పెద్దాయన లేని లోటు కనిపిస్తోందట…?

తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెద్ద దిక్కుగా దివంగత నేత మాజీ ఎంపీ ఎంవీవీస్ మూర్తి ఉండేవారు. ఆయన 2018 అక్టోబర్ 2న అమెరికాలో ఒక రోడ్డు [more]

Update: 2021-02-02 13:30 GMT

తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెద్ద దిక్కుగా దివంగత నేత మాజీ ఎంపీ ఎంవీవీస్ మూర్తి ఉండేవారు. ఆయన 2018 అక్టోబర్ 2న అమెరికాలో ఒక రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారు. ఎన్టీయార్ పిలుపు అందుకుని 1982లో టీడీపీలో చేరిన పారిశ్రామికవేత్త మూర్తి కడదాకా అదే అంకిత భావాన్ని పార్టీ పట్ల చూపించారు. ప్రత్యేకించి ఆయన చంద్రబాబుకు ఆంతరంగీకుడు. ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లో చీమ చిటుక్కుమన్నా కూడా బాబుకు ఆయనే చేరవేసేవారు.

నాటి నుంచే అలా….

ఇక టీడీపీకి ఎంత మంది నాయకులు ఉన్నా, ఎంత పెద్ద పదవుల్లో వారు ఉన్నా కూడా మూర్తి మాటే ఫైనల్. ఆయన కనుసన్నలలోనే పార్టీ నడిచేది. చంద్రబాబు అందరితో మాట్లాడినా కూడా మూర్తితో చివరలో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చేవారు. ఇక పార్టీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధినాయకత్వం దృష్టికి తీసుకువచ్చి సరిచేసే మెకానిజంగా కూడా మూర్తి ఉండేవారు. దాంతో మూడు జిల్లాల్లో టీడీపీ కంచుకోటగా మారడానికి మూర్తి లాంటి వారి పాత్ర చాలానే ఉంది అంతా ఒప్పుకుంటారు.

ప్రధాన ఆర్ధిక వనరుగా…

బేసికల్ గా పారిశ్రామికవేత్త అయిన మూర్తి టీడీపీకి వెన్నుదన్నుగా ఉండేవారు. పార్టీని ఆర్ధికంగా ఆయన ఆదుకునేవారు. అర్బన్ జిల్లాలోని పార్టీ ఆఫీస్ ని ఆయన ఒంటి చేత్తో నడిపించారు అంటారు. ఆయన మరణించాక పార్టీ ఆఫీస్ నిర్వహణ భారం ఏంటో తమ్ముళ్ళకు ఒక్కసారిగా తెలిసివచ్చింది. ఇక ఎన్నికల వేళ పార్టీకి అర్ధ అంగబలాన్ని కూడా మూర్తి సమకూర్చిపెట్టేవారని చెబుతారు. ఆయన రాజకీయ వ్యూహాలతో పాటు, పార్టీని ఏకతాటిపైకి నడిపించే తీరు కూడా ఎన్నో విజయాలకు కారణం అయ్యాయని పేర్కొంటారు.

కష్టమేనా..?

ఇక ఎపుడైతే మూర్తి కనుమరుగు అయ్యారో నాటి నుంచి విశాఖ సిటీలో టీడీపీ ఒక విధంగా అనాధ అయిందని అంటున్నారు. పార్టీ కార్యాలయం కూడా కళకళలాడడంలేదు అన్న వారూ ఉన్నారు. ఇక పార్టీకి కొండంత అండగా నిలిచే మూర్తి ప్లేస్ ని భర్తీ చేయడం కష్టమన్న మాట కూడా తమ్ముళ్ళ నుంచి వినిపిస్తోంది. ఇపుడు పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సీన్ ఉంది. ఇక అధినేత చంద్రబాబుకు కూడా మూడు జిల్లాల పార్టీ తీరు గురించి కచ్చితమైన సమాచారం కూడా చేరడంలేదు అంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఉత్తరాంధ్రాలో సైకిల్ రిపేరు కి వచ్చిందని విశ్లేషిస్తున్నారు. మళ్ళీ పెద్దాయన పాత్రలోకి ఎవరైనా వస్తేనే తప్ప పసుపు పార్టీ పటిష్టం కావడం కష్టమేనని తేల్చేస్తున్నారు.

Tags:    

Similar News