రాధాన్యం కూడా లేదు. మయన్మార్ పేరు చెప్పగానే ముందు గుర్తుకు వచ్చేది ఆ దేశ ప్రజాస్వామ్య పోరాటయోధురాలు అంగ్ శాన్ సూకీ, అక్కడి సైనిక పాలకుల దురాగాతాలు. అంతకుమించి ఒకప్పటి ఈ బర్మా దేశం గురించి చెప్పుకొనేదేమీ లేదు. తాజాగానూ ఈ విషయంపైనే మయన్మార్ మళ్లీ ప్రపంచ వార్తల్లోకి ఎక్కింది. ఫిబ్రవరి ఒకటో తేదీ తెల్లవారు జామున అనూహ్యంగా సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ప్రభుత్వ అధినేతఅంగ్ శాన్ సూకీని, పార్లమెంటు సభ్యులను అరెస్టు చేసింది. గృహ నిర్బంధంలో ఉంచిది. ఏడాదిపాటు అత్యవసర పరిస్థితిని విధించింది.

నాలుగు నెలల క్రితం….

నాలుగు నెలల క్రితం గత ఏడాది నవంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో అంగ్ శాన్ సూకీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ ఎల్ డీ) మొత్తం 476 స్థానాలకు గాను 396 స్థానాలతో ఘన విజయం సాధించింది. సైన్యం మద్దతు గల యూనియన్ సాలిడారిటీ డెవలప్ మెంట్ పార్టీ కేవలం 33 సీట్లతో సరిపెట్టుకుని ఘోర పరాజయాన్ని చవిచూసింది. నాటినుంచి అవమానభారంతో ఉన్న సైన్యం అంగ్ శాన్ సూకీని ఎలాగైనా దెబ్బతీయాలని అవకాశం కోసం ఎదురుచూస్తోంది. సూకీ స్టేట్ కౌన్సిలర్ హోదాలో ఉన్నారు. ఇది మన దేశంలో ప్రధాని పదవితో సమానమైనది.

తొలి సమావేశం రోజునే….

కొత్తగా ఎన్నికైన పార్లమెంటు తొలి సమావేశం ఫిబ్రవరి ఒకటిన నిర్వమించాలని నిర్ణయించారు. అదేరోజు తెల్లవారు జామున సైన్యాధిపతి జనరల్ మిన్ అంగ్ లయాంగ్ తిరుగుబాటు చేశారు. అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇందుకు ఆయన చెప్పిన కారణం చూస్తే ఆశ్ఛర్యం కలగక మానదు. నవంబరు నాటి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని అందుకే తిరుగుబాటు చేశామని జనలర్ లయాంగ్ చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. అంతా సవ్యంగానే ఉందని ఒక పక్క ఎన్నికల సంఘం చెబుతున్నా సైన్యం అందుకు భిన్నమైన వాదన వినిపిస్తుండటం గమనార్హం.

కొత్తేమీ కాకపోయినా…?

మయన్మార్ కు మిలటరీ పాలన కొత్తేమీ కాదు. 1948లో బ్రటీష్ పాలన నుంచి స్వాతంత్ర్యం సాధించుకున్నప్పటి నుంచి కొద్దికాలం మినహా ఎక్కువ కాలం మిలటరీ పాలనలోనే మగ్గింది. 1962లో మిలటరీ పాలన మొదలైనది. మధ్యమధ్యలో అప్పుడప్పుడూ ప్రజా ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ అవిపూర్తిగా సైన్యం కనుసన్నల్లో పనిచేసేవన్నది చేదు నిజం. మయన్మార్ లో తిరుగుబాటును ఐరాసతో సహ అనేక పాశ్ఛాత్యదేశాలు ఖండించాయి. కఠిన మైన ఆంక్షలు విధిస్తామని అగ్రరాజ్యాధినేత జో బైడెన్ హెచ్చరించారు. విధించారు కూడా. ఒక్క చైనా మాత్రం అది వారి అంతర్గత వ్యవహారమని, అధికార మార్పిడిలో భాగమని పేర్కొంది. మయన్మార్ సైనిక పాలకులకు బీజింగ్ పరోక్ష మద్దతు ఉన్న సంగతి తెలిసిందే.

భారత్ సరిహద్దుతో…..

భారత్ సైతం మయన్మార్ పరిణామాలను ఖండించింది. మయన్మార్ తో భారత్ 1468 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. మిజోరామ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్రాలు మయన్మార్ తో సరిహద్దులు కలిగి ఉన్నాయి. ఈశాన్య భారతంలోని వేర్పాటువాద, ఉగ్రవాద సంస్థలకు గతంలో మయన్మార్ కేంద్రంగా ఉండేది. తరవాత రోజుల్లో మయన్మార్ తన వైఖరిని మార్చుకుంది. మణిపూర్ లోని ‘మోరే’, మిజోరామ్ లోని ‘జోరిన్ పుయి’, అరుణాచల్ ప్రదేశ్ లోని ‘డిపుపాస్ ’ వద్ద మయన్మార్ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఉన్నాయి. పొరుగు దేశంగా మయన్మార్ లో ప్రశాంత పరిస్థితులు నెలకొనాలని భారత్ కోరుకుంటోంది. అక్కడ ప్రశాంతత నెలకొంటే ఈశాన్య భారతంపైనా దాని ప్రభావం ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News