గులాబీ గూటిలో మున్సిప‌ల్ ముస‌లం...

Update: 2018-07-07 12:16 GMT

గులాబీ గూటిలో మున్సిప‌ల్ రూపంలో ముస‌లం మొద‌లైంది. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా.. ప‌లువురు మున్సిప‌ల్ చైర్మ‌న్ల‌పై కౌన్సిల‌ర్లు తిరుగుబావుటా ఎగుర‌వేస్తున్నారు. దీనికి ఆయా జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలే కార‌ణ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో మ‌న్సిప‌ల్ రాజ‌కీయాలు అన్ని పార్టీల్లో వేడిపుట్టిస్తున్నాయి. ఇప్పుడే ఎందుకిలా జ‌రుగుతుంద‌నే ప్ర‌శ్న అంద‌రిలో ఉత‌న్న‌మ‌వుతోంది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంప‌ల్లి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌, బోధ‌న్‌, తాజాగా.. న‌ల్ల‌గొండ జిల్లా భువ‌న‌గిరి, ఇప్పుడు ఏకంగా ప‌ర‌కాల మునిసిప‌ల్ చైర్మ‌న్ కాంగ్రెస్‌లో చేరిపోవ‌డంతో తెలంగాణ‌లో మున్సిప‌ల్ రాజ‌కీయాలు వేడిపుట్టిస్తున్నాయి. అధికార పార్టీ నుంచి ప‌లువురు ఇత‌ర పార్టీల్లోకి జంప్ కావ‌డం వ‌ల్లే చైర్మ‌న్ల‌పై అవిశ్వాస తీర్మాన విష‌యం ముందుకు వ‌స్తోంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

ఛైర్మ‌న్‌పై అవినీతి ఆరోప‌ణ‌లు

ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలోని బోధ‌న్‌ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల మధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌నీ, సొంత ప్ర‌యోజ‌నాల చుట్టే తిరుగుతున్నార‌నీ కౌన్సిల‌ర్లు ఆరోపిస్తున్నారు. ఏకంగా ఛైర్మన్ ఎల్లంపై అవిశ్వాసం పెట్టేందుకు అనుమతించాలంటూ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌కు విన‌తి ప‌త్రం అందించారు. ఈమేర‌కు అవిశ్వాసానికి మద్దతుగా మెజార్టీ కౌన్సిలర్లతో కూడా సంతకాలు చేయించ‌డం గ‌మ‌నార్హం. చైర్మ‌న్‌ను గ‌ద్దె దించేంద‌కు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీరికి పెద్ద‌ల ఆశీస్సులు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఎంఐఎంను ప్రోత్స‌హిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మేల్యే...

బోధన్‌ మున్సిపాల్టీలో 35 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్‌ 15, టీఆరెస్ 9, ఎంఐఎం 7, బీజేపీ 3, టీడీపీ ఒక‌ స్థానం గెలిచాయి. ప్ర‌స్తుతం 29 మంది చైర్మన్ ఎల్లంకు వ్యతిరేకంగా ఉన్నారు. అంతేగాకుండా.. టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఏకంగా ఎంఐఎంలో చేరిపోయారు. ఇతర పార్టీలకు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు, ఎంఐఎం మద్దతుతో టీఆరెస్ నేత ఎల్లంకు చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కింది. బోధ‌న్ సిట్టింగ్ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ రాకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయనే స్వ‌యంగా ఎంఐఎంను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి.

మ‌ళ్లీ సొంతగూటికి భువ‌న‌గిరి ఛైర్ ప‌ర్స‌న్‌...

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా భువనగిరి మున్సిపాలటీలో కూడా రాజకీయం అనూహ్య మ‌లుపులు తిరుగుతోంది. బీజేపీ నుంచి గెలిచిన సుర్వి లావణ్య...ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఇటీవ‌ల ఆమె మ‌ళ్లీ బీజేపీలో చేరారు. దీంతో ఛైర్మన్‌ సుర్వి లావణ్యపై అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిలర్లు ఏకమయ్యారు. ఏకంగా 24 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్ని పార్టీల కౌన్సిలర్లతో దీనిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వెంటనే ఆమెను పదవి నుంచి తొలగించాలని కౌన్సిలర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

కాంగ్రెస్ గూటికి ప‌ర‌కాల ఎమ్మెల్యే...

ఇక బెల్లంప‌ల్లిలో తాను మ‌ద్ద‌తు ఇస్తోన్న వ్య‌క్తి చైర్మ‌న్ అయ్యేందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య ఏకంగా ఓ కౌన్సిల‌ర్ కుమార్తెను బెదిరించిన ఆడియో టేపులు బ‌య‌ట‌కు రావ‌డంతో పెద్ద క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఇక టీఆర్ఎస్‌కు ఎంతో బ‌లం ఉన్న పాత వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర‌కాల మునిసిప‌ల్ చైర్మ‌న్ మూర్తిరాజు భ‌ద్ర‌య్య అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరిపోయారు. నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ బ‌లంగా ఉన్నా ఇక్క‌డ ఆయ‌న అనూహ్యంగా ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న వేళ కాంగ్రెస్‌లో చేరి అంద‌రికి షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ఈ ప‌రిణామాలు టీఆర్ఎస్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్న తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఈ రూపంలో బ‌య‌ట ప‌డుతోంద‌న్న చ‌ర్చ‌లు కూడా తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. మ‌రి కేసీఆర్ వీటికి ఎలా చెక్ పెడ‌తారో ? చూడాలి.

Similar News