ఈ వైసీపీ ఎంపీ కూడా పార్టీపై అసంతృప్తిలో ఉన్నారా?

పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్ళు తప్ప అన్నది వామపక్ష నినాదం. అదే తారకమంత్రంగా భావించి కాని కాలంలో జపిస్తే ఉన్నది ఉంచుకున్నదీ రెండూ పోతాయి మరి. [more]

Update: 2021-03-02 13:30 GMT

పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్ళు తప్ప అన్నది వామపక్ష నినాదం. అదే తారకమంత్రంగా భావించి కాని కాలంలో జపిస్తే ఉన్నది ఉంచుకున్నదీ రెండూ పోతాయి మరి. అయితే విశాఖలో రాజీనామాల ఫోబియాలో కొందరు నేతలు ఉన్నారు. వారి మనసులో ఏముందో కానీ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పేరు మీద తాము కూడా త్యాగ పత్రాలు సమర్పించి త్యాగమూర్తులుగా చరిత్రలో నిలవాలని తెగ ఉబలాటపడుతున్నారు. ముందుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు దీనికి తోవ తీస్తే ఇపుడు ఆయన బాటలో నడిచేందుకు వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా ఒక్క లెక్కన ఉరుకుతున్నారు.

అలా కలసి వచ్చి….

నిజానికి ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ కాక మునుపు విశాఖలో ఎవరికీ పెద్దగా తెలియదు. ఆయన ఒక బిల్డర్ మాత్రమే. ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు జగన్ గోదావరి జిల్లాల పాదయాత్రలో ఉండగా పార్టీలో చేరి ఎంపీ టికెట్ సంపాదించారు. అనూహ్యంగా ట్రయాంగిల్ పోటీలో ఎంపీ అయిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూసినపుడు ఎంవీవీ సత్యనారాయణ గెలుపు వెనక రాజకీయ అదృష్టమే ఉందని చెప్పాలి. నిజంగా జగన్ వేవ్ విశాఖ సిటీలొ గట్టిగా ఉంటే ఆయన మెజారిటీ అసలు మూడు వేలకు పడిపోయేది కాదు. పైగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కనుక జనసేన నుంచి లోక్ సభ బరిలో లేకపోతే కచ్చితంగా విశాఖ నుంచి టీడీపీ జెండావే ఎగిరేది అని కూడా అంతా ఒప్పుకుంటారు.

ఎందుకలా…

అయితే ఇరవై నెలల ఎంపీ పదవిలో ఎంవీవీ సత్యనారాయణ సంతృప్తిగా లేరా అన్న మాట కూడా ఉంది. వైసీపీలో అన్నీ విజయసాయిరెడ్డి మాత్రమే అయి కధ నడుపుతూండడంతో ప్రజల నుంచి గెలిచి వచ్చిన ఈ లోక్ సభ సభ్యుడు ప్రతీదానికీ తగ్గిపోవాల్సివస్తోంది. దాంతో పాటు ఆయన అన్ని పార్టీలతో సాన్నిహిత్యం నెరపడం కూడా వైసీపీ పెద్దల చూపు దాటిపోలేదు అంటారు. ఇవన్నీ ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎంవీవీకి టికెట్ దక్కడమూ కష్టమే అన్న మాట కూడా ఉంది. ఈ నేపధ్యంలోనే ఆయన తనను తాను ప్రూవ్ చేసుకునేందుకేనా ఇలా రాజీనామా చేస్తాను అని తరచూ అంటున్నారు అన్న చర్చ వైసీపీలో ఉంది. వైసీపీ హై కమాండ్ రాజీనామాలకు వ్యతిరేకమని ఇప్పటికే కచ్చితంగా చెప్పేసింది. అయినా సరే ఎంవీవీ సత్యనారాయణ రాజీనామా చేస్తాను పదే పదే అంటున్నారు అంటే సొంత గుర్తింపు కోసం ఆయన తపన పడుతున్నారు అనుకోవాలి.

అలా అయితే కష్టమేగా…?

ఇక ఎంవీవీ సత్యనారాయణ రాజీనామా చేస్తే అది పూర్తిగా వైసీపీకి వ్యతిరేక నిర్ణయమే అవుతుంది. పైగా ఇతర ఎంపీల మీద వత్తిడి కూడా పెరుగుతుంది. ఇక ఎంపీ రాజీనామా చేసినా ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ పెట్టదు అన్న గ్యారంటీ కూడా ఏదీ లేదు. ఇలా వాస్తవాలు కళ్ళ ముందు ఉండగా తాను రాజీనామాకు సిద్ధమని ఈ ఎంపీ గారు అంటున్నారు అంటే రాజకీయంగా వేరే రకమైన ప్లాన్స్ ఉన్నాయా అన్న మాట కూడా పార్టీలో వస్తోందిట. ఒకసారి ఎంపీ అయ్యాక ఎంవీవీ సత్యనారాయణ కూడా తనదైన రాజకీయం నేర్చారని దాన్నే ఇపుడు ఆయన ప్రయోగిస్తున్నారు అంటున్నారు. ఇవన్నీ సరే కానీ ఇలా ఎంపీ రాజీనామా అంటూ ఉరకడం వెనక ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలూ వైసీపీలో ఉన్నాయట. మొత్తానికి ఎంవీవీ ఆవేశం చూస్తూంటే నిజంగా రాజీనామా చేసేలాగే ఉన్నారు అంటున్నారు.

Tags:    

Similar News